ధర్మధ్వజం భారతీయ సాంస్కృతిక పునర్వికాసానికి చిహ్నం

ధర్మధ్వజం భారతీయ సాంస్కృతిక పునర్వికాసానికి చిహ్నం

అయోధ్యలో ఎగురవేసిన ధర్మధ్వజం కేవలం జెండా మాత్రమే కాదని భారతీయ సాంస్కృతిక పునర్వికాసానికి చిహ్నమని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. అయోధ్యలో ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లతో కలిసి అయోధ్య రామాలయ నిర్మాణం సంపూర్ణం అయినందుకు గుర్తుగా ఆలయ శిఖరంపై ధ్వజారోహణ కావిస్తూ రామ భక్తుల సంకల్పం సిద్ధించిందని తెలిపారు. 

శతాబ్దాల గాయాలు, బాధలు నేడు నయమైనట్లు, 500 ఏళ్ల నాటి తీర్మానం నెరవేరినట్లు తెలిపారు. రామరాజ్య వైభవాన్ని ఈ జెండా ప్రతిబింబిస్తుందని, శ్రీరాముడి సిద్ధాంతాలను ప్రపంచానికి చాటుతుందని పేర్కొన్నారు. అసత్యంపై చివరికి సత్యం విజయం సాధిస్తుంది అనడానికి ఈ పవిత్ర జెండా నిదర్శనంగా నిలుస్తుందని మోదీ వ్యాఖ్యానించారు. దేశం, ప్రపంచం రామమయంగా మారిందని చెప్పారు.

2047 నాటికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తవుతాయని అప్పటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా మారాలని మోదీ భరోసా వ్యక్తం చేశారు. “శతాబ్దాల నాటి గాయాలకు ఇవాళ ఉపశమనం లభించింది. ఐదు శతాబ్దాలుగా ఉన్న సమస్య పరిష్కారమైంది. ధర్మధ్వజంపై ఉన్న కోవిదార్‌ వృక్షం మన ఇతిహాసాల వైభవానికి ప్రతీక. భారతీయ సాంస్కృతిక చైతన్యానికి అయోధ్య సాక్షిగా నిలిచింది. రామభక్తుల సంకల్పం సిద్ధించింది” అని ప్రకటించారు. 

“రామాలయ నిర్మాణ యజ్ఞానికి ఇవాళ పూర్ణాహుతి. ధర్మధ్వజం కేవలం జెండా మాత్రమే కాదు. ఈ ధర్మధ్వజం భారతీయ సంస్కృతి పునర్వికాసానికి చిహ్నం. సంకల్పం, సఫలతకు ఈ ధ్వజం చిహ్నం. ఈ ధ్వజం శ్రీరాముడి సిద్ధాంతాలను ప్రపంచానికి చాటుతుంది. ఈ ధర్మధ్వజం ప్రపంచానికి ఒక స్ఫూర్తి, ప్రేరణను ఇస్తుంది” అని ప్రధాని తెలిపారు. 

“కర్మ, కర్తవ్యాల ప్రాముఖ్యాన్ని ధర్మధ్వజం చెప్తుంది. పేదలు, దుఃఖితులు లేని సమాజాన్ని మనం ఆకాంక్షిస్తున్నాం. ధర్మధ్వజాన్ని దూరం నుంచి చూసినా రాముడిని చూసినంత పుణ్యం వస్తుంది. కోట్లాది మంది రామభక్తుల కల ఇవాళ సాకారమైంది. రామమందిర నిర్మాణానికి సహకరించిన అందరికి నమస్కరిస్తున్నా” అని చెప్పారు.

