రూ. 750 కోట్లతో యోగా అండ్ నేచురోపతి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్

రూ. 750 కోట్లతో యోగా అండ్ నేచురోపతి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
కేంద్ర ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా ‘అపెక్స్ రీసెర్చి ఇన్స్టిట్యూటు ఫర్ యోగా అండ్ నేచురోపతి’ (ఆర్’ వై ఎస్)ను రాష్ట్రంలో రూ.750 కోట్లతో ఏర్పాటుచేసేందుకు ముందుకొచ్చిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఎయిమ్స్ తరహాలో కేంద్ర ప్రభుత్వం ద్వారానే ఈ సంస్థ కార్యకలాపాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. 
 
సెంట్రల్ కౌన్సెల్ ఫర్ రీసెర్చి అండ్ యోగా అండ్ నేచురోపతి (మినిస్టరీ ఆఫ్ ఆయుష్) ద్వారా ఏర్పాటుకానున్న ఈ ప్రముఖ విద్యా సంస్థలో యూజీ (బ్యాచులర్ ఆఫ్ నేచురోపతి అండ్ యోగా సర్జరీ)లో తొలి ఏడాదిలో వంద సీట్లు, పీజీలో 20 సీట్ల చొప్పున భర్తీ జరుగుతుందని ప్రకటించారు.  ఇందుకు అనుగుణంగా 450 పడకలతో అన్ని రకాల వసతులతో నేచురోపతి (ప్రకృతి) ఆసుపత్రి అందుబాటులోనికి వస్తుందని పేర్కొన్నారు.
ఈ సంస్థలో రీసెర్చి అండ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు అవుతుందని తెలిపారు.  ప్రఖ్యాత విద్యా సంస్థ ఏర్పాటుకు 40 ఎకరాలను కేటాయించాలని కేంద్ర ఆయుష్ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని చెప్పారు.  కాగా, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం నడింపాలెం (కాటూరు వైద్య కళాశాల వద్ద) సమీపంలో రూ. 100 కోట్లతో కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ రీసెర్చి ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా, నేచురోపతి సంస్థను ఏర్పాటు చేయబోతుంది.దీనికి అనుగుణంగా కూటమి ప్రభుత్వం 12.96 ఎకరాల భూమిని కేటాయించింది. 
 
“విశాఖలో నేచురోపతి కళాశాల నిర్మాణాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నడుస్తున్నాయి. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఈ కళాశాలలో నేచురోపతి కోర్సులో వంద సీట్ల భర్తీకి కేంద్రం నుంచి ఆమోదం లభించనుంది. గతంలో ఎన్నడూలేనివిధంగా కేంద్ర ఆయుష్ శాఖ 2025-26 బడ్జెటు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 165 65 కోట్లను కేటాయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో ఇందుకు సంబంధించిన నిధులు కేటాయించనున్నాయి. 
 
ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తొలివిడత కింద తన వాటా కింద 50% నిధులు మంజూరుచేసింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను కూడా విడుదల చేసింది. కేంద్రం ఆమోదం తెలిపిన ప్రకారం రాష్ట్రంలో కొత్తగా ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రులు ఏర్పాటుకానున్నాయి. అలాగే  ధర్మవరంలో ఆయుర్వేద వైద్య కళాశాల కొత్తగా రాబోతుంది. ముఖ్యమైన పట్టణంలో యూనాని వైద్య కళాశాల కూడా ఏర్పాటుకానుంది.