తెలంగాణాలో సెంటిమెంట్ పని చేయదా!

తెలంగాణాలో సెంటిమెంట్ పని చేయదా!
సిట్టింగ్ అభ్యర్థి మరణిస్తే, తదుపరి జరిగే ఉప ఎన్నికలలో వారి కుటుంబ సభ్యులు పోటీ చేస్తే గతంలో ఇతర పార్టీలు పోటీ పెట్టకుండా గెలిపించిన సందర్భాలు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో అనేకం ఉన్నాయి. ఒకవేళ పోటీ జరిగినా, మృతి చెందిన అభ్యర్థి పట్ల సానుభూతితో వారి కుటుంబ సభ్యులను ప్రజలు గెలిపించిన సందర్భాలు సహితం అనేకం ఉన్నాయి. 

కానీ, తెలంగాణాలో అటువంటి సెంటిమెంట్ పనిచేయడం లేదని స్పష్టం అవుతుంది. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం చేపట్టిన తర్వాత 2016లో రెండు ఉప ఎన్నికలు జరిగాయి. నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల కిష్టారెడ్డి, పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్ రెడ్డి మరణించడంతో ఒకే ఏడాదిలో రెండు ఉప ఎన్నికలు జరిగాయి.

నారాయణఖేడ్ కాంగ్రెస్ అభ్యర్థిగా కిష్టారెడ్డి కుమారుడు సంజీవ రెడ్డి, పాలేరు కాంగ్రెస్ అభ్యర్థిగా  వెంకట్ రెడ్డి సతీమణి సుచరితారెడ్డి బరిలో నిలిచారు. సెంటిమెంట్ కలిసి రావడంతో పాటు సిట్టింగ్ స్థానం కావడంతో విజయం ఖాయమని అనుకున్నారు. కానీ ఈ రెండు కాంగ్రెస్ సెట్టింగ్ స్థానాలను బీఆర్ఎస్ దక్కించుకుంది. నారాయణఖేడ్, పాలేరు నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగిరింది.

కాంగ్రెస్ తెలంగాణలో అధికారం చేపట్టిన తర్వాత కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. టిఆర్ఎస్ పార్టీకి చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో, అక్కడ జరిగిన ఉప ఎన్నికలో ఆమె సోదరి నివేదిత బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలిచిన శ్రీ గణేష్ విజయం సాధించారు.

ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఎన్నికల ఓట్ల లెక్కింపు చివరి దశకు చేరింది. 20వేల ఓట్ల ఆదిత్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ దూసుకెళ్తున్నారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. గోపీనాథ్ సతీమణి సునీత బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇక్కడ కూడా ఫలితం కాంగ్రెస్ పార్టీకే అనుకూలంగా వచ్చింది.

2016లో కాంగ్రెస్ రెండు సిట్టింగ్ స్థానాలను బీఆర్ఎస్ దక్కించుకుంటే, ఇప్పుడు టిఆర్ఎస్ రెండూ సెట్టింగ్స్ స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగిరింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ లో ఒక్క స్థానంలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. కానీ అనంతరం జరిగిన రెండు ఉప ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు.