రక్షణ వ్యయం పెంపుపై జి7 దేశాల మధ్య విబేధాలు

రక్షణ వ్యయం పెంపుపై జి7 దేశాల మధ్య విబేధాలు
రక్షణ వ్యయం, వాణిజ్యం, గాజాలో కాల్పుల విరమణ ప్రణాళిక, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి స్వస్తి పలికే యత్నాలు వంటి పలు అంశాలపై అమెరికాకు, కెనడా వంటి సాంప్రదాయ మిత్రపక్షాలకు మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో జి 7 దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు దక్షిణ ఓంటారియోలో సమావేశమయ్యారు.  వాణిజ్యపరమైన ఒత్తిళ్ళు వున్నప్పటికీ పలు అంశాల్లో సంబంధాలు కొనసాగించాల్సి వుందని కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్‌ ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.
మంగళ, బుధవారాల్లో జి 7 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి కెనడా ఆతిథ్యం ఇచ్చింది. ఈ సమావేశానికి ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, భారత్‌, సౌదీ అరేబియా, మెక్సికో, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికా, ఉక్రెయిన్‌ దేశాల విదేశాంగ మంత్రులను కూడా అనితా ఆనంద్‌ ఆహ్వానించారు. మధ్య ప్రాచ్యంలో దీర్ఘకాలంలో శాంతి సుస్థిరతలను ముందుకు తీసుకెళ్ళడంపై సహా పలు అంశాలపై మంగళవారం చర్చించినట్లు చెప్పారు.
శాంతి ప్రణాళికను ఎట్టి పరిస్థితుల్లోనూ పరిరక్షించాలని ఆమె వ్యాఖ్యానించారు. ప్రధానంగా రక్షణ వ్యయం ఈ గ్రూపు సభ్య దేశాల మధ్య ఘర్షణకు కేంద్రంగా వుంది. జపాన్‌ తప్ప మిగిలిన దేశాలన్నీ నాటో సభ్య దేశాలే. మిత్రపక్షాలన్నీ తమ రక్షణ వ్యయంలో 5 శాతం పెంచాలని ట్రంప్‌ డిమాండ్‌ చేస్తున్నారు. కొన్ని దేశాలు అంగీకరించగా, మరికొన్ని ఒప్పుకోలేదు. అలాగే గాజా శాంతి ప్రణాళికపై కూడా ఇలాగే విభేదాలు నెలకొన్నాయి. పాలస్తీనాను ఒక దేశంగా గుర్తిస్తామని బ్రిటన్‌, కెనడా, ఫ్రాన్స్‌లు ప్రకటించాయి.
భారత్‌, కెనడాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని పునర్నిర్మించేందుకు తాను ఎదురుచూస్తున్నట్లు విదేశాంగ మంత్రి జై శంకర్‌ చెప్పారు. జి 7 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి ఓంటారియో వచ్చిన జై శంకర్‌ కెనడా మంత్రి అనితా ఆనంద్‌తో భేటీ అయ్యారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు. వాణిజ్యం, ఇంధనం, భద్రత, ప్రజల మధ్య సంబంధాలు వంటి అంశాలపై ఇరువురం చర్చించినట్లు అనితా ఆనంద్‌ తన ఎక్స్‌ పోస్టులో పేర్కొన్నారు.