హ‌నుమంతుడిని అవ‌మానించారని రాజమౌళిపై కేసు

హ‌నుమంతుడిని అవ‌మానించారని రాజమౌళిపై కేసు
 
‘వారణాసి’ టైటిల్‌ లాంచింగ్‌ కార్యక్రమంలో హనుమంతుడిని అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ దర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళిపై రాష్ట్రీయ వానరసేన సంస్థ ఫిర్యాదు నమోదు చేసింది. ఈ ఫిర్యాదును సోమవారం సరూర్‌నగర్ పోలీస్‌ స్టేషన్‌లో అధికారులకు అందజేశారు. ఫిర్యాదులో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు హిందువుల భావాలను తీవ్రంగా దెబ్బతీశాయని వానరసేన పేర్కొంది. 
 
ఇటీవలి కాలంలో సినిమాల్లో హిందూ దేవతలను అవమానించే ధోరణి పెరుగుతోందని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. మత విశ్వాసాలను దెబ్బతీయడం చట్ట విరుద్ధం. రాజమౌళిపై కేసు నమోదు చేసి, సమగ్ర విచారణ జరపాలి” అని సంస్థ సభ్యులు డిమాండ్‌ చేశారు.
 
పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో సినీ రంగంలో ఇలాంటి వ్యాఖ్యలు, ప్రవర్తనలకు అడ్డుకట్ట వేయాలని స్పష్టంగా పేర్కొంది. మతపరమైన భావాలను కించపరిచే వ్యాఖ్యలను ఉద్దేశపూర్వకంగా చేయకూడదని, ఇలాంటి ఘటనలు మరల జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరింది. ఫిర్యాదు నమోదయ్యాక ఈ అంశం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. 

మహేష్‌ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ చిత్రం రానుంది. ఈ నేపథ్యంలో నవంబర్ 15న ఈ సినిమా టైటిల్‌ లాంఛ్‌ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. అయితే చిన్న సాంకేతికలోపం తలెత్తడంతో ఈవెంట్‌కు కొంతసేపు అంతరాయం కలిగింది. దీంతో రాజమౌళి అసహనానికి గురయ్యారు. తనకు దేవుడి మీద నమ్మకం లేదని పేర్కొన్నారు. 

”మా నాన్న నా దగ్గరకు వచ్చి ‘హనుమంతుడి వెనక ఉండి నడిపిస్తాడు’ అని చెప్పారు. ఇలా జరిగిన వెంటనే కోపం వచ్చింది. నా భార్యకు హనుమంతుడు అంటే చాలా ఇష్టం. ఆయనను తన స్నేహితుడిలా భావిస్తుంది. నా భార్య మీద కూడా కోపం వచ్చింది. ఇలానేనా ఆయన చేసేది అనిపించింది ” అని తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

”నువ్వు సినిమా తీస్తే తీసుకో.. అది నీ ఇష్టం, దేవుళ్ళ పై ఇలా కామెంట్స్‌ చేస్తారా? అయిన దేవుళ్ళ పై నమ్మకం లేకుండానే దేవుడి పేర్లు పెట్టి సినిమాలు తీస్తున్నావా? సక్సెస్‌ తలకెక్కితే ఇలాగే ఉంటుంది. ఏం చేద్దాం? ఇప్పుడు నువ్వు దేవుళ్ళతోనే పెట్టుకున్నావ్‌ ? చూద్దాం నీ సినిమా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఎలా ముందుకు వెళుతుందా అనేది? మనుషులు తప్పు చేస్తే దేవుళ్ళను ఎందుకు నిందించడం ” అని రాజమౌళి చేసిన కామెంట్స్‌ పై నెటిజన్స్‌ మండిపడుతున్నారు. 

ఇంకొందరు ”అసలు నిన్ను ఎవరు సినిమాలు తియ్యమన్నారు? నువ్వు సినిమాలు తీసి మమ్మల్ని ఎంటర్టైన్‌ చెయ్ బాబు అని మేము చెప్పలేదుగా.. మళ్ళీ తీసి ఇలాంటి మాటలు అనడం దేనికి?” అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. వారణాసి టైటిల్‌పై కూడా వివాదం నెలకొంది. ఫిల్మ్ చాంబర్‌లో వారణాసి టైటిల్‌పై ఫిర్యాదు నమోదు అయింది. ఆ టైటిల్ తమకు ఎప్పుడో రిజిస్టర్ అయిందని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు.  పోలీసులు ఫిర్యాదు స్వీకరించిన అనంతరం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఇక వారణాసి విష‌యానికి వ‌స్తే ఈ చిత్రం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతుండ‌గా, ఇందులో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమార‌న్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఇటీవ‌ల విడుద‌లైన గ్లింప్స్ ఫ్యాన్స్‌కి మాంచి కిక్ ఇచ్చింది. 2027లో మూవీని విడుద‌ల చేసే ప్లాన్‌లో ఉన్నారు.