జూబ్లీహిల్స్ విషయంలో మీడియా ఎక్కడ దారితప్పుతున్నదంటే.. !

జూబ్లీహిల్స్ విషయంలో మీడియా ఎక్కడ దారితప్పుతున్నదంటే.. !
డా. వడ్డి విజయసారధి
జాగృతి మాజీ సంపాదకులు, ప్రముఖ సామాజిక కార్యకర్త

భారతీయ జనతా పార్టీ ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీగా కాంగ్రెసును విమర్శించి నంతగా,  బిఆర్ ఎస్ ని విమర్శించటం లేదు. లోకసభ ఎన్నికల్లో బిఆర్ ఎస్ సాధించినది 0 కావటంతో, జూబ్లీహిల్స్ సెగ్మెంట్ లో కూడా బి ఆర్ ఎస్ మూడవ స్థానానికే పరిమితం కావటంతో తన విమర్శలను బిఆర్ఎస్ పై గురిపెట్టి చేయవలసిన అవసరముందని  బిజేపి భావించటం లేదు.

దీనికి తోడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా 1.2 లక్షల ముస్లిం వోట్ బ్యాంకును గుత్తగా కొల్లగొట్టే లక్ష్యంతో బిజేపి పైనే విమర్శలు చేస్తున్నారు.
బి ఆర్ ఎస్ అధికారం కోల్పోయిన స్థితిలో ఉండటం,  ఆ పార్టీ శాసనసభ్యుని మృతి కారణంగా ఉప ఎన్నిక జరుగుతూ ఉండటమూ, ఆయన భార్యే అభ్యర్థిగా ఉన్నందున, ఆమె ముందునుండీ రాజకీయాల్లో ఉన్న వ్యక్తి కానందున, ఆమెపై విమర్శలు చేయవలసిన అవసరం లేకపోవటమూ..ఈ కారణాలతో ఎవరూ కూడా టిఆర్ఎస్ ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయటం లేదు.

మరొక వైపున టిఆర్ఎస్ చేసే ప్రచారానికి నేతృత్వం వహిస్తున్న కేటీఆర్ లేవనెత్తే అంశాలకు జవాబు చెప్పటం మించి, గతంలో ఆ పార్టీ అధికారంలో ఉండగా చేసిన అవకతవకలు ఏ వైపు నుండి ప్రస్తావనకు రావటం లేదు. టిఆర్ఎస్ కూడా తెలివిగా సర్వేలను తన ఆయుధంగా ప్రయోగిస్తున్నది. గెలుపొందేది బి ఆర్ ఎస్సే , కాబట్టి బిఆర్ ఎస్ కే (కారు గుర్తుకే) వోటు వేయాలి అంటూ ప్రచారం చేసుకొంటూ పోతున్నది.

“బి ఆర్ ఎస్  బలాన్ని బిజేపి తక్కువగా అంచనా వేస్తున్నదా ?” అని వారి అమాయకత్వానికి ఆశ్చర్య పోతున్నవారూ ఉన్నారు. ఏతావాతా  మీడియాలో ఉన్నవారి అంచనా ఎలా ఉన్న దంటే, పోటీ బి ఆర్ఎస్, కాంగ్రెసుల మధ్యనే కేంద్రీకృత మౌతున్నది. విస్తృతంగా పైసలు పంచటంలో నూ వీరే పోటీపడుతున్నారు. కాబట్టి గెలుపు ఓటములు ఈ ఇద్దరి మధ్యనే ఉంటాయి. సానుభూతి అంశం బి ఆర్ఎస్ కి అనుకూలంగా పరిణమిస్తుంది.

సర్వే లన్నీ (ఇవన్నీ పైసలిచ్చి జరిపిస్తున్నవే, జనం నాడి తెలుసుకొనే దృష్టితో తటస్థంగా ఉండే పరిశీలకులు చేస్తున్న సర్వేలు కావు ఇవి) బి ఆర్ ఎస్ కే మొగ్గు ఉన్నట్లుగా చెప్తున్నవి కూడా. ఇవన్నీ బి ఆర్ఎస్ గెలుపు కే దారితీయ వచ్చునను కొంటున్నారు.

