బిహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నీతీశ్ కుమార్ గురువారం పదోసారి ప్రమాణం చేశారు. పట్నాలోని గాంధీ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్, ఏపీ సీఎం చంద్రబాబు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
ముఖ్యమంత్రి నీతీశ్‌తోపాటు 27 మంది మంత్రులు ప్రమాణం చేశారు. బీజేపీ నుంచి సీనియర్ నాయకుడు సామ్రాట్ చౌధరి, దిలీప్ జైశ్వాల్, మంగల్ పాండే, రామ్‌కృపాల్ యాదవ్, సంతోష్ సుమన్ తదితరులు మంత్రులుగా ప్రమాణం చేశారు. జేడీయూ నుంచి విజయ్ కుమార్ చౌధరి, బిజేంద్ర ప్రసాద్ యాదవ్, శ్రోవన్ కుమార్, లేసి సింగ్, సునీల్ కుమర్ల చేత గవర్నర్ అమాత్యులుగా ప్రమాణం చేయించారు. ఎల్జేపీ- రామ్‌విలాస్ పాసవాన్, రాష్ట్రీయ లోక్ మోర్చా, హిందూస్తాన్ అవామ్ మోర్చా నుంచి ముగ్గురు మంత్రులుగా ప్రమాణం చేశారు. జనవరిలో కేబినెట్ విస్తరణ ఉంటుందని ఎన్డీయే వర్గాలు తెలిపాయి.
బుధవారం జరిగిన ఎన్డీయే ఎమ్మెల్యేల సమావేశంలో శాసనసభాపక్ష నేతగా ఆయనను ఎన్నుకున్నారు. తాను ఎన్నిక కాగానే సీనియర్ నేతలు వెంటరాగా నీతీశ్, గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ వద్దకు వెళ్లారు. రాజీనామా సమర్పించి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను ఆయనకు అందజేశారు. నీతీశ్ రాజీనామాను ఆమోదించిన గవర్నర్, కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని సూచించారు. విరామం లేకుండా వెంటనే కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రారంభమైంది.

More Stories
బిల్లుల ఆమోదంలో రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించలేం
ప్రకృతి వ్యవసాయంలో గ్లోబల్ హబ్ గా భారత్
గ్రామీ అవార్డులకు దలైలామా పేరు