మంచినీటి చేపల ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి మంచినీటి చేపల (ఇన్ ల్యాండ్ ఫిషరీస్) ఎగుమతుల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఫిషరీస్ హబ్ ఏర్పాటుతో మత్స్య పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం రూ.47 కోట్లను మంజూరు చేసింది. ఫిషరీస్ కేంద్రాన్ని హైదరాబాద్ శివారు రంగారెడ్డి జిల్లా కోహెడలో మొత్తం 13 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చెన్నైకి చెందిన ‘కులు’ కన్సల్టెన్సీ సంస్థ ద్వారా సమగ్ర ప్రాజెక్టు రిపోర్టును తయారు చేయించింది. ఈ నిర్మాణం కోసం ఇటీవల టెండర్లను కూడా పిలిచింది. దేశంలో జలాశయాలు, డ్యామ్‌లు, చెరువులు, కుంటల్లో చేపల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం దేశీయంగా ఏటా 147.57 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి జరుగుతోంది.
అయితే, ఇందులో కేవలం 42% మాత్రమే స్థానికంగా వినియోగం అవుతుండగా, 6% మాత్రమే దేశీయ మార్కెట్లలో ఎగుమతి అవుతుంది. మిగిలిన ఉత్పత్తులు నిరుపయోగంగా మారుతున్నాయి. ఈ వృథాను అరికట్టి, అధికంగా ఉన్న ఉత్పత్తిని అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి చేసేందుకు వీలుగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
మంచినీటి చేపల ఉత్పత్తిని ప్రోత్సహించే ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి యోజన (పిఎంఎంకెఎస్ఎస్ వై) పథకం అమలులో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచినట్లు కేంద్ర ప్రభుత్వ అధ్యయనంలో తేలింది. తెలంగాణలో జలాశయాలతో సహా వివిధ నీటి వనరులలో ఏకంగా 5.73 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో చేపల ఉత్పత్తి జరుగుతుండటం ప్రధాన కారణం.
2024లో రాష్ట్రంలో మంచినీటి చేపల ఉత్పత్తి 4,39,513 టన్నులు, మంచినీటి రొయ్యల ఉత్పత్తి 16,532 టన్నులుగా నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.122 కోట్ల వ్యయంతో ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తూ మత్స్యకారులకు అండగా నిలుస్తోంది. ఈ అంశాలన్నీ కేంద్రం ప్రణాళికకు అనుగుణంగా ఉండటంతో అంతర్జాతీయ ఎగుమతుల కేంద్రాన్ని తెలంగాణకు మంజూరు చేశారు.
అంతర్జాతీయ ఎగుమతుల కేంద్రం కావడంతో కేంద్రం ఆదేశాల మేరకు విమానాశ్రయానికి అత్యంత సమీపంలో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రంగారెడ్డి జిల్లా కోహెడ ప్రాంతంలో 13 ఎకరాలను అధికారులు ఎంపిక చేశారు. ఈ ప్రాంతం శంషాబాద్ ఎయిర్‌పోర్టుతో పాటు జాతీయ రహదారిని ఆనుకుని ఉండటం, కార్గో రవాణాకు, ఆంధ్రప్రదేశ్‌లోని ఓడరేవుల ద్వారా ఎగుమతులకు అనుకూలంగా ఉండటం విశేషం.
ఇప్పటికే పదెకరాల భూమిని సేకరించిన అధికారులు, టెండర్ల ప్రక్రియను ఈ నెలలోనే పూర్తి చేసి డిసెంబరులో శంకుస్థాపన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఏడాదిలోగా భవనాల నిర్మాణం పూర్తి చేయనున్నారు. ఈ ఎగుమతుల కేంద్రం ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మత్స్యకారులు, వ్యాపారులు భారీగా లబ్ధి పొందనున్నారు. స్థానికంగా దాదాపు 5,000 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుంది.
ఇక్కడ నిర్మించనున్న భారీ హోల్‌సేల్ మార్కెట్లో మరో 2,000 మందికి వ్యాపార అవకాశాలు దొరుకుతాయి. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాల కారణంగా దేశం నుంచి రొయ్యల ఎగుమతులకు కొంత విఘాతం ఏర్పడిన నేపథ్యంలో ఈ కొత్త కేంద్రం రొయ్యలతో పాటు భారీగా చేపలను ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు కీలక కేంద్రంగా మారుతుందని కేంద్ర మత్స్యశాఖ సంయుక్త కార్యదర్శి నీతూకుమారి ప్రసాద్ పేర్కొన్నారు.

More Stories
ప్రజల కేంద్రీకృత మార్పులకై వాతావరణ సదస్సులో భారత్ పిలుపు
రెడ్ కారిడార్: అశాంతి ముగింపుకు భారతదేశ సుదీర్ఘ యుద్ధం
ఢిల్లీ పేలుడు కిరాతక ఉగ్ర ఘాతుకం