అల్‌ఫలాహ్‌ సమీపంలో భూగర్భంలో మదర్సా

అల్‌ఫలాహ్‌ సమీపంలో భూగర్భంలో మదర్సా

డిల్లీ పేలుడు ఘటన ఉగ్ర డాక్టర్లకు అడ్డాగా మారిన హరియాణాలోని అల్‌ఫలాహ్‌ యూనివర్సిటీ సమీపంలో భూగర్భంలో మదర్సాను గుర్తించడం అనుమానాలకు తావిస్తోంది. ఆ భూగర్భ మదర్సా గోడలు ఏకంగా 4 నుంచి 5 అడుగుల మందంతో అసాధారణంగా ఉండటం అనుమానాలను మరింత పెంచుతుంది. ఆ మదర్సా ఇంకా నిర్మాణ దశలోనే ఉందని తెలుస్తోంది.

మదర్సాలోని ఎక్కువ భాగం భూగర్భంలోనే ఉండగా, కేవలం మూడు అడుగుల నిర్మాణం మాత్రమే భూ ఉపరితలంపై ఉంది. సాధారణంగా పౌర నిర్మాణాల గోడలను 9 ఇంచుల మందంతో నిర్మిస్తారు. కానీ ఈ మదర్సా గోడ 4 నుంచి 5 అడుగుల మందంతో ఉంది. మొత్తం 200 యార్డుల స్థలంలో ఈ నిర్మాణం చేపట్టారు. ఈ నిర్మాణానికి వైట్‌కాలర్‌ ఉగ్ర మాడ్యూల్‌ కేసులో అరెస్టైన ఉగ్రవాది ముజమ్మిల్‌ గనై డబ్బు ఇస్తున్నట్లు  గుర్తించారు. 

ఈ నిర్మాణాన్ని హరియాణా మతబోధకుడు మౌల్వీ ఇష్తియాక్‌ పేరుతో రిజిస్టర్‌ చేశారు. అల్‌ఫలాహ్‌ యూనివర్సిటీ సమీపంలోని మౌల్వీ ఇష్తియాక్‌ ఇంట్లోనే ఉగ్ర డాక్టర్లు తమ పేలుడు పదార్థాలను దాచుకున్నారు. అయితే ఎరువులు నిల్వ చేసుకుంటామని చెప్పి, తన ఇంటిని అద్దెకు తీసుకున్నారని మౌల్వీ ఇష్తియాక్‌ చెబుతున్నాడు. మరోవైపు నవంబర్ 10న ఎర్రకోట వద్ద బాంబుదాడితో వెలుగులోకి వచ్చిన వైట్‌కాలర్ ఉగ్ర నెట్వర్క్‌ గురించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వైద్యుల్లో ఉగ్రవాద భావజాలం 2019 నాటికే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల వేదికగా పురుడు పోసుకుందని దర్యాప్తు అధికారులు గుర్తించారు.

 సీమాంతర ఉగ్రవాదంలో మార్పు వచ్చిందనీ పాకిస్థాన్‌, ఇతర దేశాల్లోని ఉగ్ర హ్యాండ్లర్లు డిజిటల్ మార్గాల్లో విద్యావంతులను ఎంపిక చేసుకుని ఉగ్రభావజాలం నింపుతున్నారని దర్యాప్తులో తేలింది. ఉగ్ర డాక్టర్లు ముజమ్మిల్ గనై, అదీల్ రాథర్, ముజఫర్ రాథర్, ఉమర్ నబీ వంటివారు ఫేస్‌బుక్, ఎక్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల్లో చురుకుగా ఉన్నప్పుడు ఉకాసా, ఫైజాన్, హష్మి అనే ఉగ్ర హ్యాండ్లర్లు వారిని గుర్తించాయి. 

తర్వాత వారిని సంప్రదించి టెలిగ్రాం, మాస్టోడాన్ వంటి యాప్‌ల్లో గ్రూపుల్లో చేర్చి బ్రెయిన్‌వాషింగ్ చేయడం ప్రారంభించారు. ఏఐ వీడియోలతో ద్వేషాన్ని నింపారని సమాచారం. మొదట్లో సిరియా లేదా అఫ్గానిస్థాన్ వంటి ఘర్షణ ప్రాంతాల్లో ఉగ్రగ్రూపుల్లో చేరాలని ఈ వైద్యులు భావించారని తెలిసింది. కానీ హ్యాండ్లర్లు వారిని భారత్‌లోనే ఉండి అనేక ప్రాంతాల్లో పేలుళ్లకు పాల్పడాలని కోరినట్లు స్పష్టమైంది.

మరోవైపు ఢిల్లీ బాంబుదాడి కేసులో అదుపులోకి తీసుకున్న హరియాణా మత బోధకుడు మౌల్వీ ఇష్తియాక్‌ ప్రవర్తన ఆసక్తిగా మారింది. అల్‌ఫలాహ్‌ యూనివర్సిటీ సమీపంలో ఉన్న మౌల్వీ ఇష్తియాక్‌ ఇంట్లోనే ఉగ్రవాదులు భారీగా దాచిన పేలుడు పదార్థాలను తొలిసారి పోలీసులు గుర్తించారు. మౌల్వి ఇష్తియాక్ విచారణ అధికారులకు చెప్పిన విషయాలు ఆసక్తిగా మారాయి. 

గనై, ఉమర్‌లు మొదట్లో తనను సంప్రదించి ఎరువులను నిల్వ చేసుకునేందుకు గదిని అద్దెకు అడిగారని వివరించారు. నెలకు రూ. 2,500 చెల్లించాలని చెబితే వారు అంగీకరించారని ఇష్తియాక్ వివరించాడు. ఆరు నెలలుగా వారు అద్దె చెల్లించలేదని, తనకు ఆ డబ్బును ఇప్పించాలని దర్యాప్తు అధికారులనే ఇష్తియాక్‌ కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది.