కశ్మీర్‌ పోలీస్‌ స్టేషన్‌లో భారీ పేలుడు.. 9 మంది దుర్మరణం

కశ్మీర్‌ పోలీస్‌ స్టేషన్‌లో భారీ పేలుడు.. 9 మంది దుర్మరణం

జమ్ముకశ్మీర్‌ లోని నౌగామ్‌ పోలీస్‌ స్టేషన్‌లో భారీ పేలుడు చోటుచేసుకుంది. దీంతో తొమ్మిది మంది మృతి చెందగా, సుమారు 30 మంది గాయపడ్డారు. మృతుల్లో పోలీసులు, ఫోరెన్సిక్‌ సిబ్బంది ఉన్నారు. శుక్రవారం రాత్రి 11.22 గంటల సమయంలో జరిగిన ఈ పేలుడు ధాటికి పోలీసు స్టేషన్‌ ధ్వంసమైంది. 

ఫరీదాబాద్‌ ఉగ్ర కుట్రకు సంబంధించి ఇటీవల సీజ్‌ చేసిన పేలుడు పదార్థాల నుంచి శాంపిల్స్‌ తీస్తుండగా ఈ ఘటన జరిగినట్టు అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. భారీ పేలుడుతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయని, ఆ ప్రాంతంలో దట్టమైన పొగ వ్యాపించిందని వెల్లడించారు. 

శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారని, రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. పోలీస్‌ స్టేషన్‌లో పార్కింగ్‌లో ఉన్న పలువాహనాలకు మంటలు అంటుకున్నాయి. పేలుడు ధాటికి దాదాపు 300 మీటర్ల దూరం వరకు శరీర భాగాలు పడ్డాయని తెలిపారు.  ఇటీవల ఫరీదాబాద్‌లోని డాక్టర్‌ ముజామిల్‌ షకీల్‌ ఇంట్లో హర్యానా, జమ్ము పోలీసులు సంయుక్తంగా సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

అక్కడ 3 వేల కిలోల పేలుడు పదార్థాలతో పాటు పలు ఆయుధాలను స్వాధీనం చేసుకొని నౌగామ్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.  వాటి నుంచి నమూనాలను తీస్తుండగా విస్ఫోటం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. పేలుడుకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలాన్ని శ్రీనగర్‌ డిప్యూటీ కమిషనర్‌ అక్షయ్‌ లబ్రూ పరిశీలించారు.

పేలుడు ప్రాంతం నుంచి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నప్పటికీ, వాటిని గుర్తించడం కష్టతరంగా మారింది. తీవ్రంగా కాలిన అవశేషాలను శ్రీనగర్ పోలీస్ కంట్రోల్ రూమ్ కు తరలించి పోస్ట్‌మార్టం, ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపించారు. గాయపడిన వారిలో 24 మంది పోలీసులు, ముగ్గురు పౌరులు ఉన్నారు. వీరిని శ్రీనగర్‌లోని పలు పోలీస్‌ ఆసుపత్రులకు, ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొంతమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

భారీ పేలుడుతో పోలీస్‌స్టేషన్‌ భవనం పెద్దఎత్తున ధ్వంసమైంది. వరుసగా చిన్న చిన్న పేలుళ్లు కొనసాగడంతో రెస్క్యూ ఆపరేషన్‌లు ప్రారంభంలో ఆపాల్సి వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రమాదవశాత్తూ చుట్టుపక్కల మరిన్ని పేలుడు పదార్థాలు ఉన్నాయేమో అన్న అనుమానంతో బాంబ్‌ డిస్పోజల్‌ టీమ్‌లను అప్రమత్తంగా ఉపయోగించారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున వరకు ఎన్డీఆర్‌ఎఫ్‌, ఫైరుసిబ్బంది, ప్రత్యేక దళాలు సమన్వయంతో శిథిలాలను తొలగిస్తూ చిక్కుకుపోయిన వారిని బయటకు తీశారు.