దేశవ్యాప్తంగా కొన్ని ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. బుధవారం గురుగ్రామ్‌లోని ఇండిగో ప్రధాన కార్యాలయానికి గుర్తుతెలియని వ్యక్తులు బాంబు బెదిరింపు మెయిల్స్ పంపించారు. అందులో దిల్లీ, కోల్‌కతా, తిరువనంతపురం నుంచి నడుస్తున్న పలు ఇండిగో విమానాల్లో బాంబులు అమర్చినట్లు పేర్కొన్నారు.
దీనితో అప్రమత్తమైన ఎయిర్‌లైన్స్ అధికారులు ఆయా విమానాశ్రయాల అధికారులను అలర్ట్ చేశారు. దేశంలో ఢిల్లీ, ముంబయి సహా ఐదు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు వచ్చాయని ఇండిగో బుధవారం తెలిపింది. దిల్లీ, ముంబయి సహా హైదరాబాద్, చెన్నై, తిరువనంతపురం అనే ఐదు విమానాశ్రయాలపై 24 గంటల్లోగా దాడి చేస్తామని ఇండిగో ఎయిర్‌లైన్‌కు సందేశం వచ్చినట్లు పేర్కొంది.
దీనితో ఢిల్లీ విమానాశ్రయంలో బాంబు బెదిరింపు అంచనా కమిటీ (బీటీఏసీ) సమావేశమైంది. భద్రతను కట్టుదిట్టం చేయాలని స్పష్టం చేసింది. మొదట కోల్‌కతా నుంచి ముంబయికి వెళ్లనున్న ఇండిగో విమానంలో బాంబు పెట్టినట్లు బెదిరింపులు వచ్చాయి. దీంతో అందులోని 186 మంది ప్రయాణికులను కిందకు దించేసి, విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు.
అంతేకాదు ఢిల్లీ, తిరువనంతపురం విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. బాంబు స్క్వాడ్ బృందాలతో ఇండిగో విమానాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. మరోవైపు దేశరాజధాని డిల్లీలో పేలుడు సంభవించడంతో దిల్లీ విమానాశ్రయంలో భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు పేర్కొన్నారు. బెదిరింపు మెయిళ్లు పంపిన దుండగులను గుర్తించడానికి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
ఎయిర్ ఇండియా ఎక్సప్రెస్ ముంబయి-వారణాసి విమానానికి కూడా ఈ రోజు బాంబు బెదిరింపులు వచ్చాయి. అయితే అది సురక్షితంగా వారణాసిలో ల్యాండ్ అయ్యిందని ఎయిర్ లైన్స్ పేర్కొంది. “ముంబయి నుంచి వారణాసికి 170 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి బుధవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. దీనితో ప్రోటోకాల్ ప్రకారం, బీటీఏసీని వెంటనే అప్రమత్తం చేశాం. అవసరమైన అన్ని భద్రతా చర్యలు తీసుకున్నాం. చివరికి విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. అందులోని ప్రయాణికులు అందరూ సురక్షితంగా విమానం నుంచి దిగారు” అని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రతినిధి తెలిపారు.

More Stories
ఢిల్లీ పేలుడులో మిలిటరీ గ్రేడ్ పేలుడు పదార్థాలు!
బీజాపూర్‌లో ఆరుగురు మావోయిస్టుల హతం
`మతమార్పిడి’ చట్టాలపై అత్యవసర విచారణకు సుప్రీం నో