డిజిటల్ మీడియాలోనే అత్యధికంగా ప్రకటనల ఉల్లంఘనలు చోటు చేసుకుంటున్నాయని అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎఎస్సిఐ) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్‌తో ముగిసిన కాలానికి సంబంధించిన ఆర్థ వార్షిక కంప్లయింట్ నివేదికను ఎఎస్సిఐ వెల్లడించింది. ప్రపంచంలో డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ఆధిపత్యాన్ని, అదే సమయంలో వాటిలో పెరుగుతున్న ఉల్లంఘనలను స్పష్టంగా ఎత్తి చూపింది.
ఆ నివేదిక వివరాలు.. మొత్తం ప్రకటనల ఉల్లంఘన ఫిర్యాదులలో అత్యధికంగా 97 శాతం డిజిటల్ మీడియా నుంచే రావడం దిగ్భ్రాంతికరమైన విషయం. టివి, ప్రింట్ వంటి సాంప్రదాయ మాధ్యమాలలో కేవలం 3 శాతం కంటే తక్కువగా ఉల్లంఘనలు ఉండటం విశేషం. గత ఏడాదితో పోలిస్తే ఫిర్యాదుల సంఖ్య 70 శాతం పెరిగింది. ఇది ప్రకటనలపై వినియోగదారుల్లో పెరుగుతున్న అవగాహన లేమిని సూచిస్తుంది.
అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న మెటాపై అత్యధిక ఫిర్యాదులు వచ్చాయి. మొత్తం ఉల్లంఘన లలో 79 శాతం మెటా యాజమాన్యంలోని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ నుంచే వచ్చాయి. ఇతర వెబ్సైట్లపై 13.7 శాతం, గూగుల్‌పై 4.6 శాతం చొప్పున ఫిర్యాదులు అందాయి. చట్టవిరుద్ధమైన బెట్టింగ్, వ్యక్తిగత సంరక్షణ, ఆరోగ్య సంరక్షణ, ఆహారం, పానీయాలు, విద్యా రంగానికి చెందిన ప్రకటనలు 90 శాతం ఉల్లంఘనలకు కారణమయ్యాయి.
దేశంలో చట్టవిరుద్ధమైన ఆన్లైన్ బెట్టింగ్, జూదంపై అత్యధికంగా 4,578 ఫిర్యాదులు నమోదయ్యాయి. వ్యక్తిగత సంరక్షణ (367), ఆరోగ్యసంరక్షణ (332), పానీయాలు (211), విద్య (71) రంగాలపై ఫిర్యాదులు వచ్చాయి మొత్తంగా 6,117 ప్రకటనల ఫిర్యాదులపై విచారణ చేసింది. వీటిలో 98 శాతం వాటికి సవరణ అవసరమని గుర్తు చేసింది.
భారతదేశంలోని అగ్రశ్రేణి డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్లలో 76 శాతం మంది తమ పెయిడ్ పార్ట్నర్షిప్ మార్గదర్శకాలను పాటించడం లేదు. ఇది వినియోగదారుల నమ్మకాన్ని దెబ్బతీస్తోందని ఎఎస్సిఐ పేర్కొంది. ”ఈ నివేదికలో డిజిటల్ ప్రకటనల పర్యవేక్షణలో ఉన్న సవాళ్లకు నిదర్శనం. చాలా మంది చిన్న స్థాయి ప్రకటనదారులు సరైన లీగల్ టీమ్‌లు లేకుండా పనిచేయడం, తక్కువ వ్యవధిలో ఎక్కువ డిజిటల్ క్యాంపెయిన్లు చేయడం వంటి కారణాల వల్ల ఉల్లంఘనలు పెరుగుతున్నాయి.” అని ఎఎస్సిఐ సిఇఒ మనీషా కపూర్ పేర్కొన్నారు.

More Stories
అమెరికాలో ముగిసిన షట్‌డౌన్
నిర్మలా సీతారామన్ సంతకం ఫోర్జరీ.. రూ.99 లక్షలు స్వాహా
భారత్‌పై సుంకాలు తగ్గించబోతున్నాం