కత్రాలోని శ్రీ మాతా వైష్ణోదేవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎక్సలెన్స్ లో ప్రవేశంపై ఎంపికైన మొదటి బ్యాచ్ విద్యార్థులలో 90 శాతం మంది కాశ్మీర్‌కు ముస్లిం విద్యార్థులే ఉండడం ఆందోళనకు దారితీసింది. ఆ అడ్మిషన్ జాబితాను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జమ్మూ ప్రాంతంలో విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ నిరసనలు ప్రారంభించాయి.
బిజెపి ఉధంపూర్ ఎమ్మెల్యే ఆర్ ఎస్ పఠానియా నిరసనలకు మద్దతు ఇచ్చారు. వైష్ణోదేవి మందిరానికి ఇచ్చే విరాళాలతో ఏర్పాటు చేసిన సంస్థ ముస్లిం సమాజ సభ్యుల ఆధిపత్యంలో ఉండకూడదని, హిందువులకు సీట్లు రిజర్వ్ చేయబడాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
వైష్ణోదేవి వైద్య సంస్థకు జమ్మూ కాశ్మీర్ బోర్డ్ ఆఫ్ ప్రొఫెషనల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ 50 మంది అభ్యర్థుల జాబితాను క్లియర్ చేసిన తర్వాత నిరసనలు చెలరేగాయి. వారిలో 42 మంది కాశ్మీర్‌కు చెందినవారు, ఎనిమిది మంది జమ్మూకు చెందినవారు. వారిలో, కాశ్మీర్‌కు చెందిన 36 మంది, జమ్ముకు చెందిన ముగ్గురు ఇప్పటికే అడ్మిషన్ పొందారు.
కాట్రా ఇన్స్టిట్యూట్ వెలుపల విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ప్రదర్శనలు నిర్వహించి వైష్ణో దేవి పుణ్యక్షేత్ర బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దిష్టిబొమ్మను దహనం చేశాయి. 2025-26 సెషన్‌కు అడ్మిషన్లను నిలిపివేయాలని, యాజమాన్యం తన “తప్పు”ను సరిదిద్దుకోవాలని, తదుపరి దానికి ఎంపికైన విద్యార్థులలో ఎక్కువ మంది హిందువులే ఉండేలా చూసుకోవాలని పరిషత్ జమ్మూ కాశ్మీర్ అధ్యక్షుడు రాజేష్ గుప్తా డిమాండ్ చేశారు.
ఈసారి రూపొందించిన 50 మంది జాబితాను “వైద్య కళాశాలను ఇస్లామీకరించడానికి కుట్ర” అని ఆయన ఆరోపించారు. జాబితాను సిద్ధం చేయడంలో బోర్డు పక్షపాతం చూపిందని బజరంగ్ దళ్ ప్రాంత అధ్యక్షుడు రాకేష్ బజరంగీ ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఉన్న యాత్రికుల విరాళాల నుండి కళాశాలను ఏర్పాటు చేసినందున, భారతదేశం నలుమూలల నుండి అభ్యర్థులు ఉన్న కేంద్ర నీట్ పూల్ నుండి యాజమాన్యం అడ్మిషన్లు చేయించాలని ఆయన స్పష్టం చేశారు.
“కాశ్మీర్ నుండి అభ్యర్థులు మరే ఇతర వైద్య కళాశాలలో అడ్మిషన్ తీసుకోవడానికి మాకు అభ్యంతరం లేదు. కానీ వైష్ణో దేవి మందిర విరాళాలతో ముందుకు వచ్చినందున వైష్ణోదేవి కళాశాలలో హిందూ అభ్యర్థులకు సీట్లు రిజర్వ్ చేయాలి” అని బజరంగీ తెలిపారు.
బిజెపి ఎమ్మెల్యే పఠానియా మాట్లాడుతూ, “ప్రభుత్వ నిధులు పొందే మైనారిటీ సంస్థలు కూడా తాము ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు చెప్పుకునే సమాజానికి సీట్లు రిజర్వ్ చేస్తాయి. ఇక్కడ, ఈ సంస్థ ప్రభుత్వం నుండి ఒక్క పైసా కూడా తీసుకోదు. వైష్ణో దేవి యాత్రికులు ఇచ్చే విరాళాలపై నడుస్తుంది. కాబట్టి హిందూ విద్యార్థులకు సీట్లు రిజర్వ్ చేయాలి. ఎందుకంటే ఈ సమస్య యాత్రికుల విశ్వాసంతో ముడిపడి ఉంది” అని స్పష్టం చేశారు.
పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారులు, అడ్మిషన్లు సక్రమంగా జరిగాయని, జాతీయ వైద్య మండలి మార్గదర్శకాల ప్రకారం, జమ్మూ కాశ్మీర్ లోని 13 వైద్య కళాశాలల్లోని మొత్తం 1,685 సీట్లకు అడ్మిషన్లు నీట్ జాబితా ప్రకారం జరగాలని పేర్కొన్నారు. మరో షరతు ఏమిటంటే, 85% సీట్లు కేంద్ర పాలిత ప్రాంత నివాసాలకు రిజర్వ్ చేయబడాలి, 15% దేశంలోని మిగిలిన ప్రాంతాల అభ్యర్థులకు అందుబాటులో ఉండాలి.
జమ్మూ ప్రాంతంలోని వైద్య కళాశాలల్లో ఎక్కువ సీట్లు అందుబాటులో ఉన్నప్పటికీ, కాశ్మీర్‌లో 675 సీట్లు ఉండగా, 900 సీట్లు గత కొన్ని సంవత్సరాలుగా కాశ్మీర్ విద్యార్థులు ఆక్రమించారని అధికారులు తెలిపారు. ఇంజనీరింగ్ సీట్ల విషయంలో, దీనికి విరుద్ధంగా ఉందని, జమ్మూ విద్యార్థులు వాటిని ఎంచుకునే అవకాశం ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. నీట్ ద్వారా తయారు చేసిన సెంట్రల్ పూల్ నుండి విద్యార్థులను చేర్చుకోవడానికి కళాశాల అధికారులు గతంలో కేంద్రం, జాతీయ వైద్య మండలి కోరినట్లు ఆ వర్గాలు తెలిపాయి. అయితే అందుకు రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది.

More Stories
హింసామార్గాన్ని వదిలివేస్తున్న మావోయిస్టులు
ఉగ్రవాదులకంటే ప్రమాదకరం `మేధావులు’!
ముఖ్యమంత్రి మార్పుకై ఢిల్లీకి శివకుమార్ విధేయులు!