110 సెగ్మెంట్లలో రాహుల్ పర్యటిస్తే ఒక్కటీ గెలవలేదు!

110 సెగ్మెంట్లలో రాహుల్ పర్యటిస్తే ఒక్కటీ గెలవలేదు!
బీహార్‌ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ పార్టీకి తీవ్ర నిరాశను మిగల్చడమే కాదు  ఈ ఏడాది ఆగస్టులో రాష్ట్రంలో సుదీర్ఘ యాత్రను నిర్వహించిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి గట్టి ఎదురుదెబ్బేనని చెప్పాలి. గతంలో చేసిన రెండు యాత్రల వల్ల ఇదివరకు జరిగిన కొన్ని ఎన్నికలలో తమ పార్టీ బలోపేతం అయిందని సంతోషించిన కాంగ్రెస్‌కు బీహార్‌ ఫలితాలు ఆశాభంగం కలిగించాయి.
 
ససారాంలో ప్రారంభమై పాట్నాలో ముగిసిన రాహుల్‌ యాత్ర 25 జిల్లాలను దాటుకుంటూ మొత్తం 110 అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టింది. దాదాపు 1,300 కిలోమీటర్లు సాగింది. అయితే రాహుల్‌ యాత్ర సాగిన మార్గంలో ఉన్న ఏ ఒక్క నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీకి విజయాన్ని చేకూర్చకపోవడం గమనార్హం. రాహుల్‌ గతంలో చేసిన యాత్రల వల్ల 2024 లోక్‌సభ ఎన్నికలలో మెరుగైన ఫలితం, 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కిందని కాంగ్రెస్‌ విశ్వసిస్తోంది.
బీజేపీ, ఎన్నికల కమిషన్‌పైన రాహుల్‌ చేసిన ఓటు చోరీ ప్రచారం బీహార్‌ ఓటర్లపై ఎటువంటి ప్రభావాన్ని చూపించలేకపోయింది. బీహార్‌ ఎన్నికల ఓటమిపై కాంగ్రెస్‌లో ఆత్మపరిశీలన ఇంకా మొదలు కానప్పటికీ మహాఘట్‌బంధన్‌లో ఏర్పడిన అనైక్యతే ఆ కూటమికి ప్రతికూలంగా మారినట్లు కనపడుతోంది. అనేక నియోజకవర్గాలలో జరిగిన స్నేహపూర్వక పోటీలు కాంగ్రెస్‌తోపాటు ఆర్‌జేడీని కూడా దెబ్బతీసినట్లు కనపడుతోంది.
బీహార్‌ ఫలితాల నేపథ్యంలో విపక్ష నేత రాహుల్‌ గాంధీకి బీజేపీ చురకలు అంటించింది. ఆయన నిలకడైన ఎన్నికల ఓటములకు సంకేతంగా మారారని ఎద్దేవా చేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ నేత అమిత్‌ మాలవీయ రాహుల్‌పై విరుచుకుపడుతూ ‘రాహుల్‌ గాంధీ! మరో ఎన్నికలు, మరో ఓటమి! అంటూ అవహేళన చేశారు. 2004 నుంచి 2025 వరకూ దేశంలో జరిగిన ఎన్నికల్లో రాహుల్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ దాదాపు 95 ఎన్నికల్లో ఓడిపోయిందని తెలిపారు.

“ఎన్నికల్లో నిలకడకు(ఓడిపోవడం గురించి) సంబంధించి ఏవైనా పురస్కారాలుంటే అవన్నీ ఆయన పొందేవారు. తమను అంత విశ్వసనీయంగా ఎలా కనుగొంటాడో అని ఎదురు దెబ్బలు కూడా ఆశ్చర్యపోతూ ఉండాలి” అని వ్యాఖ్యానించారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్‌ భండారి మాట్లాడుతూ ‘రాహుల్‌ గాంధీ నెం.1 వివాద రహిత, సవాల్‌ లేని, అపజయం లేని నాయకుడు. 95 ఎన్నికల్లో ఓటమి.. అవింకా కొనసాగుతున్నాయి.’ అని పేర్కొన్నారు.