నవంబర్ 20న బిహార్‌లో కొత్త ప్రభుత్వం

నవంబర్ 20న బిహార్‌లో కొత్త ప్రభుత్వం

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్దం చేసుకుంటుంది. నవంబర్ 19న లేదా నవంబర్ 20 కొత్త రాష్ట్రంలో ప్రభుత్వం కొలువుదీరనుంది. పట్నాలోని గాంధీ మైదానంలో ఇందుకు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. అయితే.. ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్‌ను బట్టి ఈ రెండు తేదీల్లోనే ప్రమాణస్వీకారం కార్యక్రమం ఉండనుందని సమాచారం.

జనతాదళ్ యునైటెడ్ (జెడియు) వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ కుమార్ ఝా సహా ఎన్డీఏ అగ్ర నాయకులు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి బీహార్‌లో ప్రభుత్వ ఏర్పాటు గురించి చర్చించిన తర్వాత ఈ పరిణామం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీయే ముఖ్యమంత్రులు, ఎన్డీయే పక్ష నాయకులు హాజరవుతారు.

 ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీయే ఒక ఫార్ములాను రూపొందించింన్నట్లు తెలిసింది. దీని ప్రకారం కొత్త మంత్రివర్గంలో ప్రతి ఆరుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవిని కేటాయించాలి. దీని ప్రకారం, బిజెపికి 15 లేదా 16 మంత్రి పదవులు, జెడియుకి 14 మంత్రి పదవులు లభిస్తాయి. కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)కి మూడు మంత్రి పదవులు లభిస్తాయి.

కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందుస్తానీ అవామ్ మోర్చా (సెక్యులర్), రాజ్యసభ ఎంపి ఉపేంద్ర కుష్వాహా రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్‌ఎల్‌ఎం)కి ఒక్కొక్కటి చొప్పున మంత్రి పదవులు లభించవచ్చు. కాగా, ముఖ్యమంత్రి గురించి ఎటువంటి ప్రకటన లేనప్పటికీ, పాశ్వాన్ మరియు మాంఝీతో సహా దాదాపు కూటమి నాయకులు అందరూ నితీష్ కుమార్ కి మద్దతు ప్రకటించారు. 

బీహార్ అసెంబ్లీకి జరిగిన 18వ ఎన్నికల్లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ 202 సీట్లు గెలుపొంది అధికారాన్ని నిలబెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల జాబితాను గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌ కు ఎన్నికల సంఘం సమర్పించనుంది. అనంతరం కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రకటన రానుంది. ఎన్నికల్లో విజయదుంధుబి మోగించిన నితీశ్ కుమార్ నవంబర్ 17న సోమవారం క్యాబినెట్‌తో సమావేశం కానున్నారు.

ఆ తర్వాత రాజ్‌భవన్‌కు వెళ్లి తన రాజీనామా లేఖను గవర్నర్‌కు ఇవ్వనున్నారు. గెలుపొందిన ఎన్డీఏ అభ్యర్ధులు సమావేశమై తమ కూటమి నాయకుడిని ఎన్నుకుంటారు. అందరూ అమోదించిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. గత పదమూడు పర్యాయాలు బిహార్‌ను ఏలుతున్న నితీశ్ మరోసారి సీఎం కుర్చీలో కూర్చోవడం లాంఛనమే కానుంది.