“మనచుట్టూ కొందరు బానిస భావజాలం ఉన్నవారు ఉన్నారు. బానిస భావజాలం ఉన్న వ్యక్తులకు చోటు ఇవ్వొద్దు. బానిస భావజాలం ఉన్న వ్యక్తుల నుంచి విముక్తి పొందాలి. ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు భారత్‌. శతాబ్దాల క్రితమే భారత్‌లో ప్రజాస్వామ్య విధానం ఉంది. తమిళనాడులోని ఉత్తర మేరూర్‌ శాసనం ప్రజాస్వామ్యం గురించి చెప్తోంది” అని పిలుపిచ్చారు. 

“భారత్‌లో ప్రతి ఇంట్లో, ప్రతి మనసులో రాముడు ఉన్నాడు. రాముడు ఓ కాల్పనిక వ్యక్తి అని బానిస భావజాలం ఉన్నవారు చెబుతున్నారు. వచ్చే వెయ్యేళ్లు భారత్‌ తన శక్తిని ప్రపంచానికి చాటాలి. మానవ వికాసానికి అయోధ్య కొత్త నమూనా ఇస్తుంది. అయోధ్య రాముడిని ఇప్పటికే 45 కోట్ల మంది దర్శించుకున్నారు. ఒక వ్యక్తి పురుషోత్తముడిగా ఎలా ఎదిగాడో అయోధ్య చెప్తుంది” అని ప్రధాని తెలిపారు.

“రాముడు కులం చూడడు, భక్తి మాత్రమే చూస్తాడు. ఆదర్శ పురుషుడు శ్రీరాముడికి బేధభావాలు ఉండవు. క్షమాగుణాన్ని మించిన గొప్ప గుణం మరొకటి లేదు” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రామమందిర నిర్మాణం కోసం ప్రాణాలను త్యాగం చేసిన వారు ఈరోజు శాంతిని పొంది ఉంటారని, ఆచారబద్ధమైన జెండా ఎగురవేయడం ఒక చారిత్రాత్మక క్షణాన్ని సూచిస్తుందని మోహన్ భగవత్ తెలిపారు.

“అశోక్ జీ (అశోక్ సింఘాల్) ఈరోజు శాంతిని అనుభవించి ఉంటారు. మహంత్ రామచంద్ర దాస్ జీ మహారాజ్, దాల్మియా జీ (సీనియర్ విశ్వహిందూ పరిషత్ నాయకుడు విష్ణు హరి దాల్మియా),  అనేక మంది సాధువులు, విద్యార్థులు తమ ప్రాణాలను అర్పించిన అన్ని వర్గాల ప్రజలు, పాల్గొనలేకపోయినప్పటికీ ఎల్లప్పుడూ ఈ ఆలయం గురించి కలలు కన్న వారు కూడా ఈరోజు నెరవేరినట్లు భావిస్తారు” అని తెలిపారు.

మరోవైపు అయోధ్యలో ధ్వజారోహణం కొత్త యుగానికి శుభారంభమని ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తెలిపారు. రామభక్తులకు ఇది ఎంతో శుభదినమని పేర్కొంటూ దేశీయ, అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణంతో అయోధ్యకు అనుసంధానం పెరిగిందని తెలిపారు.  అయోధ్య నగరం కోసం ప్రత్యేకంగా సోలార్‌ ప్లాంట్ల నిర్మాణం జరిగిందని విద్యుత్‌లో స్వయం సమృద్ధి సాధించిందని యోగి ఆదిత్యనాథ్ వివరించారు.
 
 “మర్యాద పురుషోత్తముడు శ్రీరామ భగవానుడి భవ్య మందిరంపై ధ్వజారోహణం ఒక యజ్ఞం పరిపూర్ణమవడమే కాదు ఒక కొత్త యుగానికి శుభారంభం. ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసేందుకు సహకరించిన ప్రధాని నరేంద్ర మోదీకి ఉత్తరప్రదేశ్‌ ప్రజలు, రామ భక్తులందరి తరపున అభినందనలు తెలపడానికి సంతోషిస్తున్నాను.” అని యోగి ఆదిత్యనాథ్‌ చెప్పారు.