బిజేపి కేంద్రంలో అధికారంలో ఉంది. మంచి పనులు చేస్తూ ఉంది. ఇకముందు కూడా చేస్తూనే ఉంటుంది. తమకూ వోట్లు చేసేవారిని, వేయనివారిని కూడా సమానంగా చూస్తున్నది. ఈ ఎన్నిక లోకసభకు కాదు, నరేంద్ర మోదీ పరిపాలనపై రిఫరెండం (జనాభిప్రాయ సేకరణ) కాదు. బిజేపి ఓడినా, గెలిచినా ఏమీ తేడా ఉండదు అనే పరిమితమైన అవగాహనతోనే మీడియాలోని మెదళ్లు ఆలోచిస్తున్నాయి. “దైవం ఇచ్చి మరిచిపోతారు, మానవుడు తీసుకొని మరచిపోతారు”  అనే మాట ఈ సందర్భంలో గుర్తు వస్తుంది కూడా.

ప్రజలు తమ భద్రతను భవిష్యత్తులోనూ దృష్టిలో ఉంచుకొని, దేశభద్రతనూ భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకొని దేశం సావరినిటీని, ప్రజాస్వామ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆలోచించి వివేకంతో వోటు వేయవలసి ఉన్నదనే మాట గుర్తు చేయటంలో మీడియా (సోషల్ మీడియాతో సహా) విఫలమౌతున్నది. “పిచ్చివాడిని గురించి ఫిర్యాదులేదు, మంచివాడిపట్ల మర్యాద లేదు” అనే దౌర్భాగ్య స్థితి పాతుకుపోయింది.

జాతీయవాద పత్రికలు కూడా ఈ వైఫల్య భారాన్ని మోస్తూ ఉన్న స్థితి కనబడుతున్నది. ఉప ఎన్నికల గురించి వ్రాయటమంటే , గెలుపు ఓటములు సంబంధించిన ముందస్తు అంచనాలు వ్రాయటానికి పరిమితమని, ఒకవేళ తమ అంచనాలు తప్పితే తాము నవ్వుల పాలవుతామని భయపడుతున్నారో ఏమోగాని  ప్రజానీకానికి ఈ సమయంలో గుర్తు చేయవలసిన అంశాలను గుర్తుచేయడానికి వెనుకాడుతున్నారు.

ముక్తాయింపుగా మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే సుపరిపాలన కేవలం కేంద్రంలో ఏర్పడితే చాలదు. తెలంగాణలోనూ సుపరిపాలన కావాలి. భాజపా తాను సంసిద్ధమై ఆ దిశలో ముందుకు వస్తున్నట్లుగా నిరూపించు కోవాలి. కాంగ్రెసు బిఆర్ ఎస్ లు ఇంతకుముందు పరిపాలన చేస్తున్న సమయంలో వారు చేసిన తప్పులను, ఇప్పటికీ ప్రజలు అనుభవిస్తున్న వాటి పర్యవసానాలనూ గుర్తుచేయాలి.

 
నేటి సమస్యల పరిష్కారానికి, ఉజ్జ్వలమైన  భవిష్యత్తును రూపొందించుకొనడానికీ. సమగ్రమైన దృక్పథము, ఆచరణీయమైన ప్రణాళికలు, నీతి నిజాయితీగల నేతృత్వం ఉన్న పార్టీని గెలీపించాలని ప్రజలకు నచ్చజెప్పాలి. ఈ సమయంలో  రాజకీయరంగంలో ఉన్నవారు ఎటువంటి బాడీ లాంగ్వేజ్ ప్రదర్శించాలో..ఆ అంశంపైనా దృష్టిపెట్టాలని గుర్తు చేయటం కూడా తమ కర్తవ్యమని గ్రహించాలి. దీనిని వారు విస్మరించరాదు.