పాత రిజర్వేషన్ల విధానంలోనే గ్రామపంచాయతీ ఎన్నికలు జరపాలని తెలంగాణ మంత్రివర్గం తీర్మానించింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు మాత్రం బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై వివాదం తేలిన తర్వాతే నిర్వహించాలని నిర్ణయించింది. కోర్టుల్లో పంచాయతీ ఎన్నికలపై మాత్రమే వివాదం ఉన్నందున వాటిని ముందుగా నిర్వహించాలని సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు స్పష్టంగా ఆదేశించినందున ముందుగా వాటిని పూర్తి చేయాలని నిర్ణయించారు. డిసెంబరు నెలలోనే పంచాయతీ ఎన్నికలను పూర్తి చేసేలా కసరత్తు చేయాలని అధికారులను మంత్రివర్గం ఆదేశించింది. బిసి రిజర్వేషన్లపై కేసులు కోర్టుల్లో తేలేందుకు సమయం పట్టనున్నందున ఇప్పటికే హైకోర్టు ఇచ్చిన తీర్పు, సుప్రీంకోర్టు సూచనల ప్రకారం 50 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించారు.
బీసీలకు 42 శాతం ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని డెడికేటెడ్ కమిషన్ ఇంతకముందు సూచించింది. ఇప్పుడు ఎన్నికలకు వెళ్లాలంటే 50 శాతం మించకుండా రిజర్వేషన్ల జాబితాను మరోసారి డెడికేటెడ్ కమిషన్ నుంచి తెప్పించుకోవాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల సంఖ్యపై డెడికేటెడ్ కమిషన్ నుంచి నివేదిక కోరాలని కేబినెట్ తీర్మానం చేసింది. వారంలో ఈ ప్రక్రియ పూర్తి చేసి కేబినెట్ ఆమోదం పొందాలని సూచించింది.
పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు కాంగ్రెస్ తరఫున 42శాతం సీట్లు ఇవ్వనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రయత్నించినా న్యాయ చిక్కుల వల్ల కుదరకపోవడంతో పాత కోటాతోనే ముందుకు వెళ్తున్నామని మంత్రులు తెలిపారు.
సౌదీ అరేబియాలోనే అంత్యక్రియలు
కాగా, సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు మంత్రివర్గం సంతాపం తెలిపింది. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. మంత్రి అజారుద్దీన్, ఎంఐఎం ఎమ్మెల్యే, మైనార్టీ విభాగానికి చెందిన ఓ అధికారితో కూడిన ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని వెంటనే సౌదీకి పంపించాలని సూచించింది. చనిపోయిన వారి మృతదేహాలకు మత సంప్రదాయం ప్రకారం సౌదీ అరేబియాలోనే అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది. బాధిత కుటుంబ సభ్యులను ఒక్కో కుటుంబానికి ఇద్దరు చొప్పున తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.
కాగా, వచ్చే నెల 1 నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 8,9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పెట్టాలని కేబినెట్ నిర్ణయిందని, డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని వివరించారు.
More Stories
ప్రభుత్వం ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టాలి
సౌదీ బస్సు ప్రమాదంలో 45 మంది హైదరాబాద్ వాసులు మృతి
అనర్హత విషయంలో స్పీకర్ పై `సుప్రీం’ ఆగ్రహం