బాంబు పేలుడు వద్ద దొరికిన నిషేధిత 9ఎంఎం కాట్రిడ్జ్‌లు!

బాంబు పేలుడు వద్ద దొరికిన నిషేధిత 9ఎంఎం కాట్రిడ్జ్‌లు!
ఢిల్లీ కారుబాబు పేలుడు సంఘటనా స్థలం నుంచి పోలీసులు మూడు 9ఎంఎం క్యాలిబర్‌ కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు.ఈ కాట్రిడ్జ్‌లలో రెండు లైవ్‌గా ఉండగా, ఒకటి ఖాళీ షెల్ కనిపించింది. వాస్తవానికి ఈ 9ఎంఎం కాట్రిడ్జ్‌లను నిషేధించారు. ప్రధానంగా భద్రతా దళాలు, ప్రత్యేక అధికారాలు ఉన్న వ్యక్తులు మాత్రమే వీటిని వినియోగించేందుకు అనుమతి ఉంది. 

మిగతా ఎవరూ ఉపయోగించకుండా నిషేధం అమలులో ఉన్నది. ఢిల్లీ పోలీసుల వర్గాల ప్రకారం పేలుడు కేసుల దర్యాప్తులో భాగంగా సంఘటన స్థలంలో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఈ మూడు కాట్రిడ్జ్‌లను సెర్చ్‌ ఆపరేషన్ సమయంలో స్వాధీనం చేసుకున్నారు. ఈ  కాట్రిడ్జ్‌ల రూపాన్ని బట్టి చూస్తే, అవి సాధారణ వ్యక్తుల వద్ద ఉండకపోవచ్చని స్పష్టమవుతుంది. నిషేధిత కాట్రిడ్జ్‌లు పేలుడు జరిగిన ప్రదేశానికి ఎలా వచ్చాయనేదానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కుట్రలో భాగంగానే వచ్చాయా? లేకపోతే కేసును తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో సంఘటనా స్థలంలో పడేసి వెళ్లారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారాన్ని సేకరించేందుకు పోలీసులు క్యాట్రిడ్జ్‌లను ఫోరెన్సిక్‌ పరీక్షల కోసం పంపారు. ఇవి సాధారణంగా భద్రతా దళాలు ఉపయోగించే రకం కావడంతో, అవి ఆ ప్రాంతానికి ఎలా వచ్చాయి అనేదానిపై విచారణ సాగుతోంది.

అయితే అక్కడ ఎలాంటి పిస్టల్‌ లభ్యం కాలేదు. పేలుడు ప్రాంతంలో విధుల్లో ఉన్న భద్రతా సిబ్బందికి ఇచ్చిన ఆయుధాల్లోని బుల్లెట్లను కూడా ప్రత్యేకంగా తనిఖీ చేశారు. అవి సంఘటనా స్థలంలో దొరికిన కార్ట్రిడ్జ్‌లతో ఎలాంటి సంబంధం లేదని నిర్ధారించారు. దీంతో ఈ బుల్లెట్లు ఎవరి ద్వారా అక్కడికి చేరాయన్న అనుమానం మరింత బలపడింది.

దర్యాప్తులో మరో ముఖ్య అంశం “మదర్ ఆఫ్ సాతాన్”గా పిలిచే అత్యంత అస్థిరమైన పేలుడు పదార్థం టిఎటిపి (ట్రయాసిటోన్ ట్రైపెరాక్సైడ్) పై వస్తుంది. ఈ పదార్థం డిటోనేటర్ అవసరం లేకుండా కేవలం వేడితోనే పేలిపోవడం దీని ప్రమాదకర లక్షణం. ఉమర్ నబీకి దీనిపై పరిజ్ఞానం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. పేలుడు పదార్థాల స్వభావాన్ని పరిశీలించిన ఫోరెన్సిక్ నిపుణులు కూడా ఈ కోణాన్ని కచ్చితంగా పరిశీలిస్తున్నారు.

 
ఈ ఘటనలో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డవాడు డాక్టర్ ఉమర్ నబీ అక్రమ మార్గాల్లో దాదాపు 20 లక్షల రూపాయల నిధులను సమకూర్చుకున్నట్లు తెలుస్తోంది. నూహ్ ప్రాంతం నుంచి పెద్ద మొత్తంలో ఎరువులను కొనుగోలు చేసి, వాటితో పేలుడు పదార్థాలను తయారు చేశాడని అధికారులు చెబుతున్నారు. ఈ నిధుల సరఫరాలో హవాలా డీలర్లు పాల్గొన్నట్లు అనుమానంతో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.