యుద్ధ ఖైదీలను మార్చుకొనున్న ఉక్రెయిన్‌-రష్యా

యుద్ధ ఖైదీలను మార్చుకొనున్న ఉక్రెయిన్‌-రష్యా
రష్యా-ఉక్రెయిన్ వివాదం మూడేళ్లుగా సాగుతుండగా  రష్యాతో యుద్ధ ఖైదీలను మార్చుకునే ప్రక్రియను పునః ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ తెలిపారు.  ప్రభుత్వం దాదాపు 1,200 మంది ఉక్రేనియన్ సైనికులను స్వదేశానికి తీసుకురావడమే లక్ష్యమని చెప్పారు. 
 
అనేక సమావేశాలు, చర్చలు జరుగుతున్నాయని,  టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్యవర్తిత్వంలో చర్చలు జరిగాయని ఉక్రెయిన్ జాతీయ భద్రత, రక్షణ మండలి కార్యదర్శి రుస్తం ఉమెరోవ్ శనివారం తెలిపారు. 2022లో ఇస్తాంబుల్‌లో ఏర్పాటు చేసిన ఖైదీల మార్పిడికి సంబంధించిన నియమాలను అమలు చేయడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. 
 
తుది సాంకేతిక, విధానపరమైన నిర్ణయాలు త్వరలో తీసుకుంటామని ఉమెరోవ్ చెప్పారు. తిరిగి వచ్చిన ఉక్రేనియన్ సైనికులు తమ కుటుంబాలతో నూతన సంవత్సరం, క్రిస్మస్ వేడుకలు జరుపుకోగలరని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, వీటన్నింటి మధ్య, ఉక్రెయిన్‌పై రష్యా దాడి కొనసాగుతోంది.  తాజా సమాచారం ప్రకారం.. రష్యన్ డ్రోన్ దాడులు ఉక్రెయిన్‌లోని ఒడెస్సా ప్రాంతంలోని అనేక విద్యుత్, ఇంధన సంబంధిత ప్రదేశాలను దెబ్బతీశాయి. సౌర విద్యుత్ ప్లాంట్ కూడా ప్రభావితమైంది. శీతాకాలం సమీపిస్తున్న కొద్దీ ఉక్రెయిన్ నిరంతర రష్యన్ వైమానిక దాడులు, విద్యుత్ కోతలతో పోరాడుతోంది. 
 
ఉక్రేనియన్ వైమానిక దళం ప్రకారం రష్యా ఒక రాత్రిలో 176 డ్రోన్లు, ఒక క్షిపణిని ప్రయోగించగా, ఉక్రేనియన్ దళాలు ఈ డ్రోన్లలో 139ని కూల్చివేశాయని పేర్కొన్నారు. రక్షణ మంత్రిత్వశాఖ 57 ఉక్రేనియన్ డ్రోన్‌లను నాశనం చేసిందని పేర్కొంది. ఖైదీలను త్వరగా ఇంటికి తిరిగి వచ్చేలా, వారి కుటుంబాలతో సెలవులు జరుపుకోవడానికి వీలు కల్పించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.