తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సోమవారం రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి టిటిడి జేఈవో వి. వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవో హరీంధ్రనాథ్, ఆలయ అర్చకులు, అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం ప్రసాదాలు అందజేశారు.
అనంతరం మంత్రివర్యులు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనల మేరకు టిటిడి ఆలయాల్లో అన్నప్రసాదాలు పంపిణీకి చర్యలు చేపట్టామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలకు భక్తుల సంఖ్య పెరుగుతోందని, అందుకు తగ్గట్టుగానే చర్యలు చేపట్టామని తెలిపారు.
తిరుచానూరు బ్రహ్మోత్సవాల్లో పంచమి తీర్థం రోజున దాదాపు 50 వేలకు పైగా భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, పటిష్ట చర్యలు చేపట్టాలని సూచించామని తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల కోసం టీటీడీ అన్ని వసతులు కల్పించిందని చెప్పారు. కాగా, ఈ నెల 20, 21 తేదీల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుచానూరు, తిరుమలలో శ్రీ పద్మావతీ అమ్మవారిని, శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్నారని తెలిపారు.
కాగా, శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చిన్న శేష వాహనంలో భాగంగా తెలంగాణ రాష్ట్రం నుండి గుస్సాడి, బతుకమ్మ, చెక్కభజనలతో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
అదేవిధంగా, తిరుపతి ఎస్వీ మ్యూజిక్ కాలేజీ నుండి నృత్యం, కత్తి నాట్యం, రాజమండ్రి నుండి నెమలి డ్యాన్స్, అన్నమాచార్య ప్రాజెక్టు నుండి కోలాటం, కూచిపూడి నృత్యం, హెచ్ డిపిపిపి నుండి సాంప్రదాయ పాఠశాల కళాకారులు దీపలక్ష్మీ నృత్యం, దాస సాహిత్య ప్రాజెక్టు నుండి విజయవాడ కు చెందిన కోలాటం, కర్నాటక నుండి పద్మావతీ కల్యాణం భరత నాట్యం ఆకట్టుకున్నాయి.

More Stories
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో క్రీమిలేయర్ ఉండాలి
శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
సీఐఐ సదస్సులో 613 ఒప్పందాలు, రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు