విద్వేషపూరిత ప్రసంగాలతో విద్యార్థులను రెచ్చగొట్టారని కోర్టు పేర్కొంది. “విద్యార్థులను ఆమె కిరాతకంగా చంపించారు. వాళ్ల మృతదేహాలను తగలబెట్టాలని పోలీసులను ఆదేశించారు. విద్యార్థి సంఘం నాయకుడు ఒకరు పోలీసుల కాల్పుల్లో మరణించారు. ఆ పోస్ట్‌మార్టం నివేదిక విషయంలోనూ భారీ అవకతవకలు జరిగాయి. ప్రభుత్వ వైద్యుడ్ని బెదిరించి ఐదుసార్లు ఆ నివేదికను హసీనా ప్రభుత్వం మార్పించింది” అని తెలిపారు.
“మాజీ ప్రధానికి గరిష్ట శిక్ష విధించాలని ప్రాసిక్యూషన్‌వాళ్లు కోరుతున్నారు. వాళ్లు సమర్పించిన ఆధారాలను పరిశీలిస్తే ప్రపంచంలోని ఏ న్యాయస్థానమైన సరే ఆమెకు గరిష్ట శిక్షనే విధిస్తుంది” అని బెంచ్‌లోని ఓ న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
మరోవైపు ఈ తీర్పు నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో ముఖ్యంగా రాజధాని ఢాకాలో హై అలర్ట్ ప్రకటించారు. ఎవరైనా వాహనాలు తగలబెట్టేందుకు, బాంబులు విసిరేందుకు ప్రయత్నిస్తే వారిని కాల్చివేయాలంటూ ఢాకా పోలీస్ చీఫ్ షేక్ మహమ్మద్ సజ్జత్ అలీ ఆదేశాలు జారీ చేశారు. ఇక తీర్పు నేపథ్యంలో ఐసీటీ చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. విద్యార్థుల ఆందోళనలతో అనూహ్యరీతిన ప్రధానమంత్రి పీఠం నుంచి దిగిపోయిన షేక్ హసీనా గతేడాది ఆగస్టు 5న బంగ్లాదేశ్‌ను వీడి భారత్‌కు వచ్చారు.
నాటినుంచి ఆమె డిల్లీలోని ఓ రహస్య ప్రదేశంలో నివసిస్తూ, అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా పలు జాతీయ మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తీర్పుకు ముందు కూడా తన దేశాన్ని ఉద్దేశించి సందేశం విడుదల చేసిన ఆమె, ఎవరూ బాధపడొద్దని అవామీ లీగ్ కార్యకర్తలను కోరారు. అవన్నీ తప్పుడు ఆరోపణలని, అటువంటి తీర్పులను తాను పట్టించుకోనని ఆమె ఉద్ఘాటించారు.
తన మద్దతుదారులకు ఆడియో సందేశం పంపిన హసీనా మహమ్మద్ యూనస్ నాయకత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం తన పార్టీని లేకుండా చేయాలని చూస్తోందని ఆరోపించారు. ‘ఇది అంత సులభం కాదు.. అవామీ లీగ్ అధికారాన్ని దోచుకున్న వ్యక్తి జేబు నుంచి కాదు, అట్టడుగు స్థాయి నుంచి వచ్చింది’ అని ఆమె హెచ్చరించారు. “నేను బతికే ఉన్నాను. ఉంటాను. ప్రజల సంక్షేమం కోసం నా పనిని ప్రారంభిస్తాను. వాళ్లు ఏ తీర్పు అయినా ఇవ్వనివ్వండి. నాకు సంబంధం లేదు. దేవుడు ఇచ్చిన ప్రాణం ఆయనే తీసుకుంటాడు. ఇప్పటివరకు నా ప్రజల కోసం పనిచేస్తాను” అని స్పష్టం చేశారు.
“ఈ దేశం కోసం నా తల్లిదండ్రులు, తోబుట్టువులను పోగొట్టుకున్నాను. వారు నా ఇంటిని కాల్చివేశారు. గోనో భవన్ (బంగ్లా ప్రధానమంత్రి అధికారిక నివాసం) నా ఆస్తి కాదు. అది ప్రభుత్వానిది. నేను దేశం వీడిన తర్వాత దానిలో లూటీ జరిగింది. అది విప్లవం అని వారు చెప్తున్నారు. గూండాలు, ఉగ్రవాదులు విప్లవాన్ని తీసుకురాలేరు.” అని హసీనా మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో ఆదివారం అర్థరాత్రి నుంచి అక్కడ ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. రాజధాని ఢాకా (Dhaka) సహా పలు చోట్ల హింస్మాతక ఘటనలు చోటు చేసుకున్నాయి. హసీనా మద్దతుదారులు యూనస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసనలు చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అప్రమత్తమైన బంగ్లా ప్రభుత్వం దేశ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది.

More Stories
ఉగ్రవాదులు, వారి మద్దతుదారులను చూస్తాం
అవినీతికి వ్యతిరేకంగా దద్దరిల్లిన ఫిలిప్పీన్స్ రాజధాని
ఉగ్రవాదంలో సాంకేతిక ముప్పు వెల్లడిస్తున్న ఢిల్లీ పేలుడు