అస్సాం ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ ఇటీవలే సింగపూర్ వెళ్లి అక్కడ ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోవడంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సంచలన ప్రకటన చేశారు. జుబీన్ ప్రమాదంలో చనిపోలేదని, ఆయన హత్యకు గురయ్యారంటూ అసెంబ్లీలో వెల్లడించారు. గాయకుడి మృతిపై చర్చించేందుకు ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానం సందర్భంగా సీఎం ఈ మేరకు సంచలన ప్రకటన చేశారు.
‘జుబీన్ గార్గ్ ప్రమాదవశాత్తూ మరణించలేదు. ఆయన్ని హత్య చేశారు’ అని వ్యాఖ్యానించారు. 52 ఏండ్ల సింగర్ జుబీన్ గార్గ్ సెప్టెంబర్ 19న సింగపూర్‌లో ప్రమాదవశాత్తూ మరణించిన విషయం తెలిసిందే. స్కూబా డైవింగ్ సందర్భంగా చోటుచేసుకున్న ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయన మరణంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో సింగర్ మృతిపై సీఎం హిమంత బిశ్వ శర్మ దర్యాప్తునకు ఆదేశించారు.
డీజీపీ ఎంపీ గుప్తా నేతృత్వంలో 10 మందితో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. జుబీన్ సన్నిహితులు, మేనేజర్ సహ అనుమానితులపై సిట్ దృష్టి సారించింది. ప్రమాద సమయంలో అక్కడున్న వారిపై నిఘా పెట్టారు. ఈ కేసులో జుబీన్ మేనేజర్, వ్యక్తిగత భద్రతా సిబ్బంది సహా పలువురిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
అరుదైన చర్యగా, గాయకుడు-సూపర్ స్టార్ జుబీన్ గార్గ్ మరణం గురించి చర్చించడానికి ప్రతిపక్షం ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానానికి అసెంబ్లీ శీతాకాల సమావేశాల మొదటి రోజున అనుమతించారు. దీనిని ప్రతిపక్ష నాయకుడు, ముఖ్యమంత్రి ఇద్దరూ “అపూర్వమైనది” అని అభివర్ణించారు. సమావేశం ప్రారంభంలో, ప్రతిపక్ష నేత దేబబ్రత సైకియా, శివసాగర్ ఎమ్యెల్యే అఖిల్ గొగోయ్ ఇద్దరూ ఈ అంశంపై వాయిదా తీర్మానాన్ని ఆమోదించాలని అభ్యర్థించారు.
ముఖ్యమంత్రి శర్మ స్పీకర్ బిశ్వజిత్ డైమరీని ఈ ప్రతిపాదనను అనుమతించాలని అభ్యర్థించారు. “మేము ఎవరూ వాయిదా తీర్మానాన్ని వ్యతిరేకించడంలేదు, కానీ మద్దతు కూడా ఇవ్వడం లేదు. ఎందుకంటే జుబీన్ గార్గ్ హత్య అస్సాంకు పూడ్చలేని నష్టం” అని శర్మ పేర్కొంటూ “జుబీన్ పట్ల అందరికీ ఉన్న ప్రేమను గౌరవించడం” కోసం దీనిని ఆమోదిస్తున్నామని చెప్పారు.
ప్రతిపక్ష నేత సభాసంఘం నియమించాలని కోరగా, ప్రస్తుతం జరుగుతున్న సిట్ దర్యాప్తును ప్రశ్నించడం ద్వారా ప్రతిపక్ష సభ్యులు నిందితులకు సహకరిస్తున్నట్లు అవుతుందని హెచ్చరించారు.

More Stories
క్రైస్తవ సైనికాధికారి తొలగింపుకు సుప్రీం సమర్ధన
గ్యాస్ ఛాంబర్లా ఢిల్లీ.. సగం మంది ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్ హోమ్!
అయోధ్యలో ధ్వజారోహణ ముందు ధ్వజ పూజ