గ్రామీ అవార్డుల‌కు ద‌లైలామా పేరు

గ్రామీ అవార్డుల‌కు ద‌లైలామా పేరు
నోబెల్ బ‌హుమ‌తి గ్ర‌హీత ద‌లైలామా తొట్ట‌తొలి సారి గ్రామీ అవార్డుల‌కు నామినేట్ అయ్యారు. ఆధ్యాత్మిక ప్ర‌వ‌చ‌నాల‌కు చెందిన ద‌లైలామా ఆల్బ‌మ్ ఆ పోటీలో ఉన్న‌ది. ద రిఫ్లెక్స‌న్స్ ఆఫ్ హిజ్ హోలీనెస్ ద ద‌లైలామా అన్న టైటిల్‌తో ఉన్న ఆల్బ‌మ్ గ్రామీల‌కు పోటీప‌డుతున్న‌ది. 90 ఏళ్ల వ‌య‌సులో ద‌లైలామా ఆ అవార్డుకు నామినేట్ కావ‌డం ఓ మైలురాయిగా భావిస్తున్నారు.
 
బెస్ట్ ఆడియో బుక్‌, నారేష‌న్‌, స్టోరీ టెల్లింగ్ రికార్డింగ్ కేట‌గిరీల్లో ద‌లైలామా ప్ర‌వచ‌నాల ఆడియో పోటీప‌డుతున్న‌ది. 2026 ఫిబ్ర‌వ‌రి 1న‌ లాస్ ఏంజిల్స్‌లో 68వ గ్రామీ అవార్డుల‌ ప్ర‌దానోత్స‌వం జ‌ర‌గ‌నున్న‌ది. క‌రుణ‌, ఆత్మ శాంతి, భావోద్వేగాల గురించి ద‌లైలామా చేసిన ప్ర‌సంగాల‌కు స‌రోద్ వాయిద్య‌కారుడు అంజ‌ద్ అలీ ఖాన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. అంజ‌ద్ కుమారుడు అమ‌న్ అలీ బంగాష్‌, అయ్య‌న్ అలీ బంగాష్ కూడా మ్యూజిక్ కంపోజ్ చేశారు.

ద‌లైలామా ఆల్బ‌మ్ కోసం అంత‌ర్జాతీయ క‌ళాకారులు ఆండ్రా డే, మ్యాగీ రోజ‌ర్స్‌, టోనీ సుకార్‌, టెడ్ నాష్‌, దేబీ నోవా, రూఫ‌స్ వెయిన్‌రైట్ ప‌నిచేశారు. ఈ ఆల్బ‌మ్‌ను గ్రామీ అవార్డు విజేత క‌బీర్ సెహ‌గ‌ల్ ప్రొడ్యూస్ చేశారు. ద‌లైలామాకు ప్ర‌తిష్టాత్మ‌క గుర్తింపు రావ‌డం సంతోష‌క‌ర‌మ‌ని అంజ‌ద్ అలీ ఖాన్ పేర్కొన్నారు.