పాకిస్తాన్ వ్యవస్థాగత లోపాలపై ప్రపంచ బ్యాంకు హెచ్చరిక

పాకిస్తాన్ వ్యవస్థాగత లోపాలపై ప్రపంచ బ్యాంకు హెచ్చరిక

పాకిస్తాన్ తన సొంతదేశంలో టెర్రరిజాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలినో తెలిసినంతగా మరె ఇతర రంగాల్లో తెలియదు. ఒకవైపు దేశం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే మరోవైపు ఆ దేశ ప్రధాని భారత్ తో తాము యుద్ధాన్ని సిద్ధమంటూ డాంబికాలు పలుకుతున్నారు. నిత్యం భారత్ పై ఏదో ఒక విషయంలో నిందిస్తూ, కాలం గడుపుతున్నారే తప్ప తమ సొంతదేశంలో ప్రజల జీవనస్థితిగతులు ఏమిటో గ్రహించలేని స్థితిలోఉంది. 

అందుకే ప్రపంచ బ్యాంక్ ఆదేశ స్థితిని చూపి, ఆందోళన వ్యక్తం చేస్తున్నది. తాజాగా పాకిస్తాన్ ఎదుర్కొంటున్న ఎగుమతుల సంక్షోభం తాత్కాలిక సమస్య కాదని, దశాబ్దాలుగా పేరుకుపోయిన లోతైన వ్యవస్థాగత లోపాల ఫలితమని ప్రపంచ బ్యాంకు తీవ్రంగా హెచ్చరించింది. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే తక్షణమే కీలక సంస్కరణలు చేపట్టాలని సూచించింది.

ప్రపంచ బ్యాంకు తన తాజా నివేదికలో పాకిస్థాన్ బలహీనమైన ఎగుమతులకు గల కారణాలను విశ్లేషించింది. అస్థిరమైన విధానాలు, వక్రీరించిన మార్కెట్లు,  సంస్కణలను అమలు చేయడంలో నిరంతర వైఫల్యమే ప్రస్తుత దుస్థితికి కారణమని స్పష్టం చేసింది. 1990లలో పాక్ జీడీపీలో ఎగుమతుల వాటా 16 శాతం ఉండగా, 2024 నాటికి అది కేవలం 10 శాతంకు పడిపోయిందని నివేదిక పేర్కొంది. 

ఇదే సమయంలో భారత్, బంగ్లాదేశ్, వియత్నాంవంటి దేశాలు ఎగుమతుల్లో గణనీయమైన వృద్ధిని సాధించాయని గుర్తు చేసింది. సరైన విధానాలు లేకపోవడం వల్ల పాకిస్తాన్ దాదాపు 60 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులను కోల్పోతోందని అంచనా వేసింది. పాకిస్తాన్ అనుసరిస్తున్న కరెన్సీ మార్పిడి రేటు విధానంపై కూడా ప్రపంచ బ్యాంకు ఆందోళన వ్యక్తం చేసింది. 

రాజకీయ కారణాలతో కరెన్సీ రేటును నియంత్రించడం మానేసి, పూర్తిగా మార్కెట్ ఆధారిత విధానాన్ని అనుసరించాలని సూచించింది. దీనివల్ల ఎగుమతులు పెరిగి, విదేశీ పెట్టుబడులు ఆకర్షితమవుతాయని తెలిపింది. వ్యాపార నిర్వహణకు అవుతున్న అధిక వ్యయం కూడా పాక్ పోటీతత్వాన్ని దెబ్బతీస్తోందని నివేదిక పేర్కొంది.