అంతర్జాతీయ ఆయుధ రాకెట్ గుట్టురట్టు

అంతర్జాతీయ ఆయుధ రాకెట్ గుట్టురట్టు

అంతర్జాతీయ అక్రమ ఆయుధ స్మగ్లింగ్ ముఠాను ఢిల్లీ పోలీసులు ఛేదించారు. పాకిస్థాన్‌ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ)తో సంబంధం ఉన్న ఆయుధ సిండికేట్ గుట్టు రట్టు చేశారు. చైనా, టర్కీలో తయారైన ఆయుధాలు పాక్‌ నుంచి భారత్‌కు డ్రోన్ల ద్వారా సరఫరా అవుతున్నట్లు తెలుసుకున్నారు.  నవంబర్ 19న అక్రమ ఆయుధ సరఫరాదారులు వాటిని అమ్మేందుకు ఢిల్లీలోని రోహిణి ప్రాంతానికి చేరుకున్నట్లు పోలీసులకు నిఘా సమాచారం అందింది.

దీంతో దాడి చేశారు. పంజాబ్‌లోని ఫిలౌర్‌కు చెందిన మన్‌దీప్‌, లూథియానాకు చెందిన దల్విందర్‌ను అదుపులోకి తీసుకున్నారు.  వారి సమాచారం ఆధారంగా అనుచరులైన ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌కు చెందిన రోహన్ తోమర్, అజయ్ అలియాస్ మోనులను అరెస్ట్‌ చేశారు. సోను ఖత్రి ముఠాతో సంబంధం ఉన్న మన్‌దీప్‌పై హత్యతో సహా అనేక క్రిమినల్ కేసులున్నట్లు పోలీసులు తెలిపారు.

కాగా,  నిందితుల నుంచి 10 అధునాతన పిస్టల్స్‌, 92 లైవ్ కార్ట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్‌ అధికారి తెలిపారు. ఇందులో ఐదు పిస్టల్స్‌ టర్కీలో, మూడు చైనాలో తయారయ్యాయని చెప్పారు. ఈ విదేశీ ఆయుధాలను పాకిస్థాన్‌ నుంచి డ్రోన్ల ద్వారా పంజాబ్‌లోని రహస్య ప్రాంతాలకు చేరవేస్తున్నట్లు వెల్లడించారు.  స్కానర్లు గుర్తించకుండా ఉండేందుకు ఆయుధాలను కార్బన్ పేపర్‌లో చుట్టి సరఫరా చేస్తున్నట్లు వివరించారు.

మరోవైపు, డ్రాప్ లొకేషన్‌ల నుంచి ఆయుధాలు సేకరించి ఢిల్లీకి డెలివరీ చేయాలని పాక్‌ ఏజెంట్లు ఈ ముఠా సభ్యులకు సూచిస్తున్నట్లు పోలీస్‌ అధికారి తెలిపారు.  ఢిల్లీ, పరిసర రాష్ట్రాలలోని నేరస్తులు, లారెన్స్ బిష్ణోయ్, బంబిహా, గోగి హిమాన్షు భాయ్ వంటి పేరు మోసిన ముఠాలకు అక్రమ ఆయుధాలను వీరు సరఫరా చేస్తున్నారని చెప్పారు. ఈ ముఠా ఇప్పటి వరకు ఎన్ని ఆయుధాలు, ఎవరెవరికి విక్రయించారు, ఈ రాకెట్‌కు సంబంధించిన ముఠాలు, వ్యక్తులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్‌ అధికారి వెల్లడించారు.