గిరిజన వర్గాల్ని గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వాలు 

గిరిజన వర్గాల్ని గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వాలు 

ఆరు దశాబ్దాలుగా కాంగ్రెస్ ప్రభుత్వాలు గిరిజనవర్గాల్ని గాలికి వదిలేశాయని  ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. గిరిజనుల ఆరాధ్యదైవం బిర్సాముండా పుట్టినరోజు సందర్భంగా గుజరాత్‌లోని నర్మదాలో జన్‌జాతీయ గౌరవ్‌దివస్‌ వేడుకల్లో పాల్గొంటూ వేల సంవత్సరాలుగా భారతదేశ చైతన్యంలో గిరిజనులు అంతర్భాగంగా ఉన్నారని , స్వాతంత్ర్య ఉద్యమంలో ఆదివాసీలు అందించిన సహకారాన్ని దేశం మరచిపోదని స్పష్టం చేశారు.

“గతంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు గిరిజనులను వదిలేశారు. ఆ కారణంగా విద్య, పోషకాహార లోపం కొనసాగి, ఆ ప్రాంతాలు దురదృష్టానికి గుర్తింపుగా మారాయి. ఆదివాసీ ప్రాంతంలో సికిల్‌సెల్‌ వ్యాధి ప్రమాదకరంగా మారింది. దీన్ని ఎదుర్కొనేందుకు గిరిజనప్రాంతాల్లో డిస్పెన్సరీలు, మెడికల్‌ సెంటర్లు, ఆస్పత్రుల సంఖ్యను పెంచాం. దేశంలో 6కోట్ల మంది ఆదివాసీలకు స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించాం” అని ప్రధాని తెలిపారు. 

కొత్త జాతీయ విద్యావిధానం కింద స్థానిక భాషల్లో చదువుకునే సౌకర్యం కల్పించామని పేర్కొంటూ గిరిజన సమాజానికి చెందిన పిల్లలు కేవలం భాష కారణంగా పేదవారిగా మారేవారని గుర్తు చేశారు. ఇప్పుడు స్థానిక భాషల్లో చదువుకుని ముందుకు సాగుతున్నారని, దేశాభివృద్ధిలో వీలైనంత ఎక్కువగా పాల్గొంటున్నారని ప్రధాని చెప్పారు. 

గిరిజన సమాజం నుంచి అనేక మంది స్వాతంత్ర్య సమరయోధులు ఉద్భవించారని, వారు స్వేచ్ఛా జ్యోతిని ముందుకు తీసుకెళ్లారని ప్రధాని కొనియాడారు. గిరిజన సమాజం స్వేచ్ఛ కోసం తన రక్తాన్ని చిందించిందని పేర్కొంటూ కానీ వారి సహకారాన్ని విస్మరించిన ఘనత కొన్ని కుటుంబాలకే దక్కుతుందని ధ్వజమెత్తారు. ఈ వైఖరి కారణంగా, 2014 కి ముందు భగవాన్ బిర్సా ముండాను ఎవరూ గుర్తుంచుకోలేదని తెలిపారు. 

“స్వాతంత్ర్య ఉద్యమంలో గిరిజన సమాజాల సహకారాన్ని మనం మరచిపోలేం. గిరిజనల సంక్షేమానికి బీజేపీ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుంది. మౌలిక సదుపాయాలను కల్పిస్తుంది. రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, నాగాలాండ్‌ సీఎంలు సహా పలువురు కేంద్ర మంత్రులు, గవర్నర్లు ఆదివాసీలే. ఇటీవల క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన మహిళా జట్టులో ఒక గిరిజన క్రీడాకారిణి ఉంది”అని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

అంతకుముందు, ఆ తర్వాత దేశంలో నిర్మితమవుతున్న తొలి బుల్లెట్‌ రైల్వే కారిడార్‌ ప్రాజెక్టును ప్రధాని నరేంద్రమోదీ పరిశీలించారు. సూరత్లోని అంత్రోలి ప్రాంతం దగ్గర నిర్మాణంలో బుల్లెట్‌ రైల్వే ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించారు. 508కిలోమీటర్ల ఈ కారిడర్‌ను త్వరలో అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. ఇది అందుబాటులోకి వస్తే ముంబయి- అహ్మదాబాద్ మధ్య ప్రయాణాన్ని దాదాపు రెండు గంటల పాటు తగ్గించనుంది. 

అనంతరం ప్రధాని మోదీ నర్మదా జిల్లాలోని దేదియాపాడాలో పర్యటించారు. గిరిజన స్వాతంత్ర్య సమరయోధుడు బీర్సా ముండా 150వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. సగ్బరాలోని దేవ్‌మోగ్రా గ్రామంలో గిరిజనుల కుల దేవత పందోరి మాత ఆలయంలో మోదీ పూజలు నిర్వహించారు. అనంతరం రూ.9,700 కోట్ల వ్యయంతో కూడిన పలు మౌలిక సదుపాయాలు, అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేశారు.

బీహార్ కుల ఆధారిత రాజకీయాలను తిరస్కరించిందన్న ఆయన గత రెండు సంవత్సరాలుగా ఈ బెయిలబుల్ నాయకులు బీహార్‌కు వెళ్లి కులతత్వాన్ని ప్రకటిస్తున్నారని విమర్శించారు. తమ శక్తినంతా ఉపయోగించి కులతత్వ విషాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నించారని, కానీ ఈ బీహార్ ఎన్నికలు ఈ కులతత్వ విషాన్ని పూర్తిగా తిరస్కరించారని ప్రధాని స్పష్టం చేశారు. 

ఈ ఎన్నికల్లో, విజయవంతమైన ఎన్‌డీఏ కూటమికి, ఓడిపోయిన మహా కూటమికి మధ్య 10 శాతం ఓట్ల తేడా ఉందని, ఇది ముఖ్యమైన విజయమని ప్రధాని తెలిపారు. దీని అర్థం సాధారణ ఓటర్లు ఏకగ్రీవంగా ఓటు వేశారని, ఇది బీహార్ అభివృద్ధి పట్ల ఉన్న మక్కువను ప్రతిబింబిస్తుందని ప్రధాని చెప్పారు. ఎన్నికల్లో యువత, మహిళలు ప్రతిపక్ష పార్టీలకు సరైన ఇచ్చారని, బీహార్ ప్రజలు అభివృద్ధి ఎజెండాను ఆమోదిస్తూ ప్రతిపక్షాన్ని పూర్తిగా తిరస్కరించారని తెలిపారు.