లోయలో ప్రత్యేక ప్రాంతంకై కశ్మీరీ పండిట్ల ఉద్యమం 

లోయలో ప్రత్యేక ప్రాంతంకై కశ్మీరీ పండిట్ల ఉద్యమం 
35 ఏళ్లుగా సొంత దేశంలోనే వలసదారులుగా జీవించాల్సి వస్తున్న కాశ్మీరీ పండిట్లు సహనం కోల్పోతున్నట్లు కనిపిస్తున్నది. కాశ్మీర్ లోయలో తమకు ప్రత్యేకమైన ప్రాంతం కేటాయించి, దానిని ఓ కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలనే డిమాండ్ సాధనకై జనవరి 16 నుండి `అత్యంత నిర్ణయాత్మక’ ఉద్యమం చేబడుతున్నల్టు యూత్ ఫర్ పనున్ కాశ్మీర్ (వై4పీకె) ప్రకటించింది.   జమ్మూలోని కాశ్మీరీ పండితుల అతిపెద్ద వలస శిబిరం నుండి మహా అభియాన్ అహ్వాన్ 2026 అనే ప్రచార ఉద్యమం ప్రారంభం అవుతుందని తెలిపింది. 
 
“ఉగ్రవాదం ఆవిర్భావం కారణంగా కాశ్మీర్ లోయ నుండి మనం వలస వెళ్లి 35 సంవత్సరాలు గడిచాయి. జనవరి 16న జగ్తి శిబిరం నుండి ‘మహా అభియాన్ అహ్వాన్ 2026’ను ప్రారంభిస్తున్నాము. 35 ఏళ్ల స్థానభ్రంశం చెందిన కాశ్మీరీ హిందువుల పోరాటంలో ఇది అత్యంత నిర్ణయాత్మక నాగరిక సమీకరణ అవుతుంది” అని అపెక్స్ కమిటీ చైర్మన్ రాహుల్ కౌల్ వెల్లడించారు.
 
ఈ ప్రచార ఉద్యమం “మారణహోమం ద్వారా నిర్వాసితులైన ప్రజల రాజీలేని పునరుజ్జీవనాన్ని” సూచిస్తుందని ఆయన తెలిపారు. “ఇది ‘మార్గదర్శన్ ఆదేశం’ ప్రత్యక్ష, సజీవ అమలు, భారత ప్రభుత్వం తన నిర్వాసితులలైన పౌరులతో గంభీరత, అత్యవసరత, రాజ్యాంగ బాధ్యతతో  వ్యవహరించాలని డిమాండ్ చేస్తోంది” అని కౌల్ చెప్పారు.
 
1991 నాటి మార్గదర్శన్ తీర్మానాన్ని గుర్తు చేస్తూ ఇది పనున్ కాశ్మీర్ ఉద్యమానికి ప్రధాన సైద్ధాంతిక, రాజకీయ రోడ్‌మ్యాప్‌గా పనిచేస్తుందని తెలిపారు. మహా అభియాన్ ఆహ్వాన్ 2026 “ఒక సంకేత సంఘటన కాదు, నాగరికత పిలుపు” అని స్పష్టం చేశారు. కాశ్మీరీ హిందువులను తమ మాతృభూమిలో అధికారికంగా పునరావాసం కల్పించే ప్రక్రియ వెంటనే ప్రారంభించకపోతే, ఈ ఉద్యమం “న్యాయం, గౌరవం, సరైన తిరిగి రావడానికి పోరాటంలో విభిన్నమైన, చాలా దృఢమైన కోణాలుగా పరిణామం చెందుతుంది” అని వారు హెచ్చరించారు. 
 
వై4పికె అధ్యక్షుడు విఠల్ చౌదరి ఈ ఉద్యమం “మూడున్నర దశాబ్దాలుగా తమ హృదయంలో అగ్నిని మోస్తున్న ఒక సమాజపు ఐక్య నాగరికత ప్రకటన” అని పేర్కొన్నారు. “కాశ్మీరీ హిందువుల తిరిగి రావడం ఇప్పుడు గౌరవప్రదంగా, ప్రాదేశికంగా, శాశ్వతంగా, భద్రతకు హామీ ఇవ్వబడి, మాతృభూమి కోసం మన సమిష్టి ఆకాంక్షకు అనుగుణంగా ఉండాలి. అందులో రాజీ లేదు, ఆలస్యం లేదు, అస్పష్టత లేదు” అని చౌదరి తేల్చి చెప్పారు. 
 
జగ్తి నుండి పుర్ఖూ, ముథి, నగ్రోటా, అంతకు మించి ఉన్న అన్ని వలస స్థావరాలు ఇప్పుడు ఒకే గొంతులో మాట్లాడుతున్నాయని ప్రధాన కార్యదర్శి దిగంబర్ రైనా తెలిపారు. “జాతి మారణహోమాన్ని తిరస్కరించలేము, చర్చలు జరపలేము లేదా పలుచన చేయలేము; ఇది గుర్తింపు, న్యాయం,  తిరిగి రావడానికి ఒక నిర్దిష్టమైన రోడ్‌మ్యాప్‌ను కోరుతుంది” అని ఆర్గనైజింగ్ కార్యదర్శి రాజేష్ కచ్రూ నొక్కిచెప్పారు.