తల్లిపాలపై ఒక అధ్యయనంలో యురేనియం ఆనవాళ్లు కనిపించడం ఆందోళన కలిగిస్తున్నది. తల్లి పాలు తాగే బిడ్డలపై దీని ప్రభావం పడుతుందని ఆ అధ్యయనం హెచ్చరించింది. రాష్ట్రంలో చాలా కాలంగా ఉన్న భూగర్భ జలాల్లో విషపూరిత లోహాల సమస్యపై కొత్త ఆందోళనలు తలెత్తుతున్నాయి. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించిన పరిమితి కంటే చాలా తక్కువగా యురేనియం స్థాయిలు ఉండటంతో ఎలాంటి భయం అవసరంలేదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
బీహార్ రాజధాని పాట్నాలోని మహావీర్ క్యాన్సర్ సంస్థాన్ పరిశోధనా కేంద్రం, ఢిల్లీకి చెందిన లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, ఎయిమ్స్ శాస్త్రవేత్తల బృందం బీహార్లో ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. బిడ్డలకు పాలిచ్చే ఆరు జిల్లాలకు చెందిన 40 మంది తల్లుల నుంచి తల్లి పాలు నమూనాలు సేకరించి, వాటిలో యూరేనియం ఆనవాళ్లను పరిశీలించారు.
బీహార్లో సేకరించిన 40 మంది తల్లుల పాల నమూనాల్లో యూరేనియం-238 ఆనవాళ్లు కనిపించాయి. 5 పీపీబీ (పార్ట్స్ పర్ బిలియన్) వరకు ఉన్నట్లు శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. దీంతో తల్లులతోపాటు తల్లిపాలు తాగే శిశువులకు క్యాన్సర్ కారక ఆరోగ్య ప్రమాదం 70 శాతం వరకు పొంచి ఉన్నట్లు అంచనా వేశారు. తల్లి పాల ద్వారా యురేనియంకు గురైన శిశువులు మూత్రపిండాలు దెబ్బతినడం, నాడీ సంబంధిత సమస్యలు, తరువాతి జీవితంలో క్యాన్సర్ ప్రమాదం వంటి తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను ఎదుర్కొంటారని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
బీహార్ తాగునీరు, నీటిపారుదల కోసం భూగర్భ జలాలపై ఆధారపడటం, శుద్ధి చేయని పారిశ్రామిక వ్యర్థాలను విడుదల చేయడం, రసాయన ఎరువులు, పురుగు మందుల దీర్ఘకాలిక వాడకం వంటి అంశాలను అందుకు కారణంగా నిపుణులు సూచిస్తున్నప్పటికీ, కాలుష్యం మూలం అస్పష్టంగానే ఉందని అధ్యయనం చెబుతోంది. ఈ కారకాలు గతంలో ఈ ప్రాంతంలో ఆర్సెనిక్, సీసం, పాదరసం స్థాయిలు పెరగడానికి దోహదపడ్డాయి.
భూగర్భ జలాల్లో యురేనియం స్థాయిలు పెరుగుతుండటం దీనికి కారణమని తెలిపారు. దీని వల్ల దీర్ఘ కాలంలో తల్లులతోపాటు శిశువులపై చాలా హానికరమైన ఆరోగ్య ప్రభావాలు చూపవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిటిష్ జర్నల్ ‘సైంటిఫిక్ రిపోర్ట్స్’లో ఈ అధ్యయనాన్ని ప్రచురించారు. బీహార్ అధ్యయన ఫలితాలు శిశువుల ఆరోగ్యంపై వాస్తవ ప్రభావం తక్కువగా ఉంటుందని ఈ అధ్యయనానికి సహ రచయితగా ఉన్న ఎయిమ్స్ ఢిల్లీకి చెందిన డాక్టర్ అశోక్ శర్మ తెలిపారు.
మహిళలు తప్పనిసరిగా పిల్లలకు తల్లిపాలు ఇవ్వడం కొనసాగించాలని చెప్పారు. మరోవైపు ఎలాంటి ఆందోళన అవసరం లేదని జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్డీఎంఏ) సభ్యుడు, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ మాజీ గ్రూప్ డైరెక్టర్, సీనియర్ అణు శాస్త్రవేత్త డాక్టర్ దినేష్ కే అస్వాల్ తెలిపారు. బీహార్లోని మహావీర్ క్యాన్సర్ సంస్థాన్, పరిశోధనా కేంద్రానికి చెందిన డాక్టర్ అరుణ్ కుమార్ నేతృత్వంలోని అధ్యయనం ఫలితాలు ప్రజారోగ్యానికి ఎలాంటి ఆందోళన కలిగించవని వివరించారు.
బీహార్ తల్లుల పాలల్లో గుర్తించిన యురేనియం స్థాయిలు సురక్షితమైన పరిమితుల్లోనే ఉన్నాయని డాక్టర్ దినేష్ తెలిపారు. వాస్తవానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించిన పరిమితి కంటే తాగునీటిలోనే దాదాపు ఆరు రెట్లు ఎక్కువగా యూరేనియం స్థాయిలు ఉన్నాయని చెప్పారు.

More Stories
1990లో వైమానిక దళ సిబ్బందిని కాల్చించి యాసిన్ మాలిక్
అల్ఫలాహ్ సమీపంలో భూగర్భంలో మదర్సా
5 కోట్ల పెండింగ్ కేసులు, మధ్యవర్తిత్వంలకు ప్రాధాన్యత