ఎస్పీ నేత ఆజంఖాన్‌, అబ్దుల్లా ఆజంలకు ఏడేళ్ల జైలుశిక్ష

ఎస్పీ నేత ఆజంఖాన్‌, అబ్దుల్లా ఆజంలకు ఏడేళ్ల జైలుశిక్ష
ఎస్పీ నేత ఆజంఖాన్‌, ఆయన తనయుడు అబ్దుల్లా ఆజంఖాన్‌లను డబుల్‌ పాన్‌ కార్డు కేసులో సోమవారం రాంపూర్‌ కోర్టు దోషులుగా తేల్చింది. ఇద్దరికి ఏడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.50 వేల చొప్పున జరిమానా విధించింది. కోర్టు తీర్పు వెలువరించిన అనంతరం వెంటనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.  విచారణ సమయంలో వాది బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్ సక్సేనా కోర్టుకు హాజరయ్యారు. కోర్టు తీర్పు నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
కోర్టు వద్ద బీజేపీ, ఎస్పీ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో గుమిగూడడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆజం ఖాన్‌పై నమోదైన 104 కేసుల్లో ఇప్పటివరకు 12 కేసుల్లో తీర్పులు వెలువడ్డాయి. ఏడు కేసుల్లో ఆయన దోషిగా, ఐదు కేసుల్లో నిర్దోషిగా తేలారు. రెండు పాన్ కార్డు కేసుల్లో ఏడేళ్ల జైలు శిక్ష ఎస్పీ నాయకుడికి, ఆయన కుమారుడికి భారీ ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.  బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్‌ సక్సేనా సివిల్ లైన్స్ కొత్వాలి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
అబ్దుల్లా ఆజం పాన్ కార్డులో పుట్టిన తేదీ 1993, జనవరి ఒకటి అని, ఎడ్యుకేషన్‌ సర్టిఫికెట్లలో ఇదే డేట్‌ ఆఫ్‌ బర్త్‌ ఉందని, అయితే, 2017 అసెంబ్లీ ఎన్నికల నామినేషన్‌లో సమర్పించిన పాన్‌ భిన్నంగా ఉందని ఆరోపించారు. అబ్దుల్లా ఆజం తన తండ్రి ఆజం ఖాన్‌తో కలిసి కుట్ర పన్ని ఎన్నికల అధికారుల నామినేషన్‌ పత్రాల్లో వయసు అర్హతను దాచిపెట్టేందుకు 1990 సెప్టెంబర్ 30న పుట్టిన తేదీతో నకిలీ పాన్‌ కార్డ్‌ను తయారు చేసుకున్నట్లుగా ఆరోపించారు. 
 
వయసును దాచేందుకు ఈ పాన్‌కార్డును ఉపయోగించి, అబ్దుల్లా ఆజం నకిలీ పత్రాలతో వేసిన నామినేషన్‌ను ఆమోదించారని, ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచాడని ఆరోపించారు. బీజేపీ ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు సివిల్‌ లైన్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆజంఖాన్‌తో పాటు అబ్దుల్లా ఆజంపై భారతీ శిక్షాస్మృతిలోని 420, 467, 468, 471, 120B కింద కేసులు నమోదు చేశారు. 
 
ఈ కేసును విచారించిన రాంపూర్‌ కోర్టు తాజాగా ఇద్దరిని దోషులుగా ప్రకటిస్తూ తీర్పును వెలువరించింది. ఇదిలా ఉండగా ఆజంఖాన్‌ ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సీతాపూర్‌ జైలులో దాదాపు 23 నెలల జైలు జీవితం గడిపారు. తాజాగా మరోసారి ఆయన కటకటాల పాలయ్యారు.