దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకు పెరిగిపోతున్న కాలుష్యం తీవ్రత, పెల్లుబికుతున్న నిరసనల దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చలికాలంలో నగరం గ్యాస్ ఛాంబర్‌లా మారిన వేళ ప్రైవేట్ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని ఆదేశించింది. తమ ఉద్యోగుల్లో సగం మందిని ఇంటి నుంచే పని చేసేలా, మిగతా సగం మంది ఆఫీసుకు వచ్చేలా చూడాలని ఆయా సంస్థలను కోరింది ప్రభుత్వం.
పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 లోని సెక్షన్ 5లో పేర్కొన్న నిబంధలన ప్రకారం పర్యావరణ శాఖ, అటవీ శాఖ ప్రైవేట్ కంపెనీలకు ఈ ఆదేశాలను జారీ చేసింది. ప్రస్తుతం ఢిల్లీలో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. చలికాలంలో కాలుష్యం తీవ్రత ఆందోళన రేకెత్తిస్తోంది. పీఎం2.5, పీఎం10 నిర్ణీత మోతాదు కంటే ఎక్కువగా నమోదయ్యాయి. దాంతో, రేఖా గుప్తా నేతృత్వంలోని ప్రభుత్వం కాలుష్య నియంత్రణ చర్యలు చేపడుతోంది.
ఈ క్రమంలోనే ప్రైవేట్ కంపెనీలు తమ ఉద్యోగుల్లో సగం మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని ఆదేశించింది. ప్రస్తుత పరిస్థితుల్లో తప్పనిసరిగా ఈ నియమాన్ని పాటించాలని సదరు సంస్థలకు ఢిల్లీ ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఢిల్లీని 1987లో కాలుష్య నియంత్రణ ప్రాంతాల జాబితాలో చేర్చారు. గాలి నాణ్యత నిర్వహణ కమిషన్ సూచలను అనుసరించి ఢిల్లీలో గ్రేడ్ రెస్పార్స్ యాక్షన్‌ను పూర్తి చేశారు అధికారులు.
మరోవంక, వాయు కాలుష్యంతో శ్వాస తీసుకోవడానికి సైతం ఇబ్బంది పడుతున్న ఢిల్లీ ప్రజలకు మరో సమస్య ముంచుకొచ్చింది. ఆఫ్రికా దేశమైన ఇథియోపియాలో బద్దలైన ఓ అగ్నిపర్వత ధూళి ఢిల్లీ మీదుగా కదులుతున్నది. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో అవి దేశ రాజధానికి చేరుకున్నాయని ఇండియా మెట్‌స్కై వెదర్ వెల్లడించింది.
ఎర్ర సముద్రంపై నుంచి తూర్పు దిశగా వ్యాపిస్తున్న పొగ మబ్బులు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో భారత్ వైపు ప్రయాణించాయి. జోధ్‌పూర్-జైసల్మేర్ రీజియన్ మీదుగా దేశంలోకి ప్రవేశించాయని ఇండియా మెట్ స్కై వెదర్ పేర్కొంది. అయితే ఆ బూడిద 25 వేల నుంచి 45 వేల ఫీట్ల ఎత్తులో పయణిస్తున్నదని, అంతగా భయపడాల్సిన అవసరం ఏమీ లేదని స్పష్టం చేసింది.

More Stories
అయోధ్యలో ధ్వజారోహణ ముందు ధ్వజ పూజ
అయోధ్యలో విష్ణు సహస్రనామ అథర్వశీర్ష ఆహుతులు
అయోధ్యలో శ్రీ రామ సహస్రనామార్చన