మావోయిస్టు పార్టీకి ఇటీవల ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ విజయవాడ పోలీసుల అదుపులో ఉన్నాడా? ఏపీలో పట్టుబడిన వారిలోని నలుగురు కీలక నేతల్లో అతను కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లొంగుబాటు ప్రణాళికలో భాగంగా ఏఓబీ నుంచి హిడ్మా రావాల్సి ఉండగా, ముందుగానే తిప్పరి తిరుపతి విజయవాడకు వచ్చినట్లు సమాచారం.
ఒకవేళ లొంగుబాటు ప్రయత్నాలు సఫలం కాకపోతే ఏపీ నుంచి తమిళనాడుకు వెళ్లేందుకు కూడా వారు ప్రణాళికలు రచించారని ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలో దేవ్‌జీ పట్టుబడి ఉంటాడని అంటున్నారు. మరోవంక, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ నేతృత్వంలో భారీగా క్యాడర్ లొంగిపోయేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలిసింది. ఇటీవల ఆయన తెలంగాణ పోలీసులను సంప్రదించినట్టు సమాచారం.
కాగా నేడో రేపో ఆయనతోపాటు డివిజన్ కమిటీ సభ్యుడు అప్పాసి నారాయణ అలియాస్ రమేశ్, వారితో వచ్చిన క్యాడర్‌ను మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీలో కీలక సభ్యుడిగా, భద్రాద్రి కొత్తగూడెం, అల్లూరి సీతారామరాజు జిల్లాల డివిజన్ కమిటీ కార్యదర్శిగా ఆజాద్ కీలకంగా ఉన్నారు. వీరితోపాటు 20 మంది వరకు డివిజనల్, ఏరియా కమిటీల సభ్యులు లొంగిపోయేందుకు కార్యాచరణ పూర్తయినట్టు సమాచారం. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మొద్దులగూడేనికి చెందిన ఆజాద్ 1995లోనే అజ్ఞాతంలోకి వెళ్లారు.
రాష్ట్రకమిటీ కార్యదర్శి హరిభూషణ్ మృతి తర్వాత ఆ హోదా కోసం ఆజాద్, మరో రాష్ట్రకమిటీ సభ్యుడు బడే చొకారావు అలియాస్ దామోదర్ మధ్య పోటీ నెలకొంది. దీంతో అప్పట్లో చంద్రన్న నేతృత్వంలోనే తెలంగాణ కమిటీని కొనసాగించారు. ఇటీవల దామోదర్‌ను రాష్ట్రకమిటీ కార్యదర్శిగా నియమించగా.. మారిన పరిస్థితుల కారణంగా ఆజాద్ లొంగిపోయేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. అతనితోపాటు పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం ఎఫ్‌సీఐ ప్రాంతానికి చెందిన రమేశ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ టెక్నికల్ టీమ్ ఇన్చార్జిగా ఉన్నారు.
కాగా, ఏపీ పోలీసులు పలుచోట్ల నిర్వహించిన సోదాల్లో మొత్తం 50 మందికి పైగానే అరెస్టు చేసినట్లు తెలిసింది. మంగళవారం ఉదయం హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఆ వెంటనే ఏపీలోని పలు చోట్ల పోలీసులు మెరుపు దాడులు చేశారు. విజయవాడ పెనుమలూరులోని ఒక భవనంలో ఏలూరులోని ఒక అపార్ట్మెంట్లో.. కాకినాడలోని ఒక ఇంటివద్ద కూడా గ్రేహౌండ్స్, ఆక్టోపస్ పోలీసులు చుట్టుముట్టి సోదాలు చేశారు.
