నక్సల్ కంచుకోట కూలిపోయింది. భద్రతా దళాలకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న మావోయిస్టు అగ్రనేత మాడ్వి హిడ్మా హతం అయ్యారు. ఈ మేరకు ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మాతో పాటు ఆయన భార్య హేమ కూడా చనిపోయారు. హిడ్మా మరణ వార్తను ఏపీ డీజీపీ హరీష్ గుప్తా ధ్రువీకరించారు. మృతి చెందిన ఆరుగురిలో హిడ్మా, ఆయన భార్య..మరో ఇద్దరు ముఖ్య నాయకులు చెల్లూరి నారాయణ రావు, పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.. ఇద్దరు మహిళల్లో ఒకరు హిడ్మా సతీమణి కాగా ఇంకొకరి వివరాలు తెలియాల్సి ఉంది..
పోలీసులు ధైర్యంగా ఆపరేషన్ నిర్వహించారని చెప్పారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశామని తెలిపారు. హిడ్మాపై రూ.కోటికిపైగా రివార్డు ఉండగా, ఆయన భార్య హేమపై రూ.50 లక్షలకుపైగా నగదు బహుమతి ఉన్నది. హిడ్మా కుమార్తె వంజెం కేషా అలియాస్ జిన్నీ ఈ ఏడాది ఫిబ్రవరిలో వరంగల్ పోలీసుల ఎదుట లొంగిపోయారు.
మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు అడవుల్లో మావోయిస్టుల కదలికలు పెరిగినట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. కూంబింగ్ నిర్వహించారు. అనంతరం మావోయిస్టులు కాల్పులు జరపగా.. పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్లో హిడ్మా, హేమతో పాటు వీరికి సెక్యూరిటీగా ఉన్న నలుగురు మావోయిస్టులు చనిపోయినట్లు సమాచారం.
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పూనర్తి గ్రామంలో హిడ్మా జన్మించారు. మాడ్వి హిడ్మా మురియా తెగకు చెందిన ఆదివాసీ. ఆయన అలసు పేరు మాద్వి హిడ్మా అలియాస్ సంతోశ్. 25 ఏండ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లారు. బస్తర్, దంతేవాడ ప్రాంత దళంలో కీలక సభ్యుడిగా ఎదిగారు. చిన్న వయస్సులోనే మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా అయ్యారు. గెరిల్లా దాడులకు వ్యూహకర్తగా పేరొందిన హిడ్మా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ప్లాటూన్-1 కమాండర్‌గా పనిచేశారు.
దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగానూ చేశారు. ఆయన మల్లా, నిషాద్ వర్గాలకు చెందిన వందలాది మందిని మావోయిస్టు పార్టీలో చేర్పించారు. వారికి సాయుధ శిక్షణ ఇచ్చి పీఎల్జీఏలో చేర్చి అభేద్యమైన సైన్యంగా తీర్చిదిద్దారు. గతంలో హిడ్మా నాయకత్వంలోనే భద్రతా బలగాలపై అనేక దాడులు జరిగాయని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.
బాలసంఘం ద్వారా మావోయిస్టు పార్టీలోకి వెళ్లారు. మావోయిస్టులు నడిపే పాఠశాలలో విప్లవ అక్షరాలు దిద్దారు. కిషన్ జీ ఆలియాస్ భద్రన్న నేతృత్వంలో సాయుధ పోరులో అడుగులు వేశారు. ఆపై జేగురుగొండ ప్రాంత దళ కమాండర్‌గా ఉన్న సమయంలో, మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు.. ఆధ్వర్యంలో జరిగిన చింతల్నార్ –టేకుమెట్ల దాడిలో ముందుండి నడిచారు. ఈ దాడిలో 76 మంది సీర్‌ఆర్‌పీఎఫ్ జవాన్లు చనిపోయారు. దంతేవాడ, సుక్మా పరిధిలో 30కి పైగా భారీ దాడులకు నేతృత్వం వహించినట్లు సమాచారం. పలు రాష్ట్రాలు హిడ్మాపై రూ.6 కోట్ల వరకు రివార్డు ప్రకటించింది.
దీంతో మావోయిస్టు పార్టీలో హిడ్మాకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత మరో అగ్రనేత చలపతి దగ్గర విప్లవ పాఠాలు నేర్చుకున్నారు మాడ్వి హిడ్మా. దాదాపు 25 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిన హిడ్మా అప్పట్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో అతి పిన్న వయస్కుడిగా ఉన్నాడు. భారీ దాడుల్లో పాల్గొంటూ భద్రతా దళాలకు మోస్ట్ వాంటెడ్ అయ్యారు. అనేక సార్లు భద్రతా దళాలకు చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నారు. అంతేకాకుండా మాడ్వి హిడ్మాకు తెలుగుతో పాటు మరి కొన్ని భాషలపై పట్టు ఉంది.
More Stories
విజయవాడ, కాకినాడలలో 31 మంది మావోయిస్టులు అరెస్టు
హనుమంతుడిని అవమానించారని రాజమౌళిపై కేసు
డాక్టర్ ఉమర్ నబీ రెండు `మిస్సింగ్ ఫోన్లు’ కీలకం!