21న సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరుకానున్న జగన్!

21న సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరుకానున్న జగన్!
అక్రమాస్తుల కేసులో ఆరేళ్లుగా ప్రత్యేక మినహాయింపుతో కోర్టుకు హాజరు కాకుండా వస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 21న హైదరాబాద్ లోని సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరు కానున్నారు. తొలుత వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై కోర్టు సిబిఐ సమాధానం కోరగా, అందుకు అభ్యంతరం తెలుపుతూ సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది.
 
గత నెలలో ఐరోపా పర్యటనకు అనుమతి ఇచ్చిన కోర్టు, పర్యటన నుండి తిరిగి వచ్చిన తర్వాత వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కావాలని నాంపల్లి ప్రత్యేక న్యాయ స్థానం స్పష్టం చేసింది. గతంలో ఇచ్చిన ఆ ఉత్తర్వులను అమలు చేయాలని సిబిఐ కోరింది. జగన్‌ ఆరేళ్లుగా ట్రయల్‌ కోర్టుకు రావటం లేదనే విషయాన్ని ప్రస్తావించింది. ఈ కేసులకు సంబంధించి డిశ్చార్జి పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున జగన్‌ ప్రత్యక్షంగా కోర్టుకు హాజరవడంలో తప్పేమీ లేదని పేర్కొంది.
దీంతో, తన వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ దాఖలు చేసిన మెమోను జగన్‌ తరఫు న్యాయవాది వెనక్కి తీసుకున్నారు. మరికొద్ది రోజులు సమయం ఇస్తే మాజీ సీఎం వ్యక్తిగతంగా కోర్టులో హాజరవుతా రని తెలిపారు.  ఈ నెల 21వ తేదీ వరకు కోర్టు సమయం ఇవ్వగా, అదే రోజున న్యాయస్థానానికి జగన్‌ వస్తారని న్యాయవాది వెల్లడించారు. దీంతో, ఆరేళ్ల తర్వాత ఆయన కోర్టు మెట్లు ఎక్కనున్నారు.
తన పైన నమోదైన కేసుల్లో జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఒక్క సారి మాత్రమే కోర్టుకు వెళ్లారు. 2020 జనవరి 10న చివరి సారిగా కోర్టుకు హాజరయ్యారు. తిరిగి ఇప్పుడు వెళ్తున్నారు.  ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో 2019 మార్చిలో ఆయనకు కోర్టుకు వెళ్లారు. గత నెలలో జగన్‌ అభ్యర్థనతో ఐరోపా పర్యటనకు వెళ్లేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇవ్వడం తెలిసిందే.
తిరిగొచ్చిన తర్వాత ఈ నెల 14వ తేదీ లోపు కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కావాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా ఆదేశించింది. అందుకు అంగీకరించి ఐరోపా వెళ్లిన మాజీ సీఎం తాజాగా, హాజరు నుంచి మినహాయింపు కావాలని కోర్టులో మెమో దాఖలు చేశారు.  తాను న్యాయస్థానానికి వస్తే తగిన ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వ యంత్రాంగానికి భారమవుతుందని, ఆన్‌లైన్‌లో విచారణకు హాజరవుతానని కోర్టును కోరారు. సీబీఐ అందుకు అంగీకరించకపోవడంతో వేరే మార్గం లేక ప్రత్యక్షంగా న్యాయస్థానంలో హాజరవుతానని తెలిపారు.