ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల మూలాలపై పరిశోధన

ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల మూలాలపై పరిశోధన
శ్రీకాకుళం జిల్లా ఉద్ధానంలో అధికంగా ఉన్న కిడ్నీ వ్యాధుల మూలాలపై పరిశోధన చేపట్టేందుకు ఇండియన్ కౌన్సెల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఆమోదం తెలిపిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి  సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. మూడేళ్ల కాల వ్యవధిలో ఈ పరిశోధన పూర్తిచేసేందుకు మూడు ద‌శ‌ల్లో ఐసీఎంఆర్ రూ.6.2 కోట్లను గ్రాంటు రూపంలో ఇస్తుందని ప్రకటించారు.
 
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలనుసరించి వైద్య ఆరోగ్య శాఖ ఉద్ధానంలో పరిశోధన నిమిత్తం ఐసీఎంఆర్ తో ఈ ఏడాది మార్చి నుంచి  జరిపిన సంప్రదింపులు ఫలించాయని మంత్రి తెలిపారు. ఐసీఎంఆర్ ‘డిపార్టుమెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్’ కింద  ‘శ్రీకాకుళం కిడ్నీ రీసెర్చ్ ప్రాజెక్ట్” పేరుతో జరిగే ఈ పరిశోధనలో భాగంగా ప‌రీక్షించే వారిలో  ఒకటి, రెండు సంవత్సరాల్లో కిడ్నీ వ్యాధుల బారినపడే వారిని గుర్తించి, ముందుగానే చికిత్స అందించేందుకు అవకాశమేర్పడుతుందని మంత్రి పేర్కొన్నారు. 
 
అలాగే కిడ్నీ వ్యాధుల  మూలాలు కనుగొనడం ద్వారా ఉద్దానం ప్రాంతంలో అవసరమైన చర్యలు తీసుకోవడానికి వీలవుతుందని వివరించారు. =
వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి, సీనియర్ నెఫ్రాలజీ ప్రొఫెసర్ డాక్టర్ రవిరాజ్ మార్గదర్శకంలో ఆంధ్ర వైద్య కళాశాల ద్వారా నెఫ్రాలజీ హెచ్ఓడి  ప్రొఫెసర్ జి.ప్రసాద్ పంపిన ప్రతిపాదనలు పరిగణనలోనికి తీసుకుని పరిశోధనకు ఐసీఎంఆర్ ఆమోదం తెలిపింది. 
 
ఈ మేరకు ఉద్దానంలో శాస్త్రీయ విధానంలో 18 ఏళ్లకు పైబడిన వారి నుంచి రక్త, మూత్ర నమూనాలు సేకరిస్తారు.  ఉద్దానం ప్రాంతంలో ర్యాండం కింద తొలి విడ‌ద‌లో 5,500 మందిని ఎంపిక చేసి వారికి ర‌క్త‌, మూత్ర ప‌రీక్ష‌లు చేస్తారు. మూత్ర న‌మూనాల‌ను ఆధునిక‌  బ‌యోమార్క‌ర్స్  విధానంలో ప‌రీక్షిస్తారు.  దీనివల్ల బాధితులకు ఒకటి, రెండు సంవత్సరాల్లో కిడ్నీ సమస్య ఏ స్థాయిలో రావచ్చున్నది స్పష్టంగా తెలుస్తుంది.  
 
ప్రస్తుతం కొత్త మందులు కూడా అందుబాటులోనికి వచ్చాయి. దీనివల్ల బాధితులు ముందుగానే మేల్కొని వ్యాధులు ముదరకుండా (డయాలసిస్, కిడ్నీ మార్పిడి వంటి) జాగ్రత్తపడే అవకాశం ఉందని, ఉద్దానంలో గతంలో అధ్యయనం చేసిన డాక్టర్ రవిరాజ్ తెలిపారు.

ఆర్ఎన్ఎ సీక్వెన్సింగ్ విధానంలో జన్యుపరమైన పరీక్షలు కూడా ఈ పరిశోధనలో భాగంగా చేస్తామని తెలిపారు. దీనివల్ల బాధితులకు జన్యుపరంగా కిడ్నీ వ్యాధులు వస్తాయా? రావా? అని కూడా తెలుస్తుందని పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ఉద్దానంలో ప్రతి వంద మందిలో 18% మంది కిడ్నీ పనితీరు సక్రమంగా లేదని తెలిపారు.

రక్త, మూత్ర నమూనాలు పరీక్షించేందుకు ఐసీఎంఆర్ ఆంధ్ర వైద్య కళాశాలలో ప్రత్యేక ల్యాబ్ ను ఏర్పాటుచేయబోతుంది.  ఉద్దానంలోని వేరువేరు ప్రాంతాల్లో  మట్టి, నీరు, గాలి, వరి, చేపలు, కూరగాయల నమూనాలు  సేకరించి కూడా పరీక్షిస్తారు. వీటి ఫలితాలనుసరించి తదుపరి చర్యలు ఉంటాయ‌ని మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ తెలిపారు.