టీటీడీ కల్తీ నెయ్యి కేసులో టిటిడి ఈవోగా పని చేసిన ఏవీ ధర్మారెడ్డి అప్రూవర్‌గా మారారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో అప్పట్లో ఏం జరిగిందో సవివరంగా సిట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. వైసీపీ పాలనలో టీటీడీ పాలకమండలి చైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి ఒత్తిడి వల్లే అవన్నీ జరిగినట్టు అంగీకారించారు. కల్తీపై సీబీఐ సిట్‌కు ధర్మారెడ్డి కీలక సమాచారాన్ని అందించారు.
టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంలో రెండవ రోజు సీబీఐ సిట్ విచారణ కొనసాగుతోంది. తిరుపతి అలిపిరి కేంద్రంలో సిట్ కార్యాలయానికి టీటీడీ మాజీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి, బోలెబాబా డైరెక్టర్ విపిన్ జైన్, పామిల్ జైన్ వేరువేరుగా విచారణకు హాజరయ్యారు.
పైగా, టీటీడీ పాలకమండలి చైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి అప్పట్లో ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింగాల్‌ను ఉపయోగించుకుని కల్తీ నెయ్యికి కారణమైనట్టు ధర్మారెడ్డి బాంబు పేల్చారు.సుమారు 8.15 గంటల సేపు డీఐజీ మురళీ రాంబా, అధికారుల బృందం ఆయనపై తొలుత మంగళవారం ప్రశ్నల వర్షం కురిపించింది. ధర్మారెడ్డి తన వాంగ్మూలంలో కల్తీ నెయ్యి సరఫరా చేసిన భోలేబాబా, ఏఆర్ డైయిరీ డైరెక్టర్లతో తాను సంప్రదింపులు జరిపినట్లు అంగీకరించారు. నెయ్యి కల్తీ అవుతోందని సూచించే సీఎఫ్ఆర్ఎ నివేదికను చూసినట్లు ఒప్పుకున్నారు. “బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉంటే బాగుండేది” అంటూ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. కల్తీ నెయ్యి సరఫరా అవుతుందని అప్పటి టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డికి కూడా తెలుసని ధర్మారెడ్డి తన వాంగ్మూలంలో అంగీకరించారు.
కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన శ్రీవారి లడ్డూకు కల్తీ నెయ్యి వస్తుంటే ఎందుకు అడ్డుకోలేదని సిట్ బృందం ప్రశ్నించగా హైకమాండ్ ఒత్తిడితోనే అనుమతించాల్సి వచ్చిందని ధర్మారెడ్డి జవాబు ఇచ్చినట్టు తెలుస్తోంది. 2022 ఆగస్టులో తిరుపతి జిల్లా పునబాకలోని శ్రీ వైష్ణవి, ఉత్తరప్రదేశ్ లోని ప్రీమియర్ అగ్రీపుడ్స్, భోలేబాబా డెయిరీ ట్యాంకర్లు క్యాన్ల ద్వారా సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగిందని మైసూరులోని సీఎఫ్ఆర్ఎ ల్యాబ్ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించగా ధర్మారెడ్డి మిన్నకుండిపోయారు.
వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక 2019 జులైలో ధర్మారెడ్డిని జేఈవోగా నియమించారు. జగన్ హయాంలో ఆయనే టీటీడీలో సర్వాధికారాలు చెలాయించారు. మంత్రులు, ఎమ్మెల్యేలనూ లెక్క చేయలేదు. అనంతరం అదనపు ఈవో, ఈవోగానూ బాధ్యతలు నిర్వర్తించారు. 2024 మే 14న ఆయన డిప్యూటేషన్ గడువు ముగియగా పెంచాలని ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి నాలుగు రోజుల ముందు కేంద్రానికి జగన్ లేఖ రాయగా అనుమతి లభించింది. కూటమి ప్రభుత్వం చేతికి అధికారం వచ్చాక ఆయనను సెలవుపై పంపింది. జూన్ 30న ఆయన పదవీ విరమణ చేశారు.

More Stories
సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలి
రూ. 750 కోట్లతో యోగా అండ్ నేచురోపతి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
పుట్టపర్తికి రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ రాకకు పటిష్ట ఏర్పాట్లు