ఢిల్లీ పేలుళ్ల తర్వాత 12 మంది వైద్యుల ఫోన్లు స్విచ్ఛాప్‌

ఢిల్లీ పేలుళ్ల తర్వాత 12 మంది వైద్యుల ఫోన్లు స్విచ్ఛాప్‌
 
* ఉమర్ నబీ సహాయకుడు, మరో డాక్టర్ ప్రియాంక శర్మ అరెస్ట్
 
ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు పేలుడు జరిగినప్పటి నుంచి 12 మందికిపైగా వైద్యుల ఫోన్లు స్విచ్ఛాప్‌ అయ్యాయని, వారి ఆచూకీని తెలుసుకునేందుకు దర్యాప్తు సంస్థలు ప్రయత్నిస్తున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందులో ఎక్కువ మంది అల్‌ ఫలాహ్‌ యూనివర్సిటీకి చెందిన వారేనని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. దాదాపు 200 మంది కాశ్మీర్‌ వైద్యులపైన, దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లోని కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో చదువున్న కశ్మీర్‌ విద్యార్థులపైనా నిఘా పెట్టినట్లు అధికారులు తెలిపారు.
 
అరెస్టయిన అనుమానిత డాక్టర్‌ ముజమ్మిల్‌ ఫోన్‌ కాల్‌ డిటైల్‌ రికార్డ్‌ (సిడిఆర్) భారీ వైట్‌కాలర్‌ టెర్రర్‌ మాడ్యూల్‌ నెట్‌వర్క్‌కు సంబంధించిన సమాచారం బయటపెట్టడంతో సంబంధించి సుదీర్ఘ జాబితాను సిద్ధం చేశాయి. ఇందులో అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయంలో చదివి అక్కడ పనిచేసిన పెద్ద సంఖ్యలో వైద్యులు ఉన్నారు. బాంబు పేలుడు జరిగినప్పటి నుంచి ఈ వైద్యులలో చాలా మంది ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. 
 
జైష్‌తో సంబంధం ఉన్న డజనుకు మందికిపైగా వైద్యుల కోసం సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. డాక్టర్ షాహీన్ ఫోన్ నుంచి దర్యాప్తు సంస్థలు అనేక ఆధారాలను గుర్తించారు. అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయం యాజమాన్యంలోని భూమిపై అధికారులు సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో ఫరీదాబాద్ పోలీస్ సీఐఏ పత్రాలను పరిశీలించడానికి విశ్వవిద్యాలయ యజమానిని, ట్రస్ట్ కార్యాలయానికి వెళ్లింది.

అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయ యజమాని జావేద్ అహ్మద్ సిద్ధిఖీ నివాసం ఉండగా, చారిటబుల్ ట్రస్ట్‌ సైతం అక్కడే ఉంది. ఫిరోజ్‌పూర్ ఝిర్కాకు చెందిన డాక్టర్ మొహమ్మద్, నుహ్‌కు చెందిన డాక్టర్ రిహాన్, పున్హానాలోని సున్హేదా గ్రామానికి చెందిన డాక్టర్ ముస్తాకీమ్‌లను పోలీసులు ప్రశ్నించేందుకు అదుపులోకి తీసుకొని శనివారం రాత్రి ఆలస్యంగా అరెస్టు చేశారు. 

నవంబర్ 10న ఎర్రకోట మెట్రో స్టేషన్ వెలుపల పేలిపోయిన కారును నడిపిన వైద్యుడు ఉమర్ నబీకి కాశ్మీర్‌కు చెందిన సహాయకుడిని దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అదుపులోకి తీసుకుంది. ఢిల్లీ పోలీసుల నుండి కేసును స్వాధీనం చేసుకున్న తర్వాత, దాడిలో పాల్గొన్న కారును రిజిస్టర్ చేసిన అమీర్ రషీద్ అలీని ఎన్ఐఏ ఢిల్లీ నుండి అరెస్టు చేసింది. జమ్మూ కాశ్మీర్‌లోని పాంపోర్‌లోని సంబూరా నివాసి అయిన నిందితుడు, ఆత్మాహుతి దాడికి కుట్ర పన్నాడని దర్యాప్తులో వెల్లడైంది. 
 
