కర్బన ఉద్గారాలు గతేడాది కన్నా 1.1 శాతం పెరుగుదల

కర్బన ఉద్గారాలు గతేడాది కన్నా 1.1 శాతం పెరుగుదల
ప్రపంచవ్యాప్తంగా శిలాజ ఇంధనాల నుండి వెలువడే కర్బన ఉద్గారాల స్థాయి ఈ ఏడాదిలో రికార్డు సృష్టించనుందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. గతేడాది కన్నా ఇది 1.1 శాతం పెరుగుతోంది. ఈ ఏడాది శిలాజ ఇంధనాల కార్బన్‌ డయాక్సైడ్‌ ఉద్గారాలు 38.1 బిలియన్ల టన్నులకు చేరుకుంటాయని గ్లోబల్‌ కార్బన్‌ బడ్జెట్‌ 2025 అంచనా వేసింది. 
 
అంతర్జాతీయ శాస్త్రీయ కన్సార్టియం అయిన గ్లోబల్‌ కార్బన్‌ ప్రాజెక్టు దీన్ని రూపొందించింది. పునర్వినియోగ ఇంధన విస్తరణ ఎంత జరిగినా దాన్ని దాటి అంతర్జాతీయంగా ఇంధన డిమాండ్‌ పెరుగుతునే వస్తోందని అందువల్ల కాలుష్య ఉద్గారాలు కూడా పెరుగుతున్నాయని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో గ్లోబల్‌ వార్మింగ్‌ను 1.5 డిగ్రీల సెల్సియస్‌ కన్నా పెరగకుండా చూడాల్సిన లక్ష్యం నెరవేరే పరిస్థితులు కనిపించడం లేదని ఆ నివేదిక హెచ్చరించింది.
పైగా కర్బన కాలుష్యాన్ని సహజసిద్ధమైన రీతిలో హరించుకునే సముద్రాలు, అడవులు వంటివి కూడా వాతావరణ మార్పుల వల్ల బలహీనపడుతున్నాయని నివేదిక పేర్కొంది. కార్బన్‌ డయాక్సైడ్‌ ఉద్గారాలు ఇలానే పెరుగుతూ పోతుంటే, గ్లోబల్‌ వార్మింగ్‌ను 1.5 డిగ్రీల సెల్సియస్‌ కన్నా దిగువకు వుండేలా చూడడమ్నది ఇక ఎంతోకాలం సాధ్యం కాదని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన ఎక్సెటెర్‌ యూనివర్శిటీ ప్రొఫెసర్‌ పియర్రె స్పష్టం చేశారు.
 
ప్రస్తుతమున్న రీతిలోనే కాలుష్య కారకాల రేటు కొనసాగినట్లైతే, 1.5 డిగ్రీల సెల్సియస్‌కు గ్లోబల్‌ వార్మింగ్‌ను పరిమితం చేయడానికి మనవద్ద మిగిలిన కార్బన్‌ డయాక్సైడ్‌ బడ్జెట్‌ చాలా వేగంగా అంటే 2030లోగానే హరించుకుపోతుంది. కాబట్టి మనం అత్యంత ప్రాధాన్యతారీతిలో కాలుష్యాలను తగ్గించుకోవాల్సిన ఆవశ్యకతను ఇది తెలియచేస్తోందని ఆయన వివరించారు.  కొంత పురోగతి జరిగినా అదేమాత్రం సరిపోదని పరిశోధకులు చెబుతున్నారు.
 
వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు జరుగుతున్న ప్రయత్నాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. 35దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను అభివృద్ధిపరుచుకుంటునే తమ కాలుష్యాలను తగ్గించుకోవడంలో కూడా విజయం సాధించారని ఈస్ట్‌ ఆంగ్లియా యూనివర్శిటీ ప్రొఫెసర్‌ కారిన్నె లా క్వెరె తెలిపారు. పురోగతి ఎంత సాధించినా అది నిలకబడగా కాలుష్య స్థాయిని తగ్గించేలా లేదని ఆమె హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అత్యవసర కార్యాచరణ అనివార్యమని స్పష్టం చేశారు.