షాంఘైలో ఓ భారత మహిళ వేధింపులను సమర్ధించుకున్న చైనా

షాంఘైలో ఓ భారత మహిళ వేధింపులను సమర్ధించుకున్న చైనా

అరుణాచల్‌ ప్రదేశ్‌ అంశంపై షాంఘై విమానాశ్రయంలో ఓ భారత మహిళకు వేధింపులకు గురిచేశారని ఆరోపణలను చైనా తోసిపుచ్చింది. ఇమ్మిగ్రేషన్ అధికారులు తీసుకున్న చర్యలు పూర్తిగా చట్టాలు, నిబందనల ప్రకారంగా ఉన్నాయని చైనా విదేశాంగ స్పష్టం చేసింది.  పెమా వాంగ్‌జోమ్‌ థాంగ్‌డోక్పై ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోవడం నిర్బంధించడం లేదా వేధింపులకు గురిచేయడం వంటివి చేయలేదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ తెలిపారు. 

అధికారులు చట్టాలు, నిబంధనల ప్రకారం మొత్తం ప్రక్రియను పూర్తి చేశారని చెప్పారు. అదే సమయంలో విమానయాన సంస్థ ఆమెకు విశ్రాంతి కోసం స్థలం, నీరు, ఆహారం అందించిందని ఆమె చెప్పారు. సంబంధిత వ్యక్తి హక్కులు, ప్రయోజనాలను పూర్తిగా కాపాడారని చెప్పారు. జాంగ్నాన్ లేదా దక్షిణ టిబెట్గా పిలిచే అరుణాచల్ ప్రదేశ్, చైనా భూభాగమే అని మావో పునరుద్ధాటించారు. భారత్ సరిహాద్దుల్లోని ఈ రాష్ట్రాన్ని చైనా ఎప్పుడూ గుర్తించలేదని ఆమె పేర్కొన్నారు.

అయితే విదేశాంగశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్, చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ చేసిన తాజా వ్యాఖ్యలను పూర్తిగా తోసిపుచ్చారు. అరుణాచల్ ప్రదేశ్‌ భారత్​లో అంతర్భాగమని తెలిపారు. ఈ విషయం స్వయంప్రతిపాదితమైన వాస్తవమని చెప్పారు. చైనా ఎంత తిరస్కరించినా దీన్ని మార్చలేరని ఆయన స్పష్టం చేశారు.

నవంబర్ 21న మా వాంగ్‌జోమ్‌ థాంగ్‌డోక్‌ అనే మహిళ లండన్ నుంచి జపాన్‌కు వెళ్లే విమానం ఎక్కారు. అయితే ట్రాన్సిట్ హాల్ట్ కోసం అది చైనాలోని షాంఘైలో దిగిన తన పాస్‌పోర్ట్‌ను అధికారులు తనిఖీ చేశారని ఆమె చెప్పారు. అందులో తాను పుట్టిన రాష్ట్రం పేరు అరుణాచల్ ప్రదేశ్‌ ఉంటడం చూసిన ఇమిగ్రేషన్ అధికారులు ఈ పాస్‌పోర్ట్ చెల్లదని ప్రకటించారని ఆమె ఆరోపించారు. 

వారు ఆ ఈశాన్య రాష్ట్రాన్ని చైనాలో భాగమని పట్టుబట్టారని, ఇమిగ్రేషన్ అధికారులు, చైనా ఈస్టర్న్‌ ఎయిర్‌లైన్స్ సిబ్బంది తనవైపు చూసి నవ్వారని, చైనీస్ పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకోమని హేళన చేశారని ఆమె వాపోయారు. చెల్లుబాటు అయ్యే వీసా ఉన్నా కూడా తన పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకున్నారని, జపాన్‌ వెళ్లే విమానం ఎక్కనివ్వలేదని వెల్లడించారు. దీనిపై భారత్ విదేశాంగశాఖ తన నిరసనను చైనాకు తెలిపింది.