ముస్లింలలో అమల్లో ఉన్న మరో విడాకుల పద్ధతి ‘తలాక్-ఎ-హసన్’పై సుప్రీంకోర్టు తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తింది. మూడు నెలల పాటు ప్రతినెలా ఒకసారి ‘తలాక్’ చెప్పి విడాకులు ఇచ్చే ఈ విధానం చెల్లుబాటును ధర్మాసనం ప్రశ్నించింది. “ఆధునిక సమాజంలో ఇలాంటి పద్ధతులను ఎలా అనుమతిస్తారు?” అని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎన్కే సింగ్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఎనిమిదేళ్ల క్రితం ఇన్స్టంట్ ట్రిపుల్ తలాక్ (తలాక్-ఎ-బిద్దత్) రాజ్యాంగ విరుద్ధమని తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు, ఇప్పుడు మరో విడాకుల పద్ధతిపై దృష్టి సారించింది. ఓ ముస్లిం మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. బెనజీర్ హీనా అనే మహిళకు ఆమె భర్త గులాం అక్తర్ తన న్యాయవాది ద్వారా విడాకుల నోటీసు పంపించాడు.
ఆ తర్వాత అతను మరో వివాహం చేసుకున్నాడు. అయితే, 11 పేజీల తలాక్ నోటీసుపై భర్త సంతకం లేకపోవడంతో తన బిడ్డకు స్కూల్లో అడ్మిషన్ ఇప్పించడానికి ఇబ్బందులు పడుతున్నానని ఆమె కోర్టుకు తెలిపారు. దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ఇస్లాంలో ఇది సాధారణ పద్ధతేనని భర్త తరఫు న్యాయవాది వాదించగా.. “ఇదొక పద్ధతి ఎలా అవుతుంది? ఇలాంటి కొత్త కొత్త ఆలోచనలు ఎలా పుట్టుకొస్తున్నాయి?” అని కోర్టు ప్రశ్నించింది.
“విడాకుల విషయంలో భార్యతో నేరుగా మాట్లాడటానికి భర్తకు ఉన్న అహంకారం ఏంటి? ఇది ఒక మహిళ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. ఆధునిక సమాజంలో ఇలాంటి వాటిని ఎలా ప్రోత్సహిస్తారు?” అని ఘాటుగా వ్యాఖ్యానించింది. మతపరమైన పద్ధతుల ప్రకారం విడాకులు తీసుకోవాలనుకుంటే, నిర్దేశించిన పూర్తి విధానాన్ని పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.
తన హక్కుల కోసం పోరాడుతున్న పిటిషనర్‌ను అభినందించిన ధర్మాసనం, వనరులు లేని పేద మహిళల పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేసింది. తదుపరి విచారణకు భర్తను కోర్టుకు హాజరు కావాలని, ఆమెకు కావాల్సినవి బేషరతుగా అందించాలని ఆదేశించింది.

More Stories
తొలి 9 నెలల్లో 99 శాతం రోజులలో తీవ్రమైన వాతావరణం
ఏటీఎస్ కు మదర్సా విద్యార్థులు, మౌలానాల వివరాలు
2035నాటికి అందరికీ ఈ- పాస్ పోర్ట్‌లు