పెద్దాడ నవీన్, సీనియర్ జర్నలిస్ట్
అడవిలో అన్నల తుపాకీ మోత ఆగిపోయిందా? ఐదు దశాబ్దాలకు పైగా భారత అంతర్గత భద్రతకు సవాలుగా నిలిచిన ‘ఎర్ర’ సామ్రాజ్యం కూలిపోవడానికి సిద్ధంగా ఉందా? కేంద్ర హోం శాఖ తాజా నివేదికలు, క్షేత్రస్థాయి పరిస్థితులు ‘అవును’ అనే సమాధానమే ఇస్తున్నాయి. మావోయిస్టు ఉద్యమం ఇప్పుడు తన “చివరి దశ”లో కొట్టుమిట్టాడుతోంది.
ఒకప్పుడు దేశవ్యాప్తంగా 180 జిల్లాల్లో విస్తరించిన మావోయిస్టుల ప్రాబల్యం, నేడు గణనీయంగా తగ్గి కేవలం 11 జిల్లాలకు మాత్రమే పరిమితమైంది. అందులోనూ చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుక్మా, నారాయణ్‌పూర్ జిల్లాల్లో మాత్రమే వారి ఉనికి కాస్త బలంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న “ట్రేస్, టార్గెట్, న్యూట్రలైజ్” విధానం సత్ఫలితాలను ఇస్తోందనడానికి గణాంకాలే సాక్ష్యం.
2004-14 మధ్య కాలంతో పోలిస్తే, 2014-24 మధ్యలో హింసాత్మక ఘటనలు ఏకంగా 53 శాతం తగ్గాయి. సంఖ్యాపరంగా చూస్తే, గతంలో 16,463గా ఉన్న దాడుల సంఖ్య, 7,700కు పడిపోవడం మావోయిస్టుల పతనానికి అద్దం పడుతోంది. ముఖ్యంగా ‘ఆపరేషన్ కగర్’ ద్వారా భద్రతా దళాలు అడవిని జల్లెడ పడుతున్నాయి. 2025లో మావోయిస్టు మిలిటరీ చీఫ్ మద్వి హిడ్మా, జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు వంటి అగ్రనాయకత్వాన్ని భద్రతా దళాలు మట్టుబెట్టడం లేదా లొంగిపోయేలా చేయడం దళాలకు కోలుకోలేని దెబ్బగా మారింది.
నాయకత్వ లేమి, భద్రతా దళాల ఒత్తిడి కారణంగా లొంగుబాట్లు భారీగా పెరిగాయి. ఒక్క 2025లోనే 1,639 మంది మావోయిస్టు కేడర్లు లొంగిపోవడం గమనించదగ్గ పరిణామం. కేవలం తుపాకీతోనే కాకుండా, ‘అభివృద్ధి’ అనే ఆయుధంతోనూ ప్రభుత్వం మావోయిస్టులను దెబ్బకొడుతోంది. మావోయిస్టుల కంచుకోటల్లోకి ప్రభుత్వం ‘3-సి’ ఫార్ములాతో (రోడ్డు, మొబైల్, ఆర్థిక కనెక్టివిటీ) చొచ్చుకుపోతోంది.
గత దశాబ్దంలో 14,607 కి.మీ.ల రోడ్లు నిర్మించడంతో పాటు, వేల సంఖ్యలో 4జి టవర్ల ఏర్పాటుతో అటవీ ప్రాంతాలకు బయటి ప్రపంచంతో అనుసంధానం ఏర్పడింది. ఏకలవ్య పాఠశాలలు, బ్యాంక్ శాఖల ఏర్పాటుతో గిరిజనులకు ప్రభుత్వ సేవలు చేరువయ్యాయి. దీంతో “ప్రజలు నీరు – మా సైన్యం చేప” అనే మావోయిస్టుల సిద్ధాంతం నీరుగారిపోతోంది.
భద్రతా బలగాలపై మెరుపుదాడులు చేయడం, మందుపాతరలు (ఐఈడిలు) పేల్చడం వంటి గెరిల్లా యుద్ధ తంత్రాలకు మావోయిస్టులు ప్రసిద్ధి. 75 మంది సి ఆర్ పి ఎఫ్ జవాన్లను ఒకేసారి అంతం చేసిన దంతెవాడ మారణహోమం వంటి ఘటనే ఇందుకు సాక్ష్యం. అయితే, భద్రతా దళాలు ఇప్పుడు అత్యాధునిక సాంకేతికత, డ్రోన్ల వినియోగం, మరియు పటిష్టమైన ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్‌తో నక్సల్స్ వ్యూహాలను తిప్పికొడుతున్నాయి.
ఈ పరిణామాలన్నీ గమనిస్తుంటే, నక్సల్బరీలో పుట్టిన ఈ సాయుధ పోరాటం అస్తమించే సమయం ఆసన్నమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, తుపాకీ తూటాలు ఆగినంత మాత్రాన శాంతి రాదు; దశాబ్దాలుగా ఉన్న గిరిజన సమస్యలు, భూ పంపిణీ అసమానతలు పరిష్కరించినప్పుడే నిజమైన విజయం సాధ్యమవుతుంది.

More Stories
రిజర్వేషన్ జీవోకు మళ్లీ న్యాయ చిక్కులు తప్పవా?
ఢిల్లీ ఉగ్రదాడికి స్వయంగా రూ 26 లక్షలు సమకూర్చిన వైద్యులు!
ప్రపంచ అభివృద్ధి ప్రమాణికాలపై పునరాలోచన