జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం

జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం

ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికలో కాంగ్రెస్​ ఘన విజయం సాధించింది. 24,500 ఓట్లకు పైగా మెజార్టీతో నవీన్​ యాదవ్​ విజయం సాధించారు. ప్రతి రౌండ్​లోనూ కాంగ్రెస్​ అభ్యర్థి స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చారు. ఏ రౌండ్​లోనూ బీఆర్​ఎస్​కు ఆధిక్యం అనేది దక్కలేదు. అధికారంలోకి వచ్చాక రెండు ఉపఎన్నికల్లోనూ కాంగ్రెస్​ గెలిచింది. 2024 జూన్​లో జరిగిన కంటోన్మెంట్​ ఉపఎన్నికలోనూ కాంగ్రెస్​ విజయం సాధించింది. 

 జూబ్లీహిల్స్​ నియోజకవర్గ చరిత్రలో అత్యధిక మెజారిటీని కాంగ్రెస్​ పార్టీ సాధించింది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత రెండో స్థానంతో సరిపెట్టుకోగా, బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి డిపాజిట్ కోల్పోయారు. 

జూబ్లీహిల్స్‌లో తమ ప్రయత్నం తాము చేశామని, అయితే ఎంఐఎం మద్దతు, డబ్బుతోనే కాంగ్రెస్‌ గెలిచిందని కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. పేర్కొన్నారు. ఓటమిపై విశ్లేషించుకుంటున్నామని తెలిపారు. జూబ్లీహిల్స్‌లో బీజేపీకి బలం లేదని, అక్కడ కార్పొరేటర్లు కూడా లేరని, అయినప్పటికీ తమ శక్తినంతా కూడగట్టుకుని ప్రచారం చేశామని పేర్కొన్నారు.

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో రిగ్గింగ్, రౌడీయిజం గెలిచాయని బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్‌ ఆరోపించారు. ప్రతిచోట రిగ్గింగ్‌ చేయడం వల్లనే కాంగ్రెస్‌ గెలిచిందని ఆమె తెలిపారు. కాంగ్రెస్‌ది గెలుపే కాదని., నైతిక విజయం తనది, బీఆర్‌ఎస్‌దే అని ఆమె స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామికంగా ఎన్నికలు జరిగాయని ఆమె ధ్వజమెత్తారు. పోలింగ్‌ రోజున ఎంతో అరాచకం సృష్టించారని తెలిపారు.

కౌంటింగ్ ప్రారంభంలో పోటీ అత్యంత హోరాహోరీగా సాగుతుందని అందరూ భావించినప్పటికీ రెండో రౌండ్ నుంచి ఫలితం అనూహ్యంగా కాంగ్రెస్ వైపు ఏకపక్షంగా మారింది. మొదట జరిగిన పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ కేవలం నాలుగు ఓట్ల స్వల్ప ఆధిక్యం మాత్రమే కనబరిచింది. కీలకమైన షేక్‌పేట్ ప్రాంతానికి సంబంధించిన తొలి ఈవీఎం కౌంటింగ్‌లో కూడా కాంగ్రెస్ ఆశించిన భారీ మెజార్టీ రాలేదు.

దీంతో పోరు చివరి వరకు నువ్వా-నేనా అన్నట్లు కొనసాగుతుందని, బీఆర్‌ఎస్ గట్టి పోటీ ఇస్తుందని భావించారు. అయితే రెండో రౌండ్ పూర్తి అయిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తొలి రౌండ్‌లో 47 ఓట్ల స్వల్ప ఆధిక్యం కనబరిచిన నవీన్ యాదవ్ ఆ తర్వాత ఏ రౌండ్‌లోనూ వెనుదిరిగి చూడలేదు. ప్రతి రౌండ్‌లోనూ దూసుకెళ్లిపోయారు. 

ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ పార్టీ బలంగా ఉన్నా, ఎక్కువ ఓట్లు వస్తాయని అంచనా వేసిన ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు. దీంతో ప్రతి రౌండ్‌లోనూ కాంగ్రెస్‌కు మూడువేలకు పైగా ఓట్ల మెజార్టీ సాధిస్తూ వెళ్లారు. జూబ్లీహిల్స్ విజయంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.