బీహార్ ఓటమితో కర్ణాటక సీఎం మార్పుకు కాంగ్రెస్ వెనకడుగు!

బీహార్ ఓటమితో కర్ణాటక సీఎం మార్పుకు కాంగ్రెస్ వెనకడుగు!
బీహార్‌ ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బ నుంచి కోలుకోలేని స్థితిలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ  అధినాయకత్వానికి కర్ణాటక ప్రభుత్వంలో మార్పుల కోసం రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల నుంచి ఎదురవుతున్న ఒత్తిడి ఎదురవుతున్నా స్పందించడం లేదు.  బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓటమితో తన నాయకత్వం కొనసాగింపుపై సిద్ధరామయ్యలో భరోసా ఏర్పడినట్లు ఊహాగానాలు సాగుతున్నాయి. 
 
తాను పూర్తి కాలం అధికారంలో కొనసాగుతానని ఆయనలో నమ్మకం ఏర్పడినట్లు తెలుస్తోంది. అయితే పార్టీలోని ఆయన వ్యతిరేక వర్గం మాత్రం నాయకత్వ మార్పు సమస్యను అధిష్టానం తేల్చాల్సిందేనని ఒత్తిడి పెంచుతున్నట్లు తెలిసింది. ఐదేండ్లూ సీఎంగా తనను కొనసాగించాలని, ఎన్నికలకు ముఖ్యమంత్రి అభ్యర్థిగా డీకేను ప్రకటించాలని సిద్ధరామయ్య ప్రతిపాదించినట్టు సమాచారం. 
 
రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరుగుతుందా? అన్న ప్రశ్నపై కూడా డీకే స్పందిస్తూ ఆ ప్రశ్న జ్యోతిష్కుడిని అడగాలని సరదాగా వ్యాఖ్యానించారు.  ప్రస్తుతం కర్ణాటకలో ముఖ్యమైన నాయకులూ అందరూ ఢిల్లీలో ఉన్నప్పటికీ వారితో భేటీ అయ్యేందుకు కాంగ్రెస్ అధినాయకత్వం వెనుకడుగు వేస్తున్నది.
 
ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఆయన సోదరుడు, ఎంపీ డీకే సురేష్‌ ఢిల్లీలో కాంగ్రెస్‌ అగ్రనాయకులతో సమావేశం అవుతూ, కాంగ్రెస్‌ అధిష్ఠానం నుంచి అపాయింట్‌మెంట్లు కోరుతుండడం గమనార్హం. కాగా, మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ, చెరకు రైతులు, రాష్ట్రంలో వరదల పరిస్థితి తదితర అంశాలను చర్చించేందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో కూడా ఆయన సమావేశం అవుతారని తెలుస్తోంది.

పూర్తి స్థాయిలో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ జరగాలని సిద్ధరామయ్య ఆశిస్తుండగా బాగా పనిచేస్తున్న మంత్రులకు కీలక మంత్రిత్వ శాఖలను కేటాయించాలని డీకే చెబుతున్నారు. కర్ణాటక ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(కేపీసీసీ), కర్ణాటక ఇన్‌చార్జి రణ్‌దీప్‌ సింగ్‌ సూర్జేవాలా జరిపిన సమీక్షల ఆధారంగా కొందరు మంత్రులను తప్పించాలని ఆయన వాదిస్తున్నారు. 

 
జూన్‌ చివరి నుంచి జూలై ప్రారంభం వరకు వరుస సమావేశాలు కర్ణాటకలో జరిగాయి. అయితే పార్టీలో తిరుగుబాటు ఏ స్థాయిలో ఉన్నదీ, సిద్ధరామయ్య, శివకుమార్‌లకు ఎందరేసి ఎమ్మెల్యేల మద్దతు ఉన్నదీ అంచనా వేసేందుకు ఈ సమీక్షలు జరిగినట్లు ప్రచారం ఉండగా వివిధ మంత్రుల పనితీరుపై కూడా సమీక్షలు జరిగినట్లు తాజాగా తెలుస్తోంది.