* డిసెంబర్ 30 నుండి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం
గతంలో పెదజీయర్ మఠం ఉద్యోగి రవికుమార్ 900 అమెరికన్ డాలర్లు (సుమారు రూ.75 వేలు) దొంగిలించిన కేసును లోక్అదాలత్లో రాజీ చేసుకుని, అందుకు ప్రతిగా నిందితుడు రూ. 14.5 కోట్ల విలువైన ఆస్తుల్ని టీటీడీకి విరాళంగా ఇచ్చిన వ్యవహారంపై ప్రస్తుత తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ట్రస్ట్ బోర్డు తీవ్రంగా దృష్టి సారించింది.
రూ.75 వేల దొంగతనం కోసం రూ.14.5 కోట్ల ఆస్తిని ఎందుకు ఇచ్చాడు? అనే కీలక ప్రశ్న ఆధారంగా, ఈ రాజీ వెనుక భారీ కుట్ర దాగి ఉందని బోర్డు గుర్తించింది. అందుకే పాత రాజీ వ్యవహారాన్ని పక్కనపెట్టి, ఈ మొత్తం కుట్రను లోతుగా బయటపెట్టే ఉద్దేశంతో కొత్త క్రిమినల్ ఫిర్యాదు నమోదు చేయాలని ట్రస్ట్ బోర్డు ఏకగ్రీవంగా తీర్మానించింది.
ఈ వ్యవహారం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పరిధిలో విచారణలో ఉంది. 2025 అక్టోబర్ 7న హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీ సీఐడీ డీజీపీ ఈ కేసుపై పూర్తి విచారణ జరిపి సీల్డ్ కవర్లో నివేదిక సమర్పించాల్సి ఉంది. ఈ రాజీకి కారకుడైన అప్పటి అసిస్టెంట్ విజిలెన్స్ అధికారి సతీష్ ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందడంతో కేసులో అనేక అనుమానాలు మరింత బలపడ్డాయి.
పాత కేసును తిరిగి తెరిస్తే దొంగతనం విచారణ పరిధి పరిమితం అవుతుందని, దాని వెనుక ఉన్న కుట్ర మొత్తం బయటపడదని బోర్డు గుర్తించింది. అందుకే లోక్అదాలత్ రాజీని “కుట్రపూరితమైనది”గా పూర్తిగా పక్కన పెట్టేందుకు, గతంలో దాచిపెట్టిన ఇతర దొంగతనాలు, దుర్వినియోగాలన్నీ బయటకు వచ్చేలా కొత్తగా క్రిమినల్ ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.
2023 సెప్టెంబర్ 9న జరిగిన లోక్అదాలత్ రాజీని పక్కన పెట్టేందుకు నిర్ణయించిన బోర్డు, ఈ చర్య వల్ల ‘ఒకే నేరానికి రెండుసార్లు శిక్ష’ అనే ఆరోపణ రాకుండా న్యాయపరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. స్వామివారి హుండీలో పడిన ప్రతి రూపాయి భక్తుల విశ్వాసానికి ప్రతీక అని, ఆ విశ్వాసాన్ని దెబ్బతీసే ఏ చర్యనూ సహించబోమని టీటీడీ బోర్డు ప్రకటించింది.
ఈ నిర్ణయం పూర్తిగా పరిపాలనాపరంగా, భక్తుల భావాలను, సనాతన ధర్మ పవిత్రతను కాపాడే ఉద్దేశంతోనే తీసుకున్నామని బోర్డు సభ్యులు ఏకగ్రీవంగా పేర్కొన్నారు. ఈ కుంభకోణం వెనుక ఉన్న ఉన్నతాధికారుల పాత్రను కూడా కొత్త ఫిర్యాదు ద్వారా బయటపెట్టేందుకు మార్గం సుగమమైంది.
కాగా, డిసెంబర్ 30 నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నట్లు టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. మొత్తం 182 గంటల దర్శన సమయంలో 164 గంటలు సామాన్య భక్తులకే కేటాయిస్తామని తెలిపింది.దీంతో సామాన్య భక్తులకు ఎంతో మేలు జరుగుతుందని వివరించారు.
మొదటి మూడు రోజులు రూ.300, శ్రీవాణి దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. జనవరి 2 నుంచి 8 వరకు రోజుకు 15 వేలు రూ.300 దర్శన టిక్కెట్లు, 1000 శ్రీవాణి దర్శన టికెట్లు రెగ్యులర్ పద్ధతిలో కేటాయిస్తున్నట్లు చెప్పారు. మొదటి మూడు రోజులకు ఈ-డిప్ ద్వారా టోకెన్ల కేటాయింపు జరుగుతుందని చెప్పారు. నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు దర్శన టోకెన్లు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, డిసెంబర్ 2న డిప్ ద్వారా ఎంపికైన వారికి టోకెన్లు జారీ చేస్తామని తెలిపారు. మిగతా రోజులకు జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు రోజుకు 15 వేల రూ.300 దర్శన టిక్కెట్లు, 1000 శ్రీవాణి దర్శన టికెట్లు రెగ్యూలర్ పద్ధతిలో కేటాయిస్తామని వివరించారు.
More Stories
`టెక్ శంకర్’తో సహా మరో ఏడుగురు మావోయిస్టులు హతం!
నల్లగొండలో రైతు దీక్షను విరమింపచేసిన ఏలేటి
బంగ్లాదేశ్ ఆర్థిక సంక్షోభం: పాక్ చైనాలతో కొత్త స్నేహం!