ఇది రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను పెంచింది. పాకిస్తాన్, చైనా దేశాలకు యూనస్ ప్రభుత్వం దగ్గరవుతోంది. యూనస్ ప్రభుత్వం తమ పాలనను “రెండవ స్వాతంత్ర్యం” అని పిలుస్తోంది. యూనస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు దక్షిణ ఆసియా భౌగోళిక రాజకీయాల సమతూకంలో మార్పు కనబడుతుంది. చైనా, పాకిస్తాన్లతో సంబంధాలను మెరుగుపరుచుకునే దిశగా బంగ్లాదేశ్ అడుగులు వేస్తోంది.
తాత్కాలిక ప్రధాని యూనస్ బీజింగ్ పర్యటన సందర్భంగా బంగ్లాదేశ్‌ను “చైనా ఆర్థిక వ్యవస్థకు పొడిగింపు”గా అభివర్ణించడం న్యూఢిల్లీలో ఆందోళన రేకెత్తించింది. భారత ఈశాన్య రాష్ట్రాలకు, నేపాల్ భూటాన్‌లకు బంగ్లాదేశ్ ఒక సముద్ర ద్వారంగా మారాలని ఆయన ఆకాంక్షించారు. అయితే, దీనిని చైనా ప్రాజెక్టుల ద్వారా అమలు చేయడం భారతదేశ భద్రతకు ముప్పుగా పరిగణించబడుతుంది.
ముఖ్యంగా, తీస్తా నది నిర్వహణ, పునరుద్ధరణ ప్రాజెక్టులో చైనా ప్రమేయం భారతదేశానికి రెడ్ లైన్. ఈ ప్రాజెక్టు భారతదేశంలోని సిలిగురి కారిడార్ (చికెన్ నెక్)కు అతి సమీపంలో ఉంది. ఇక్కడ చైనా ఇంజనీర్లు డ్రెడ్జింగ్ కార్యకలాపాలు ఉండటం, యుద్ధ సమయాల్లో భారతదేశ రవాణా వ్యవస్థకు ముప్పు కలిగించవచ్చని భారత రక్షణ వర్గాలు భావిస్తున్నాయి. హసీనా ప్రభుత్వం ఈ ప్రాజెక్టు విషయంలో భారత్, చైనాల మధ్య సమతుల్యత పాటించగా, యూనస్ ప్రభుత్వం చైనా వైపు మొగ్గు చూపుతోంది.
1971 యుద్ధ గాయాల కారణంగా దశాబ్దాలుగా పాకిస్తాన్‌తో బంగ్లాదేశ్ సంబంధాలు అంతంత మాత్రంగానే ఉండేవి. కానీ యూనస్ ప్రభుత్వం ఈ చరిత్రను పక్కనబెట్టి, ఇస్లామాబాద్‌తో సంబంధాలను పునరుద్ధరిస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌కు బంగ్లాదేశ్ మ్యాప్‌తో కూడిన కళాఖండాన్ని యూనస్ బహుమతిగా ఇవ్వడం, అందులో భారతీయ భూభాగాలు ఉన్నాయనే అనుమానాలు రావడం తీవ్ర దుమారం రేపింది. దౌత్యపరమైన మార్గాల ద్వారా కాకుండా, రక్షణ ఇంటెలిజెన్స్ సహకారం పెంచుకోవడం, భారత వ్యతిరేక శక్తులకు బంగ్లాదేశ్‌లో మళ్ళీ స్థానం కల్పించే ప్రమాదాన్ని సూచిస్తోంది.
హసీనా ప్రభుత్వ పతనం తర్వాత బంగ్లాదేశ్ హిందువుల ఇతర మైనారిటీల పరిస్థితిపై ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. నిరసనల సమయంలో ఆ తర్వాత హిందువుల ఇళ్లు, ఆలయాలపై దాడులు జరిగినట్లు అనేక నివేదికలు వచ్చాయి. అయితే, యూనస్ ప్రభుత్వం వారి మద్దతుదారులు ఈ వార్తలను “భారతీయ మీడియా సృష్టిస్తున్న తప్పుడు ప్రచారం” అని కొట్టిపారేస్తున్నారు. యూనస్ స్వయంగా భారత ప్రధాని మోదీతో జరిగిన సమావేశంలో, మైనారిటీల అణిచివేత ఆరోపణలను సోషల్ మీడియా ప్రచారంగా కొట్టిపడేశారు.
అయితే, క్షేత్రస్థాయిలో హిందువులకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్, మైనారిటీల రక్షణ బాధ్యత తాత్కాలిక ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం గడిచిన కొన్ని నెలల్లో బంగ్లాదేశ్ దిశను పూర్తిగా మార్చేసింది. భారతదేశంతో ఉన్న చారిత్రక ఆర్థిక బంధాలను తెంచుకుని, కొత్త మిత్రుల కోసం అన్వేషిస్తోంది.
ఎస్ ఆలం, బెక్సిమ్కో వంటి బడా కంపెనీల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు. వీరి ఆస్తులను జప్తు చేశారు. దీనివల్ల బ్యాంకుల్లో డబ్బుల కొరత ఏర్పడింది. కొత్తగా అప్పులు పుట్టడం లేదు. ఈ పరిణామాలు పెట్టుబడిదారులను భయపెడుతున్నాయి. బంగ్లాదేశ్‌లో ఉన్న భారతీయ కంపెనీలు ఇబ్బందులు పడుతున్నాయి. మారికో, డాబర్ వంటి కంపెనీల కార్యకలాపాలకు ఆటంకం కలిగింది. వీసా కేంద్రాలు సరిగా పనిచేయడం లేదు. దీంతో భారతీయ ఉద్యోగులు అక్కడికి వెళ్లలేకపోతున్నారు. వస్త్ర పరిశ్రమకు అవసరమైన ముడిసరుకు భారత్ నుంచి వెళ్లడం లేదు. దీనివల్ల గార్మెంట్ పరిశ్రమ (ఆర్ఎంజి) సంక్షోభంలో పడింది.
యూనస్ ప్రభుత్వం ముందు రెండు దారులు ఉన్నాయి. ఒకటి రాజకీయ కారణాలతో భారత్‌ను దూరం పెట్టడం. రెండు ఆర్థిక వాస్తవాలను గ్రహించి సత్సంబంధాలు కొనసాగించడం. ప్రస్తుతం విద్యుత్ కొరత, ధరల పెరుగుదల ప్రజలను వేధిస్తున్నాయి. పొరుగు దేశంతో గొడవలు సామాన్యుడి కడుపు కొడుతున్నాయి. ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు బంగ్లాదేశ్ భవిష్యత్తును నిర్ణయిస్తాయి.

More Stories
`టెక్ శంకర్’తో సహా మరో ఏడుగురు మావోయిస్టులు హతం!
నల్లగొండలో రైతు దీక్షను విరమింపచేసిన ఏలేటి
పోలీసుల అదుపులో మావోయిస్టు ప్రధాన కార్యదర్శి దేవ్‌జీ!