పాకిస్తాన్‌లో సుప్రీంకోర్టుకు కంటే ఉన్నతస్థానంలో ప్రత్యేకంగా ఫెడరల్ కానిస్ట్యూషనల్ కోర్టు (సమాఖ్య రాజ్యాంగ న్యాయస్థానం- ఎఫ్‌సిసి) ఏర్పాటు చేస్తూ తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ అక్కడి న్యాయ వ్యవస్థ సంక్షోభానికి దారితీస్తోంది. ఎఫ్‌సిసి ఏర్పాటు కోసం చేపట్టిన రాజ్యాంగ సవరణ పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇదివరకు ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రాజీనామా చేశారు.
ఇప్పుడు అదే బాటలో శనివారం నాడు లాహోర్ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి షామ్స్ మెహమూద్ మీర్జా వైదొలిగారు. దీంతో ఆయన వివాదాస్పదమైన సవరణ చట్టంగా మారిన తర్వాత రాజీనామా చేసిన తొలి హైకోర్టు న్యాయమూర్తి అయ్యారు. జస్టిస్ మీర్జా 2028లో పదవీ విరమణ చేయాల్సి వుంది. ఈ పరిణామాలతో అక్కడి న్యాయ నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దేశ రాజ్యాంగానికి నూతనంగా తీసుకువచ్చిన సవరణ ద్వారా రాజ్యాంగంపై, న్యాయవ్యవస్థపై దాడి చేయడాన్ని వారందరూ తీవ్రంగా నిరసించారు. సవరించిన చట్టం ప్రకారం, రాజ్యాంగానికి సంబంధించిన అంశాలను విచారించడానికి ఫెడరల్ రాజ్యాంగ కోర్టు (ఎఫ్‌సిసి)ని ఏర్పాటు చేశారు.
ప్రస్తుతమున్న సుప్రీం కోర్టు కేవలం సాంప్రదాయ సివిల్, క్రిమినల్ కేసులను మాత్రమే విచారిస్తుంది. కొత్తగా ఏర్పాటు చేసిన పాకిస్తాన్ ఫెడరల్ రాజ్యాంగ కోర్టుకు తొలి చీఫ్ జస్టిస్‌గా జస్టిస్ అమినుద్దిన్ ఖాన్ నియమితులయ్యారు. ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ 2030వరకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (సిడిఎఫ్) పదవిలో కొనసాగేందుకు కూడా రాజ్యాంగానికి చేసిన ఈ 27వ సవరణ అనుమతిస్తుంది.
27వ సవరణను అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ ఆమోదించిన గంటల వ్యవధిలోనే ఈ నెల 13న సుప్రీం సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ సయ్యద్‌మన్సూర్ అలీ షా, జస్టిస్ ఆథర్ మినల్లా రాజీనామా చేశారు. దేశ అత్యున్నత న్యాయ వేదికగా వున్న సుప్రీం కోర్టును ఎఫ్‌సిసి కాలరాచిందని వారు విమర్శించారు. ఎఫ్‌సిసి తీసుకున్న నిర్ణయాలకే సుప్రీంకోర్టు సహా అన్ని కోర్టులు కట్టుబడి వుండాలి. దీన్ని వారు తీవ్రంగా నిరసించారు.

More Stories
భారతీయ మహిళ పాక్‌లో మతం మారి అక్కడి వ్యక్తితో పెళ్లి
ట్రంప్ గాజా శాంతి ప్రణాళికపై ఐరాసలో సోమవారం ఓటు
మీకు ఎంతమంది భార్యలు?