బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు బంగ్లాదేశ్ ఐసీటీ (ఇంటర్నేషన్ క్రైమ్స్ ట్రిబ్యునల్) సోమవారం మరణశిక్ష విధించింది. షేక్ హసీనా 2024 ఆగస్టులో బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవి నుంచి వైదొలగినప్పటి నుంచి భారత్ లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే షేక్ హసీనా మరణశిక్ష అంశంపై తాజాగా భారత ప్రభుత్వం స్పందిస్తూ బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలకు భారత్ కట్టుబడి ఉంటుందని వెల్లడించింది.
అదే సమయంలో షేఖ్ హసీనాను తిరిగి బాంగ్లాదేశ్ కు అప్పగించాలని అక్కడి తాత్కాలిక ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై భారత్ సమాధానం ఇవ్వలేదు. బంగ్లాదేశ్ మాజీ ప్రధానికి మరణ శిక్ష విధించిన నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ ప్రకటనలో హసీనాను అప్పగించాలనే బంగ్లాదేశ్ డిమాండ్‌పై ప్రత్యక్షంగా ప్రస్తావించలేదు.
ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఆఫ్ బంగ్లాదేశ్ షేక్ హసీనాకు సంబంధించిన తీర్పును భారత్ గమనించిందని తెలిపింది. ఒక సన్నిహిత పొరుగు దేశంగా, బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలకు, ఆ దేశంలో శాంతి, ప్రజాస్వామ్యం, స్థిరత్వం కొనసాగే విషయంలో భారత్ కట్టుబడి ఉందని పేర్కొంది. దాన్ని సాధించేందుకు తాము అన్ని రకాల పక్షాలతో ఎల్లప్పుడూ నిర్మాణాత్మకంగానే వ్యవహరిస్తామని విదేశాంగ శాఖ తన ప్రకటనలో తెలిపింది.
మరోవైపు బంగ్లాదేశ్‌లో ముఖ్య సలహాదారు మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఈ తీర్పును చారిత్రక తీర్పుగా అభివర్ణించింది. బంగ్లాదేశ్, భారత్‌ల మధ్య ఉన్న ప్రత్యర్పణ ఒప్పందం ప్రకారం షేక్ హసీనా, అసదుజ్జమాన్ ఖాన్‌లను వెంటనే అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని కోరింది. అంతకుముందు చేసిన ఇవే డిమాండ్లకు కూడా భారత్ అధికారికంగా ఎలాంటి స్పందన ఇవ్వలేదు.
ఇక తనపై వచ్చిన తీర్పు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనదని షేక్ హసీనా కొట్టిపారేశారు. ప్రజాస్వామ్య అధికారం లేని ఒక రిగ్డ్ ట్రైబ్యునల్ ఈ తీర్పును ఇచ్చిందని ఆరోపించారు. కోర్టులో తనను తాను సమర్థించుకోవడానికి తనకు సరైన అవకాశం ఇవ్వలేదని ఆమె విమర్శించారు. సరైన ట్రైబ్యునల్‌లో సాక్ష్యాలను సరిగ్గా పరిశీలిస్తే తన ఆరోపణలను ఎదుర్కోవడానికి తాను భయపడనని షేక్ హసీనా తేల్చి చెప్పారు.

More Stories
బీహార్ ఓటమితో కర్ణాటక సీఎం మార్పుకు కాంగ్రెస్ వెనకడుగు!
ఢిల్లీ పేలుడుకు ముందు డ్రోన్లతో హమాస్ తరహా దాడులకు కుట్ర
ఆర్ఎస్ఎస్ లక్ష్యం దేశాన్ని నిర్మించడమే