పైరసీ వెబ్‌ సైట్‌ ఐ బొమ్మ నిర్వాహకుడు రవి అరెస్ట్

పైరసీ వెబ్‌ సైట్‌ ఐ బొమ్మ నిర్వాహకుడు రవి అరెస్ట్
పైరసీ వెబ్‌ సైట్‌ ఐ బొమ్మ నిర్వాహకుల్లో కీలక వ్యక్తి ఇమ్మడి రవిని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.  రవి గత రాత్రి ఫ్రాన్స్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చారని పోలీసులకు సమాచారం అందడంతో రంగంలోకి దిగి అతడిని కూకట్‌పల్లిలో అదుపులోకి తీసుకున్నారు. అతను చాలా కాలంగా విదేశాల్లో తలదాచుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

ప్రత్యేకంగా కరీబియన్‌ దీవుల్లో ఉండి ఐ బొమ్మ వెబ్‌ సైట్‌ను ఆపరేట్‌ చేస్తున్నట్లు దర్యాప్తులో బయటపడింది. రవికి చెందిన బ్యాంక్‌ అకౌంట్లలో ఉన్న రూ.3 కోట్ల నిధులను పోలీసులు ఫ్రీజ్‌ చేశారు. ఈ డబ్బు మొత్తం సినిమాల పైరసీ ద్వారా వచ్చిన ఆదాయమేనని అధికారులు భావిస్తున్నారు. దేశంలోని పలు బ్యాంకుల్లో రవికి ఉన్న లావాదేవీలను కూడా పోలీసులు తనిఖీ చేస్తున్నారు.

కాగా ఇటీవల హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు పెద్ద ఎత్తున ఆపరేషన్‌ చేపట్టి పైరసీ ముఠాను అరెస్ట్‌ చేశారు. ఈ ముఠా వల్ల తెలుగు మూవీ ఇండిస్టీకి సుమారుగా రూ.3,700 కోట్ల నష్టం వచ్చిందని కూడా పోలీసులు తెలిపారు. ఆ క్రమంలోనే త్వరలోనే ఐ బొమ్మ నిర్వాహకులను కూడా అరెస్ట్‌ చేస్తామని సీవీ ఆనంద్‌ హెచ్చరించారు.

ఆ తర్వాత ఐ బమ్మ ఓ ప్రకటనలో తెలుగు సినీ ఇండిస్టీపై, పోలీసులపై ఘాటు విమర్శలు చేయడం తీవ్ర చర్చకు తెరలేపింది. ” హీరోలకు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్‌లు, విదేశీ ట్రిప్పులు, జల్సాలు, భారీ షూటింగ్‌ ఖర్చులు పెట్టి  చివరికి ప్రేక్షకులపై భారమేస్తున్నారని తమ వెబ్‌ సైట్‌ లో పోస్ట్‌ చేశారు. “మా వెబ్‌ సైటు మీద ఫోకస్‌ చేయటం ఆపండి లేదంటే.. మీ మీద ఫోకస్‌ చేయాల్సి వస్తుంది ” అని హెచ్చరించారు. ఫస్ట్‌ వేరే కెమెరా ప్రింట్స్‌ రిలీజ్‌ చేసే వెబ్‌ సైట్లు మీద మీ దృష్టి పెట్టండని పోస్ట్‌ చేశారు.

తెలుగు సినిమాలను పైరసీ చేయడంపై గతంలో ఐ-బొమ్మపై తెలుగు ఫిల్మ్‌ యాంటీ పైరసీ టీమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఈ వెబ్‌ సైట్‌ నిర్వాహకులు పోలీసులకు విసిరిన సవాలును ఛాలెంజ్‌ గా తీసుకున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు వారిపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. గతంలోనూ ఈ వెబ్‌ సైట్‌ కోసం పనిచేస్తున్న ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. బీహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లలో నిందితులను అరెస్ట్‌ చేసిన విషయం విదితమే.