నోబెల్ గ్రహీత మొహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం బంగ్లాదేశ్‌లో అంతర్యుద్ధం కోరుకుంటున్నారని బహిష్కృత ప్రధాని షేక్ హసీనా సన్నిహితుడు, అవామీ లీగ్ నేత మోహిబుల్ హసన్ చౌదరి మండిపడ్డారు. గతేడాది జులై, ఆగస్టుల మధ్య బంగ్లాదేశ్‌లో విద్యార్థుల నేతృత్వంలో జరిగిన తిరుగుబాటును పాశవికంగా అణచివేసిన కేసులో మాజీ ప్రధాని షేక్ హసీనా, మాజీ హోంమంత్రి అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్-1 సోమవారం మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే.
యూనస్ ప్రభుత్వం ‘కంగారూ కోర్టు’ పేరుతో డ్రామా ఆడిందని విమర్శిస్తూ తీర్పు ముందుగానే వ్రాసారని, తన సంజాయిషీ వినిపించేందుకు హసీనాకు అవకాశం లేదని ఆయన అరోపించారు. హసీనా, ఆమె పార్టీకి బంగ్లాదేశ్ ప్రజల మద్దతు ఉందని స్పష్టం చేశారు. యూనస్ పాలన బంగ్లాదేశ్‌లను అంతర్యుద్ధం వైపు నెడుతోందని ఆయన హెచ్చరించారు.
ఇది ఒక నాటకీయ ప్రహసనం అని, ఈ తీర్పు అమలు సాధ్యం కాదని వారికి తెలుసునని పేర్కొన్నారు. వారు ముందుగానే తీర్పు రాశారని పేర్కొంటూ ట్రిబ్యునల్ చైర్మన్ గత నెల రోజులుగా కోర్టులో లేరని తెలిపారు. అసలు కోర్టు రాజ్యాంగ విరుద్దమని, తాత్కాలిక ప్రభుత్వానికి ట్రిబ్యునల్ చట్టాలను సవరించే చట్టపరమైన అధికారం లేదని ఆయన స్పష్టం చేశారు.
అందరినీ కంగారూ కోర్టులో విచారణ కోసం ఈ విధంగా చేశారని హసన్ చౌదరి తెలిపారు. నేరం లేదా దుశ్చర్యకు పాల్పడినట్లు, ముఖ్యంగా స్పష్టమైన ఆధారాలు లేకుండా, ఆరోపణలు మోపబడిన వ్యక్తిని విచారించడానికి ఒక బృందం నిర్వహించిన అనధికారిక కోర్టును కంగారూ కోర్టుగా వ్యవహరిస్తారు.
విచారణ సమయంలో ఎటువంటి ప్రామాణిక విధానాన్ని అనుసరించలేదని, ఆమెకు తగిన అవకాశం కూడా కల్పించలేదని చెప్పారు. తమ తరపున ప్రాతినిధ్యం వహించడానికి ఢాకాలోని సీనియర్ న్యాయవాదులకు కూడా అవకాశం కల్పించలేదని చెబుతూ యూనస్ ప్రభుత్వం ప్రకటించిన నకిలీ ఎన్నికల ప్రక్రియలో పాల్గనవద్దని ఆయన ప్రజలకు సూచించారు.

More Stories
హసీనాకు మరణశిక్షను నిరసిస్తూ ఆందోళనలు
షేక్ హసీనాకు బంగ్లా కోర్టు ఉరిశిక్ష
అవినీతికి వ్యతిరేకంగా దద్దరిల్లిన ఫిలిప్పీన్స్ రాజధాని