కాగా, జమ్మూ కాశ్మీర్‌లోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేస్తున్న హర్యానాకు చెందిన వైద్యురాలు ప్రియాంక శర్మను అదుపులోకి తీసుకున్నట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు. ఆదివారం నాడు జమ్ముకాశ్మీర్ అనంత్‌నాగ్‌లో ప్రియాంక ఉంటున్న హాస్టల్ పై దాడి చేసి.. ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆమె మొబైల్ ఫోన్, సిమ్ కార్డును స్వాధీనం చేసుకున్న పోలీసులు ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. మొబైల్, సిమ్ కార్డు ద్వారా మరింత సమాచారం తెలిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 

నివేదికల ప్రకారం, నవంబర్ 15న అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయంలో మహ్మద్ విధుల్లో చేరాల్సి ఉంది. కానీ, ఆ సమయానికి ముందే ఢిల్లీలో పేలుడు జరిగింది. అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయ వైద్యులు, సిబ్బంది విద్యార్థులను కశ్మీర్ బనేగా దారుల్‌ ఇస్లాం, షరియత్-బలిదానం నినాదాలతో బ్రెయిన్‌ వాష్‌ చేస్తున్నారు. 

ఈ నినాదాలు ఉగ్రవాద సంస్థ అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్‌కు చెందినవి. పాకిస్తాన్‌లో ఉంటున్న హ్యాండ్లర్లు ఢిల్లీకి సమీపంలో ఉన్న అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన ఈ నినాదాల ద్వారా దేశ రాజధానిని, చుట్టు పక్కల ప్రాంతాలను భయభ్రాంతులకు గురి చేయడానికి కుట్రపన్నారు. పాక్‌ హ్యాండ్లర్లు ఈ నినాదాలను డాక్టర్ ముజామిల్, డాక్టర్ ఉమర్ సహచరులకు చెప్పేవారు. ఆ తర్వాత ఈ వైద్యులంతా కలిసి సిబ్బంది, విద్యార్థులను నినాదాలు చెప్పి తప్పుదారి పట్టించేవారు.

ఉగ్రవాద సంస్థ ఈ నినాదాలలో ప్రత్యేకంగా కశ్మీర్‌ను ప్రస్తావించిందని దర్యాప్తు సంస్థలోని అధికారిక వర్గాలు తెలిపాయి. కశ్మీర్ స్థానికులైన ఈ వైద్యులు కశ్మీర్ గురించి వారి సొంత సూచనల ద్వారా ఆకర్షిస్తారని నిర్ధారించారు. తత్ఫలితంగా ఉగ్రవాదులు, పాకిస్తాన్ హ్యాండ్లర్లు మొదట డాక్టర్ షాహీన్‌ను, తర్వాత డాక్టర్ ముజామిల్‌, డాక్టర్ ఉమర్‌ను సంప్రదించారు.

డాక్టర్ ముజామిల్ పాకిస్తాన్ హ్యాండ్లర్‌కు కీలకమైన లింక్‌. డబ్బులు డెలివరీ చేసే బాధ్యతలు చూసుకునేవాడు. దాంతో పాటు పేలుడు పదార్థాలు కొనుగోలు చేయడం, నిల్వ చేయడం చేసేవాడు. ముజామిల్‌ పేలుడు పదార్థాలను రెండు ప్రదేశాల్లో దాచినట్లుగా గుర్తించారు. అక్టోబర్‌ 30న ముజామిల్‌ను అరెస్టు చేసిన తర్వాత పాక్‌ హ్యాండ్లర్‌ డాక్టర్ ఒమర్‌తో లైవ్‌ కాంటాక్ట్‌లోకి వెళ్లగా, ఆ తర్వాత మొబైల్‌ ఫోన్‌ను స్విచ్ఛాప్‌ చేశాడు.

సోషల్ మీడియా ద్వారా పాకిస్తానీ హ్యాండ్లర్‌తో మాట్లాడుతూ వచ్చాడు. సుమారు పదిరోజుల పాటు పాక్‌ హ్యాండ్లర్‌, షరియా, కశ్మీర్‌ బలిదానం నినాదంతో అతని బ్రేయిన్‌ వాష్‌ చేశాడు. దర్యాప్తు సంస్థ వివరాల ప్రకారం డాక్టర్ ఒమర్, పాకిస్తానీ హ్యాండ్లర్ ప్రతిరోజూ వీడియో కాల్ ద్వారా అనేకసార్లు మాట్లాడుకున్నారు. నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో బాంబు పేల్చి, చివరికి ప్రాణాలు కోల్పోయాడు.