లాలూ నివాసాన్ని వీడిన మరో ముగ్గురు కుమార్తెలు

లాలూ నివాసాన్ని వీడిన మరో ముగ్గురు కుమార్తెలు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) ఘోర పరాజయం తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో అంతర్గత కలహాలు తీవ్రస్థాయికి చేరాయి. రెండో కుమార్తె రోహిణి ఆచార్య తర్వాత ఆయన మరో ముగ్గురు కుమార్తెలు కూడా ఆ ఇంటి నుంచి వెళ్లిపోయారు. లాలూ మరో ముగ్గురు కుమార్తెలైన రాజలక్ష్మి, రాగిణి, చందా కూడా పాట్నాలోని కుటుంబ నివాసాన్ని వీడారు. తమ పిల్లలతో కలిసి ఆదివారం ఢిల్లీ వెళ్లారు. దీంతో లాలూ కుటుంబం మరింతగా చీలిపోయింది.

కాగా, బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ ఓటమి తప్పును తనపై వేసుకుంటున్నట్లు రోహిణి ఆచార్య శనివారం తెలిపారు. పార్టీతో పాటు కుటుంబాన్ని వదిలేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. సోదరుడు తేజస్వి యాదవ్ సన్నిహితులైన ఎంపీ సంజయ్ యాదవ్, ఆయన దీర్ఘకాల సహచరుడు రమీజ్ కోరుకున్నదే తాను చేసినట్లు చెప్పారు.

మరోవైపు ఎన్నికల్లో ఓటమికి తాను కారణమని తేజస్వి యాదవ్‌ తనను తిట్టినట్లు రోహిణి ఆచార్య ఆదివారం ఆరోపించారు. ‘నాన్నకు మురికి కిడ్నీ ఇచ్చావు’ అని సోదరుడు తనను తీవ్రంగా అవమానించడంతోపాటు దుర్భాషలాడినట్లు మరో పోస్ట్‌లో వాపోయారు. తేజస్వి తనపై చెప్పు కూడా ఎత్తినట్లు ఆమె ఆరోపించారు. శనివారం తాను ఏడుస్తూ లాలూ ఇంటిని వీడినట్లు ఆమె పేర్కొన్నారు. అనంతరం రోహిణి ఆచార్య సింగపూర్‌ వెళ్లినట్లు తెలుస్తున్నది.

కాగా, ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుటుంబంతోపాటు పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తేజ్‌ పత్రాప్‌ యాదవ్‌ సోదరి రోహిణి ఆచార్యకు జరిగిన అవమానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ భరించలేనని స్పష్టం చేశారు. తన కుటుంబంపై దాడి చేసే వారిని బీహార్ ప్రజలు క్షమించరని హెచ్చరించారు. తమ్ముడు తేజస్వి యాదవ్‌ చర్యపై ఆయన మండిపడ్డారు. 

 
‘నా సోదరి రోహిణిపై చెప్పు ఎత్తిన వార్త విన్నప్పటి నుంచి నా గుండెలో బాధ నిప్పులా మారిపోయింది. ప్రజల మనోభావాలు గాయపడినప్పుడు తెలివితేటలపై ఉన్న దుమ్ము ఎగిరిపోతుంది. ఈ కొద్దిమంది ముఖాలు తేజస్వి తెలివితేటలను కూడా కప్పేశాయి’ అని ఆన్‌లైన్‌ పోస్ట్‌లో విమర్శించారు.