టీటీడీకి త్వరలో ఏఐ చాట్‌బాట్‌

టీటీడీకి త్వరలో ఏఐ చాట్‌బాట్‌

భక్తులకు మెరుగైన సేవలు అందించడంపై తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అత్యాధునిక ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ క్రమంలోనే కృత్రిమ మేధ (ఏఐ) చాట్‌బాట్‌ సేవలు సైతం ప్రవేశ పెట్టేందుకు ఇటీవల టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. 

అందులో భాగంగా అత్యుత్తమ చాట్‌బాట్‌ సేవలు అందించే సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానించగా అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ (ఏడబ్ల్యుఎస్), గూగుల్‌ క్లౌడ్‌ తదితర సంస్థలు పాల్గొన్నాయి.  వీటిలో ఏడబ్ల్యూఎస్‌ సంస్థ ఏడాదికి రూ.50 లక్షలకే సేవలు అందించేందుకు ముందుకు రావడంతో సదరు టెండర్‌ను టీటీడీ ఆమోదించింది. త్వరలోనే భక్తులకు ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. 

ముఖ్యంగా ఆన్‌లైన్‌లో శ్రీవారి దర్శనం, సేవలు, వసతి గదులు, విరాళాలు ఇతర ముఖ్యమైన సమాచారాన్ని భక్తులు క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఫిర్యాదులు, అభిప్రాయాలనూ పంపవచ్చు. దాదాపు 13 భారతీయ భాషల్లో చాట్‌బాట్‌ సిద్ధమవుతోంది. స్పీచ్‌ టు టెక్ట్స్, టెక్ట్స్‌ టు స్పీచ్‌ సదుపాయాన్ని అందిచనున్నారు. ఈ మేరకు టీసీఎస్‌ సంస్థ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తోందని టీటీడీ డిప్యూటీ ఐటీ జీఎం వెంకటేశ్వరనాయుడు తెలిపారు.

మరోవైపు శ్రీవారి భక్తులకు మెరుగైన వసతుల కల్పనకు తిరుమల తిరుపతి దేవస్థానం పెద్దపీట వేస్తోంది. ఏఐ టెక్నాలజీతో రెండు గంటల్లోనే సాధారణ భక్తులకు దర్శనం చేయిస్తామని టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు ఇటీవల తెలిపారు. లడ్డూ, అన్నప్రసాదంలో నాణ్యత పెంచామని స్పష్టం చేశారు. శ్రీవారి సమయ నిర్దేశిత దర్శన టోకెన్లు (ఎస్‌ఎస్‌డీ) కలిగిన భక్తులు తిరుమలలో పడుతున్న ఇక్కట్లను తొలగించేలా టీటీడీ ధర్మకర్తల మండలి ఇటీవలే కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే.

తిరుపతిలో ప్రతిరోజూ దాదాపు 12 వేల నుంచి 16 వేల వరకు ఎస్‌ఎస్‌డీ టోకెన్లు జారీ చేస్తున్నారు. వీటిని పొందిన భక్తులు తిరుమలకు వచ్చాక స్థానిక ఎంబీసీ ప్రాంతంలోని ఏటీజీహెచ్‌ అతిథి గృహం సమీపంలోని ప్రవేశ మార్గం నుంచి క్యూలైన్‌లోకి వెళ్లాలి. ఈ ప్రాంతంలో స్థలం ఇరుగ్గా ఉండటంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని విస్తరించాలని బోర్డు నిర్ణయించింది. ఇక్కడ నూతనంగా 4 వేల మంది భక్తులు కూర్చునేలా నూతన షెడ్, క్యూలైన్ల ప్రవేశ మార్గాన్ని నిర్మించనున్నట్లు అధికారులు తెలుపుతున్నారు.