విజయవాడ పెనుమలూరు సమీపంలోని న్యూ ఆటోనగర్‌లోని ఓ అద్దె భవనంలో మొత్తం 31 మంది మావోయిస్టులు పట్టుబడ్డారని అధికారులు స్వయంగా వెల్లడించారు. అందులో మహిళలే ఎకువగా ఉన్నారని.. ఎకువమంది ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన మావోయిస్టులు అని ఇంటెలిజెన్స్ చీఫ్ మహేశ్ చంద్ర లడ్డా తెలిపారు. పట్టుబడిన వారిలో కీలక నేతలు ఉన్నట్లు కృష్ణా జిల్లా ఎస్పీ తెలిపారు.
వీరంతా పెద్ద నేతలకు రక్షణగా ఉండే ఆర్మీ టీం సభ్యులని కూడా అధికారులు తెలిపారు. పట్టుబడిన వారిలో దేవ్ జీకి రక్షణగా ఉండే వారు 9 మంది ఉండటంతో అతను కూడా పోలీసుల అదుపులోనే ఉన్నాడనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మాత్రం పట్టుబడిన కీలక నేతల పేర్లు వెల్లడించలేదు.
ప్రస్తుతం వారందరినీ ఆక్టోపస్, టాస్ ఫోర్స్ కార్యాలయాలకు తరలించారు. ఏలూరులో నిర్వహించిన సోదాల్లో 12 మంది మావోయిస్టులు పట్టుబడ్డారు. కాకినాడ, తిరుపతిలో కూడా కొందరిని అరెస్టు చేశారని, వారిని నేడు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. కాగా తిరుపతికి సంబంధించిన ప్రచారాన్ని పోలీసులు నిర్ధారించలేదు.
మరోవంక, ఆపరేషన్ కగార్తో వరుస ఎన్ కౌంటర్లు, అగ్రనేతల మృతితో ఛత్తీస్‌గఢ్ నుంచి మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చారన్న సమాచారంతో కొంతకాలంగా పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఏకకాలంలో రాష్ట్రంలోని అల్లూరి, కాకినాడ, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాల్లో ఇంటెలిజెన్స్, ఆక్టోపస్ బృందాలు ఆపరేషన్ చేపట్టాయి.
ఇప్పటివరకు విజయవాడలో 28, కాకినాడలో 2, ఏలూరులో 15 మందిని మిగతా ప్రాంతాల్లో మరికొంతమందితో కలుపుకుని మొత్తంగా రాష్ట్రంలో 50 మందికి పైగా మావోయిస్టులను అరెస్టు చేశారు. అలానే రాష్ట్రవ్యాప్తంగా మావోయిస్టు డంప్‌ల కోసం గాలింపు కొనసాగుతుంది. హిడ్మా డైరీ ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల సోదాలు నిర్వహిస్తున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోరుట్ల దేవ్ జీ స్వస్థలం. తిప్పిరి తిరుపతి దాదాపు 43 ఏండ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లారు. గణపతి కార్యదర్శిగా పీపుల్స్‌వార్ పార్టీ తన ప్రస్తానాన్ని కొనసాగించిన క్రమంలో మల్లోజుల కోటేశ్వర్రావు, నల్లా ఆదిరెడ్డి, శీలం నరేశ్, పులి అంజన్న, ఎర్రంరెడ్డి సంతోష్‌రెడ్డి, నంబాల కేశవరావు, మాధవ్, తిప్పిరి తిరుపతి కీలక భూమిక పోషించారు. పీపుల్స్‌వార్‌లో దళ సభ్యుడిగా ప్రస్థానం మొదలుపెట్టిన తిరుపతి, పార్టీలో అంచలంచెలుగా ఎదిగారు. 2010లో ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో 74 మంది జవాన్ల మృతికి కారణమైన ఘటనలో తిప్పిరి తిరుపతి కీలక పాత్ర పోషించారు.
More Stories
`టెక్ శంకర్’తో సహా మరో ఏడుగురు మావోయిస్టులు హతం!
నల్లగొండలో రైతు దీక్షను విరమింపచేసిన ఏలేటి
బంగ్లాదేశ్ ఆర్థిక సంక్షోభం: పాక్ చైనాలతో కొత్త స్నేహం!