బహుభార్యత్వం నిషేధం దిశగా అసోం అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించిన బిల్లును ఈనెల 25న అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిన్నట్లు అసోం ముఖ్యమంత్రి బిశ్వశర్వ వెల్లడించారు. ఇది అమల్లోకి వస్తే సంబంధిత కేసుల్లో దోషిగా తేలినవారికి ఏడేళ్లపాటు కఠిన కారాగార శిక్ష ఉంటుందని చెప్పారు. నిధిని ఏర్పాటు చేసి బాధిత మహిళలకు పరిహారం అందజేస్తామని ఓ మీడియా సమావేశంలో చెప్పారు. అయితే, ఆరో షెడ్యూల్‌లోని ప్రాంతాలకు కొన్ని మినహాయింపులు ఉంటాయని పేర్కొన్నారు.
“జీవిత భాగస్వామి జీవించి ఉన్నప్పుడు లేదా చట్టపరంగా విడాకులు పొందకుండా మరోసారి వివాహం చేసుకున్నవారిపై ఈ చట్టం వర్తిస్తుంది. ఇలాంటి అక్రమ బహుభార్య వివాహం చేసిన వారికి గరిష్టంగా 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించే నిబంధన ఉంటుంది. అదనంగా, ఈ బిల్లు ద్వారా బాధిత మహిళలకు పరిహారం అందించే నిబంధనను కూడా ఉంది” అని ముఖ్యమంత్రి తెలిపారు.
“ఇలాంటి వివాహాల వల్ల మహిళలు ఎదుర్కొంటున్న బాధను దృష్టిలో ఉంచుకొని సమాజాన్ని శాస్త్రీయంగా నియంత్రించడమే ఈ చట్టం లక్ష్యం.ఈ బిల్లుకు నవంబర్ 25న జరిగే అసెంబ్లీ సమావేశంలో ప్రవేశపెట్టి ఆమోదం పొందుతాం’ అని ఆయన పేర్కొన్నారు. లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా నూతన బిల్లును తీసుకురానున్నట్లు ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు.
ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో చారిత్రక బిల్లులను ప్రవేశపెట్టనున్నామని తెలిపారు. లవ్ జిహాద్, బహుభార్యత్వం, సత్రాల రక్షణ లాంటి కీలక బిల్లులు సభ ముందుకు రానున్నాయని చెప్పారు. ఈ బిల్లులను సభలో పెట్టి చర్చిస్తామని, డ్రాఫ్ట్ బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపాక మీడియాకు వివరిస్తామని పేర్కొన్నారు. జిహాద్‌కు పాల్పడిన వారికి జీవిత ఖైదు విధించే చట్టాలను తీసుకువస్తున్నట్లు గతేడాది సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు.
బలవంతపు మత మార్పిళ్ల ద్వారా వివాహం చేసుకోవడాన్ని అడ్డుకునేందుకు చట్టాలు అవసరమని చెప్పారు. కాగా ఇప్పటికే బహుభార్యత్వంపై అసోం ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ అనుమతి లేకుండా ఉద్యోగులు రెండో పెళ్లి చేసుకోకూడదని స్పష్టం చేసింది. ఇది సర్వీస్ నిబంధనలకు వ్యతిరేకమని పేర్కొంది. కొన్ని మతాలు రెండో పెళ్లికి అనుమతి ఇస్తాయని, అయినా సరే ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని వివరించింది.
అంతకుముందు చట్ట వ్యతిరేకంగా బాల్య వివాహాలు చేసుకున్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంది అసోం ప్రభుత్వం. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా దాదాపు 3వేల మందికి పైగా అరెస్టు చేసింది. మారుమూల ప్రాంతాల్లో అభద్రతతో జీవిస్తున్న స్థానికులకు ఆయుధ లైసెన్సులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు హిమంత బిశ్వ శర్మ తెలిపారు.
లైసెన్సల జారీ ప్రక్రియ వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రారంభవవుతుందని వెల్లడించారు. ముప్పు ఉన్న, మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల నుంచి వచ్చిన డిమాండ్‌ను సమీక్షించిన అనంతరం రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం హిమంత బిశ్వ శర్మ చెప్పారు.

More Stories
జూబ్లీహిల్స్ విషయంలో మీడియా ఎక్కడ దారితప్పుతున్నదంటే.. !
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత
పాతబస్తీలో హిందూ మైనర్ అమ్మాయిలపై డ్రగ్స్ రాకెట్ పంజా